ఎండకాలం ఆరంభంలోనే తాగునీటి తండ్లాట మొదలైంది. ఇప్పటికే అక్కడక్కడా తీవ్రమవుతున్నది. ఏడాదిన్నర కిందటి వరకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి రోజు విడిచి రోజు మంచి నీళ్లు వచ్చినా.. గ్రామాలు, పట్టణాలకు ఎక్కడా నీటి కొరత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా సరఫరా చేసినా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ఎద్దడి తలెత్తుతున్నది. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడం, మిషన్ భగీరథలో ఏర్పడుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో మంచినీటికి గోస పడాల్సిన దుస్థితి ఉన్నది. ఏప్రిల్, మేలో ఈ ముప్పు తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
కరీంనగర్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాక ముందు వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి తండ్లాట మొదలయ్యేది. కులాయిల వద్ద బిందెలు, కుండలు, బకెట్లతో బారులు తీరేది. రక్షిత మంచినీటి బావులు ఎండిపోతే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని గ్రామాలకు నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండేది. వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించేంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మిషన్ భగీరథ పథకం రావడంతో ప్రతి గ్రామానికి గోదావరి జలాలను సరఫరా చేసేది. గతంలో వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే వచ్చే మంచినీళ్లు మిషన్ భగీరథ తర్వాత రోజు విడిచి రోజు వచ్చేవి. చిన్న గ్రామ పంచాయతీల్లో అయితే ప్రతి రోజూ సరఫరా అయ్యేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మళ్లీ వెనుకటి రోజులు వస్తాయేమోనని ప్రజల్లో ఆందోళన కనిపిస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, మొగ్దంపూర్ తదితర గ్రామాలకు సంబంధించిన రక్షిత మంచినీటి బావులు ఇరుకుల్ల వాగులో ఉన్నాయి.
ఇప్పుడు ఆ వాగు ఎండిపోవడంతో బావుల్లో నీటిమట్టం పడిపోయింది. కొన్ని బావులైతే పూర్తిగానే ఎండిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు నీటి కరువు ఏర్పడింది. ముఖ్యంగా నగునూర్‌లోని ఒడ్డెర కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కాలనీ వద్ద సంప్ నిర్మాణానికి 17 లక్షలు మంజూరయ్యాయి. ప్రారంభించే సమయానికి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు మరుగున పడ్డాయి. మంజూరైన నిధులు అలాగే ఉన్నాయి. సంప్ నిర్మాణం గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కాలనీకి నగునూర్ మీదుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉండడంతో నీరు సరిగ్గా రావడం లేదు. తీగలగుట్టపల్లి నుంచి నగునూర్ వెళ్లే రోడ్డు గుండా పైప్‌లైన్ వేస్తే పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే అవకాశముంటుంది. ఈ విషయమై గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పుల శ్రీధర్ జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రం ఇచ్చినా, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇరుకుల్లవాగులో మొగ్దుంపూర్‌కు చెందిన మూడు రక్షిత మంచి నీటి బావులు ఉన్నాయి. అందులో రెండు ఎండిపోయాయి. ఒకదానిలో ఉన్న కొద్దిపాటి నీళ్లు గ్రామానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినా గ్రామంలోని అన్ని వార్డులు తిరిగే సరికి నాలుగైదు రోజులకు ఒక వార్డుకు సరఫరా అవుతున్నాయి.
చిగురుమామిడి మండలంలో వేసవి ప్రారంభం నుంచే కటకట మొదలైంది. ఈ మండలంలోని నవాబుపేటకు గతంలో రెండు రోజులకోసారి నీరు సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆరు రోజులకోసారి ఇస్తున్నారు. ప్రస్తుతం రైతు వేదిక వద్ద ఉన్న బావిలో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతున్నది. ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులో ఉన్న రక్షిత మంచినీటి బావి నుంచి పైప్‌లైన్ వేసి నీటి ఎద్దడిని నివారించే అవకాశమున్నది. కానీ, అధికారులు దృష్టి సారించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదే మండలంలోని ఉల్లంపల్లిలో నాలుగు రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తుండగా, అవి సరిపోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల్లోనూ భూగర్భ జలాలు పడిపోయి రక్షిత మంచినీటి బావులు అడుగంటుతున్నాయి. ఈ కారణంగా తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లోని మసీదువాడలో స్థానికులు గోస పడుతున్నారు. ఈ కాలనీకి మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయని కారణంగా మొత్తానికే నీళ్లు రావడం లేదని వాపోతున్నారు.
కరీంనగర్, చిగురుమామిడి మండలాల్లో మొదలైన మంచినీటి సమస్య వేసవిలో గట్టెక్కడం కష్టతరంగా కనిపిస్తున్నది. ఆయకట్టు ప్రాంత గ్రామాలకు ఇప్పుడు సాగునీరు సరఫరా అవుతున్నది. రక్షిత మంచినీటి బావుల్లో నీటిమట్టం కొంత స్థిరంగా ఉన్నది. ఏప్రిల్ 2 వరకే సాగునీటి సరఫరా ఉంటుంది. ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు శరవేగంగా పడిపోతున్నాయి. ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనిస్తుంటే మున్ముందు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యేలా ఉన్నాయి. చొప్పదండి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయలేదు. ఉన్న పైపులకే కనెక్షన్లు ఇచ్చి నడిపిస్తున్నారు. నీటి సరఫరా సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మండలంలోని కుర్మపల్లి, రేవెల్లిలో ప్రతి వేసవిలో నీటి ఎద్దడి ఎదురవుతున్నది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యే ముప్పున్నది. ప్రస్తుతం నీళ్లున్నాయని అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఏప్రిల్ నుంచి అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా శంకరపట్నం మండలం లింగాపూర్, మెట్పల్లి, చింతలపల్లి, సైదాపూర్ మండలంలోని పెరుకపల్లి, గర్రెపల్లి, సోమారం, హుజూరాబాద్ మండలంలోని కాట్రపల్లి, ఇప్పల నర్సింగాపూర్, తుమ్మనపల్లి, చిన్న పాపయ్యపల్లి, ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లి, వంతడుపుల, రాచపల్లి తదితర గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి పొంచి ఉంది. ఇదే మారిదిగా భూగర్భజలాలు శరవేగంగా పడిపోయినా, మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా జిల్లా అంతటికీ మంచినీటికి ఇబ్బందులు తప్పవు.
నగునూర్‌లో సుమారు 7,800 మంది జనాభా ఉంది. ఈ గ్రామానికి కూడా సరిపడా నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ పైప్‌లైన్ ప్రతిమ ముందు నుంచి ఉంది. అక్కడి నుంచి రావడం వల్ల దూరం పెరిగి వడ్డెర కాలనీకి నీళ్లు రావడం కష్టమైతంది. ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఈ కాలనీకి తీగలగుట్టపల్లి నుంచి నగునూర్ వెళ్లే దారి గుండా పైప్ లైన్ వేస్తే పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చే అవకాశముంటుంది. అంతే కాకుండా ఒడ్డెర కాలనీ వద్ద సంప్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో 17 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించ లేదు. సంప్ నిర్మాణం చేపడితే బాగుంటుంది. మా గ్రామానికి ఉన్న రక్షిత మంచి నీటి బావి ఇరుకుల్ల వాగులో ఉంది. అది ఎండిపోతున్నది. పూర్తిగా ఎండిపోతే కష్టమే. మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు. ఎండకాలం కష్టమయ్యేటట్టే ఉన్నది.
మాకు ఆరు రోజులకోసారి నీళ్లస్తన్నయి. మిషన్ భగీరథ నీళ్లు గతంలో మంచిగా వచ్చేటియి. ఇప్పుడవి సరిగ్గా రాకపోవడం, ఊరి బావిలో కూడా నీళ్లు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురైతున్నయి. మా ఊరి నీటి సమస్యను పరిష్కరించాలంటే రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న వాగు నుంచి పైప్‌లైన్ వేయాల్సి ఉంటుంది. అధికారులకు ఎన్నోసార్లు చెప్పినం. పట్టించుకుంట లేరు. తీరా ఎండలు ముదిరిన తర్వాత గ్రామం చుట్టు పక్కల బావుల్ల నీళ్లు లేకుంటే గ్రామ ప్రజలు మంచి నీళ్ల కోసం తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తది.
మునుపెన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నం. గతంలో ఇసొంటి పరిస్థితులు లేవు. నెల కింది నుంచే బావుల్ల నీళ్లు ఒడుస్తున్నయి. మంచినీళ్ల బాయిల సుతం నీళ్లు తగ్గుతున్నయి. ఉన్న నీళ్లనే ఊరంతా తింపె వరకు ఎటు సరిపోత లేవు. ఎండలు ఇంకా ముదిరితే నీళ్లకు చానా కష్టమైతది. ఇప్పటి సందే నీళ్ల కోసం ప్రత్యామ్నాయం చూడాలే. లేకుంటే గ్రామాలకు గ్రామాలు తల్లడిల్లుతయి. మా ఊరికి మునుపు మంచి నీళ్లు మంచిగ వచ్చేటియి. ఇప్పుడు నాలుగైదు రోజులకు ఒక వాడకు తిరుగుతున్నయి. రేపు వారం పది రోజులకోసారి సుతం నీళ్లచ్చే పరిస్థితి కనిపిస్త లేదు.