Fire Accident | కాల్వశ్రీరాంపూర్, మే24 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగా మంటలు చెలరేగి వరి పొలాలంతా వ్యాపించాయి. సమీపంలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంవైపు, గ్రామ సమీపంలో ఉన్న ఇండ్లవైపు భారీ గా మంటలు చెలరేగాయి. దీంతో సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్ తో పాటు గ్రామస్తలు తేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
అటువైపు ఫైర్ ఇంజన్‌కు సమాచారమిచ్చారు. రెండు ఫైర్ ఇంజన్లతో పాటు గ్రామస్తులు, చుట్టుపక్కల ఉండి మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు ట్రాక్టర్ల సహాయంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టు మట్టి కుప్పలు పోసి మంటలు రాకుండా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు రైతులకు చెందిన వరి కొయ్యకాలుతో పాటు, విద్యుత్ వైర్లు, పైపులు, మోటార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఈరవేన లస్మమ్మ కు చెందిన పూరి గుడిసెకు నిప్పంటుకుంది. వెంటనే మంటలను ఆర్పివేయడంతో పాక్షికంగా దగ్ధమైంది. రూ.లక్షల్లో ఆస్థినష్టం జరిగినట్లు గ్రామస్తలు వాపోయారు. వరికొయ్యకాలుకు నిప్పంటించిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ జ్యోత్స్న శ్రీనివాస్, గ్రామస్థులు కోరుతున్నారు.