హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జలమండలిలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ దళిత, గిరిజన ఇంజినీర్ల హకులను కాలరాస్తున్నారని ‘తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఇంజినీర్ల ఫెడరేషన్’ ఆరోపించింది. ప్రమోషన్ల విషయంలో రాజ్యాంగం కల్పించిన ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’తోపాటు హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొకి ఎస్టీ ఇంజినీర్లకు అన్యాయం చేస్తున్నారని విమర్శించింది.
జలమండలి వర్గాలు నిజాలను దాచిపెట్టి, జాతీయ ఎస్టీ కమిషన్‌కు తప్పుడు సమాచారాన్ని సమర్పించాయని ఫెడరేషన్ చైర్మన్ ఎర్ర హరిశంకర్, ప్రధాన కార్యదర్శి సీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆధారాలు సహా జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జలమండలి నిబంధనల ప్రకారం సీజీఎం క్యాడర్లో కనీస సర్వీసు పూర్తిచేసిన వారికే డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని, కానీ నిబంధనలకు విరుద్ధంగా కనీస సర్వీసు లేకపోయినా ఓపెన్ క్యాటగిరీకి చెందిన బీ నారాయణ, పీ శ్రీనివాస్‌రెడ్డి, వీ సత్యనారాయణకు ఇన్చార్జ్ డైరెక్టర్లుగా అవకాశమిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదే సమయంలో అర్హత, సీనియారిటీ ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్ సుజాత, పీ ఆనంద్‌నాయక్‌ను పకనబెట్టారని తెలిపారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో ఎస్టీ ఇంజినీర్లకు ప్రమోషన్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. జలమండలి హెచ్ఆర్ విభాగంలో ఉన్నతాధికారులు దశాబ్ద కాలానికిపైగా ఒకేచోట తిష్టవేసి, యాజమాన్యానికి వాస్తవాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని, ఎస్సీ/ఎస్టీ అధికారులు వివరణ కోరితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4ఏ) ఆధారంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుచేయాలని జీవో-5, జీవో-26 స్పష్టంగా పేరొంటున్నాయని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం ‘క్యాచ్-అప్’ నిబంధన చెల్లదని స్పష్టం చేసిందని వివరించారు. అయినప్పటికీ, పాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టాలను వంకరగా చూపిస్తూ, ఎస్టీ ఇంజినీర్ల సీనియారిటీ జాబితాను రూపొందించకుండా జలమండలి కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు.
కిందిస్థాయి సిబ్బంది ప్రమోషన్లలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలు చేస్తున్న జలమండలి బోర్డు.. ఇంజినీర్ల స్థాయికి వచ్చేసరికి మాత్రం పకనబెడుతున్నదని పేర్కొన్నారు.జలమండలి యాజమాన్యం సమర్పించిన అసత్య నివేదికలను తోసిపుచ్చి, బాధితులైన ఎస్టీ ఇంజినీర్లకు తక్షణమే ప్రమోషన్లు కల్పించేలా జలమండలిని ఆదేశించాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్, డైరెక్టర్లను ఫెడరేషన్ కోరింది.