మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే దగడు కొడుతున్నది. రాత్రి ఏడు దాటినా వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. రాత్రి పది గంటలైనా వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నమోదు కాగా, సోమవారం అదే స్థాయిలో నమోదైంది. జగిత్యాల జిల్లా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నది.
ఇంతస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఒకింత ఆందోళన కలిగించింది. రానున్న నాలుగు రోజులు మరింత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రమాదముందని వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడుగు బయటపెడితే అగ్గి రాజుకున్నట్టు ఉండడంతో జనం ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. రోజంతా కూలర్లు, ఏసీల ముందు వాలిపోతున్నారు. బయట భరించలేని దగడు ఉండడంతో వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే జనం బెంబేలెత్తిపోతున్నరు. ఇంకా మున్ముందు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుండగా, జనం అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రామగుండం అగ్నిగోళం
రామగుండం అగ్నిగోళంగా మారింది. ప్రతి వేసవిలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ నగరంలో ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల నుంచి రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఐఎండీ రికార్డుల ప్రకారం ఐదు రోజుల క్రితం గరిష్ఠంగా 40 డిగ్రీలు నమోదైతే సోమవారం 44 డిగ్రీలకు చేరుకుంది. పగటి పూట ప్రధాన రహదారులు అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సింగరేణి ఉపరితల గనుల సమీపంలోని ప్రాంతాల్లో మరింత వేడిగా ఉంటున్నది.