Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 9: రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగానికి సంబంధించిన ఆర్.పీలు గురువారం బీఎల్ ఓ విధులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. పని భారానికి తోడు బీఎల్వో విధులకు ఏలాంటి భత్యాలు చెల్లించకుండా మానసిక ఇబ్బందులకు గురి చేయడం, అధికారుల నియంతృత్వ ధోరణికి విసిగిపోయామని ఆర్పీలు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రామగుండం నగర పాలక సంస్థలో సుమారు 118 మంది ఆర్పీలు పని చేస్తుండగా, వీరిలో 112 మంది కి 2016 నుంచి బీఎల్ ఓలుగా అదనపు విధులు కేటాయించారు. అప్పుడు అంగన్వాడీ టీచర్ల ఇష్టాను ప్రకారమే వీరికి బీఎల్ ఓలుగా విధులు కేటాయించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గౌరవ వేతనంగా రూ.6 వేలు అమలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్పీలకు అదే గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తూ బీఎల్ఓ విధులకు ఏలాంటి భత్యాలు చెల్లించడం లేదు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు మాత్రం స్థానికంగానే వారు పని చేస్తున్న ఏరియాలో బీఎల్ఓ విధులు కేటాయించి ఆర్పీలకు మాత్రం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీనితో ప్రయాణ ఖర్చులు, అదనపు పని భారంతో మానసిక ఇబ్బందులకు గురైన ఆర్పీలు నగర పాలక సంస్థ కమిషనర్ తోపాటు మెప్మా టీఎంసీల దృష్టికి తీసుకవెళ్లగా, తమ పరిధిలో ఉండదని జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించడంతో అప్పటికీ కలెక్టర్ ను కలిసి తమ సమస్యను విన్నవించామని ఆర్పీలు శారద, రాజకుమారి, స్వర్ణలత తదితరులు పేర్కొన్నారు. జిల్లా అధికారులు సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో 112 మంది ఆర్పీలు బీఎల్ ఓ విధుల నుంచి తప్పుకోవాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకొని రామగుండం రెవెన్యూ కార్యాలయంలో రాజీనామా పత్రంను సైతం అందజేశారు.