Malla Raji Reddy | పెద్దపల్లి, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ)/మంథని: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో ఎట్టకేలకు లొంగుబాటుకు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీని పలు రాష్ట్రాల్లో విస్తరించడానికి, బలపర్చడానికి వ్యూహకర్తగా, ప్రజా శతృవుల నిర్మూలన కోసం నిర్వహించే ఆపరేషన్లలో కీలక, సంచలన నేతగా గుర్తింపు పొందిన కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఆలియాస్ మీసాల సత్తన్న పోలీసులకు లొంగిపోయారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్-1, 2 కారణంగా మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీన పడిపోవడం.. కేంద్ర బలగాలు దండకారణ్యంపై విరుచుకుపడటంతో విధిలేని పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ చీఫ్ తిప్పని తిరుపతితో పాటు మల్లా రాజిరెడ్డి, మరో 16 మంది మావోయిస్టులు హైదరాబాద్లోని ఎస్ఐబీ ముందు లొంగిపోయినట్లు ఆదివారం మీడియాలో కథనాలు రావడం మంథని ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్త్రుళ్లపల్లి గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి 50 ఏళ్ళ క్రితమే తాడిత, పీడిత ప్రజల విముక్తి కోసం విద్యార్థి దశ నుంచి విప్లవోద్యమ బాటలు పట్టారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి ఎదిగి దాదాపు 50 ఏళ్ళుగా అజ్ఞాత జీవితం గడిపారు. పలు మార్లు అరెస్టు అయిన రాజిరెడ్డి జైలు జీవితం తర్వాత బెయిల్పై బయటకు వచ్చి తిరిగి ఉద్యమంలోకే వెళ్ళారు. ఇన్నేళ్ల తరువాత సజీవంగా రాజిరెడ్డి లొంగిపోనట్లు మీడియాలో కథనాలు రావడంతో స్వగ్రామంలో, కుటుంబ సభ్యులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉద్యమ కాలంలో పరిచయం ఉన్న విప్లవ సానుభూతి పరులు, మాజీ నక్సలైట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఎస్యూలో చూరుకుగా పని చేస్తూ అజ్ఞాతం వైపు..
నాటి పీపుల్స్ వార్ గ్రూపు రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ)లో పని చేసిన మల్లా రాజిరెడ్డిపై పోలీసుల నిర్బంధం ఎక్కువ కావడంతో పీపుల్స్ వార్ దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. 1975 ప్రాంతంలో మల్లా రాజిరెడ్డి మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఆర్ఎస్యూలో చాలా చురుకుగా పని చేస్తూ విద్యార్థి, ప్రజా సమస్యల పై పోరాటం చేశారు. ఆ సమయంలో రాజిరెడ్డిపై పోలీసులు నిఘా ఎక్కవ కావటం, కేసులు పెట్టడంతో ఆయన దళంలోకి వెళ్లి పోయారు. తొలుత పీపుల్స్ వార్ మంథని-మహదేవపూర్ దళాల్లో సభ్యుడిగా పని చేశారు. తర్వాత జిల్లా, రాష్ర్ట, కేంద్ర కమిటీలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్గా పని చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మల్లా రాజిరెడ్డి అరెస్టు
రాజిరెడ్డి ఉద్యమ ప్రస్థానంలో పలుమార్లు అరెస్టు అయి జైలు జీవితాన్ని సైతం గడిపారు. జైలులో ఉండే ఆయన బెయిల్ పొందిన తర్వాత తిరిగి ఉద్యమంలోకి వెళ్లి పోయే వారు. తొలుత 1977లో పలు కేసుల్లో ధర్మపురి పోలీసులు అరెస్టు చేయగా బెయిల్పై బయటికి వచ్చి మళ్లీ అడవి బాట పట్టారు. అయితే 2007లో కేరళలోని ఎర్నాకుళంలో కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్న రాజిరెడ్డి, అతని భార్య బీచ్చ సుగుణలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేయడం దేశ, రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేరళలో పార్టీ విస్తరణ కోసం వెళ్లిన రాజిరెడ్డి దంపతులు అన్యూహంగా పోలీసులకు చిక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో మంథని కోర్టులో పోలీసు హాజరు పర్చారు. రిమాండ్ ఆనంతరం పలు విచారణల తర్వాత మంథని కోర్టు 2009 అక్టోబర్ 6న రాజిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ తర్వాత రాజిరెడ్డి సాధారణ ప్రజా జీవితం గడుపుతారని అందరూ అనుకోగా ఆయన మాత్రం హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనంగా మారింది.