Singareni | రామగిరి, జూన్ 29 : సింగరేణి కార్మిక క్షేత్రంలోని సెంటినరీ కాలనీ నుంచి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్జీ-3 జీఎం కార్యాలయానికి అత్యంత సమీపంలోనే నడి రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడి రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి వెంట మండల ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, సింగరేణికి చెందిన పలు కీలక కార్యాలయాలు ఉండటంతో పాటు, సెంటినరీ కాలనీ, అడ్రియాల ప్రాజెక్టు, పరిసర గ్రామాల ప్రజలు, కార్మికులు, అధికారులు, ఉద్యోగులు నిత్యం వేల సంఖ్యలో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయినప్పటికీ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షాల ప్రభావంతో రహదారి మధ్యలో ఏర్పడిన గొయ్యి మరింత విస్తరించి, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వారికి గొయ్యి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ-3, ఏపీఏ-2 డివిజన్లకు చెందిన జీఎం కార్యాలయాలు అతి సమీపంలోనే ఉండటం అధికారులు ప్రతిరోజూ ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రహదారి మరమ్మతులపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల రహదారి దెబ్బతిన్నప్పటికీ కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదకర గొయ్యిని పూడ్చాలని ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు, సింగరేణి కార్మికులు, వాహనదారులు కోరుతున్నారు.