పెద్దపల్లి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘నేను బలహీనవర్గాలకు చెందిన బిడ్డను. మీ అందరి కండ్ల ముందరే పెరిగిన. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. ఇక్కడి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థికి, ఆయన కుటుంబసభ్యులకు గతంలో ప్రజలు అవకాశం ఇచ్చిన్రు. వాళ్లు పెద్దపెద్ద పదవులు వెలగబెట్టిన్రు. కానీ, వాళ్లు ప్రజా సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇంతకుముందు ఇక్కడ గెలిచిన వ్యక్తి గెలువగానే హైదరాబాద్‌కు వెళ్లిపోయిండు. పాలనను, ప్రజలను గాలికొదిలేసి తన సొంత వ్యవహారాలను చక్కబెట్టుకున్నడు. ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో దిగిండు. ఒక్కో నాయకుడికి రేటు గడుతూ అంగట్లో పశువుల్లా కొంటున్నడు. అయినా ప్రజలు అతడిని నమ్మబోరు. ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇట్టే అర్థమవుతున్నది’ అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘నమస్తేతెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఐక్యత చాటాలని, నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణంపాఠం చెప్పాలని, చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన మంథని గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇం కా తన ప్రచారతీరుతెన్నులు, వస్తున్న స్పందన, గెలిస్తే చేపట్టబోయే పనులు ఇలా అనేక అంశాలపై సూటిగా, సవివరంగా సమాధానాలు ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: ప్రచారం ఎలా సాగుతున్నది?
పుట్ట మధూకర్: ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను బ్రహ్మండంగా నిర్వహించుకున్నాం. ఇంతకుముందు నా ప్రజా ఆశీర్వాద పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అన్ని వార్డుల్లో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడుతున్నరు. పథకాలు, చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నరు.
నమస్తే: మంథని రాజకీయ ం ఎలా ఉన్నది?
మధూకర్: 76 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశం లో మంథని నియోజకవర్గంలో 45 ఏండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నది. బలహీనవర్గాల ను అణగదొక్కింది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేతను నేనొక్కడినే. నన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని చూస్తున్నరు. ఇక్కడ ఎవరినీ ఎవరు నేరుగా తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేయరు. సోషల్ మీడియా, ప్రచార మా ధ్యమాలు, టీవీలు, పేపర్లలో మాత్రమే ఇది కనిపిస్తుంది. మీడియా కేంద్రంగానే రాజకీయ సమాధికి కుట్రలు చేస్తుంటరు. ఇది చాలా మందికి అర్థంకాదు.
నమస్తే: ఇటీవల సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయింది కదా.. మీరు ఎలా ఫీలవుతున్నారు?
పుట్ట మధూకర్: ఈ నెల 7వ తేదీన మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కేసీఆర్ మంథని ప్రజలకు గొప్ప హామీలు ఇచ్చిండు. బీసీ బిడ్డ పుట్ట మధును గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిండు. ఇక్కడి ప్రజలతో ఒకరోజు గడిపి అవసరాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చిండు. నిజంగా మా ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆయన అంత గొప్ప హామీ ఇవ్వడం మేమెన్నటికి మర్చిపోలేం. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యం. అభివృద్ధి జరగడం తథ్యం. సభకు నియోజకవర్గంలోని ఇంటింటి నుంచి జనం ఇంత తరలిరావడంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న.
నమస్తే: మీరు నాయకుడా..సేవకులా..?
మధూకర్: మా నాయకుడు సీఎం కేసీఆర్. నేను మా మంథని నియోజకవర్గానికి సేవకుడిని. ఇక్కడి ప్రజలకు నన్ను పేరు పెట్టి పిలించేతా ఆప్యాయత ఉన్నది. వాళ్లు అలా పిలిస్తేనే సంతోష మైతది. ఇక్కడ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన శ్రీపాదరావు హైదరాబాద్‌లో మకాం పెట్టిండు. ఏనాడు ఇక్కడ ఉండలె. ఆయన కొడుకు, ప్రస్తుత ఎమ్మెల్యే సైతం ఇక్కడ గెలిచి రాష్ట్రరాజధానిలోనే ఉంటున్నడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వస్తాడు. ఎన్నికలు కాగానే వెళ్లిపోతడు. కానీ, నేను ఇక్కడ పుట్టిన బిడ్డగా ఎమ్మెల్యేగా అయినా, జడ్పీ చైర్మన్‌గా అయినా నిత్యం ప్రజల మధ్యే నా కుటుంబంతో సహా ఉంటున్న. మంథనిలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న.
నమస్తే: యూత్ ఫాలోయింగ్ ఎలా ఉన్నది?
మధూకర్: నేను యూత్ లీడర్‌ను. చదువుకునే రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రెసిడెంట్‌గా పని చేశా. 52 ఏండ్ల వయస్సు నన్ను ఇంకా ఇక్కడి ప్రజలు యువకుడి గానే చూస్తారు. చిన్న పిల్లలు కూడా నన్ను పుట్ట మధు అని పేరు పెట్టి అప్యాయంగా పిలుస్తుంటే సంతోషమనిపిస్తది.
నమస్తే: మీ పై తరచూ ఏవేవో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి? ఎందుకని?
మధూకర్: మంథని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. నేను బీసీ బిడ్డను. కానీ, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కుటుంబం బీసీలను రాజకీయంగా తొక్కి పడేసింది. నాలాగా ఎవరు ఎదిగినా దుష్ప్రచారం చేస్తారు. రాజకీయ సమాధి చేస్తారు. వారి ప్రోద్బలంతోనే కొందరు మీడియా ప్రతినిధులు నాపై తరచూ ఏవేవో పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ, ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపితంకాలేదు. నాపై దాడి ఏ కర్రతోనో, కత్తితోనో కాదు. విచిత్రం ఏంటంటే.. నా సామాజిక వర్గాన్నే వాడుకొని నాపై కుట్రలు చేయడం ఇక్కడి కాంగ్రెస్ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటివన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఎవరూ ఏమీచేయలేరు.
నమస్తే: సీఎం ఇటీవలి మీటింగ్‌ల మధు రంది పడకు అన్నరు కదా! దాని గురించి చెబుతరా..?
మధూకర్: ‘మన పార్టీ నాయకులను కొం దరు కొనుక్కపోతున్నరని మధు నువ్వు రంది పడ కు’ అని కేసీఆర్ అన్నడు. అవును నిజమే. ఇక్కడ ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నడు. మా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీ లు, సర్పంచ్‌లను కొనుగోళ్లు చేస్తున్నడు. ప్రజాబలమున్నోళ్లు ఇలా చేయరు. ఉదయం నుంచి రా త్రి వరకు నాతో ఉండే వారికి అర్ధరాత్రి సమయం లో కండువాలు కప్పుతున్నరు. ఏమైనా మనస్పర్థలు ఉంటే నాయకుడితో చెప్పాలి. కానీ, నన్ను వదిలి వెళ్లిన వారెవరూ నాతో ఏం చర్చించలేదు. ఏం మాట్లాడలేదు. అంటే వీళ్లకు కేవలం డబ్బుల ఆశ చూపినట్లు అర్థమవుతున్నది. ఎవరు ఎన్ని కథలు పడ్డా మళ్లీ ఈ బీఆర్ఎస్ సర్కారే వస్తది.
నమస్తే: మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నరు?
మధూకర్: మంథని నియోజకవర్గాన్ని 2014కు ముందు ఎక్కువసార్లు పరిపాలించింది బ్రాహ్మణ, రెడ్డి సామాజికవర్గాలే. బీసీ ఎమ్మెల్యేగా నేనొక్కడినే పనిచేసిన. బడుగు, బలహీన వర్గాలు దళితులను ఏకం చేస్తూ ముందుకెళ్తున్న. నేను ఇక్కడ బీసీ నేతగా ఎదగడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ని జీర్ణించుకోలేక పోతున్నడు. అందుకే నాపై కుట్రలకు దిగుతున్నడు. నేను మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఇకపై కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే టికెట్ అడగడానికి ఉండడు. ఆ పార్టీ కి చెందిన బీసీ బిడ్డ ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతడు. నా పార్టీలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అన్ని పార్టీల నుంచి కూడా బీసీ నాయకులు పుట్టకొస్తారని తెలుసు. అందుకే మొగ్గలోనే తుంచేసేందుకు నన్ను రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నరు. ఇక్కడి నుంచి నేను గెలిస్తేనే బీసీలకు రాజకీయంగా ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. నన్ను ఓడించడం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం ఒడిపోయినట్టే.
నమస్తే: ఇరువై ఏండ్లుగా మీ ఇద్దరి మధ్యే పోటీ ఉంటున్నది. ఎందుకు?
మధూకర్: ఇద్దరి మధ్య అనేది కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బరిలో ఉండాలి. కానీ, కాంగ్రెస్‌లో రాజులాగా ప్రతి సారి ఒక్కరు మాత్రమే పోటీలో ఉంటున్నరు. మిగతా పార్టీల్లో ఇద్దరు లేదా ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే ముందుకు వస్తున్నరు. కాంగ్రెస్‌లో అప్రజాస్వామికంగా లీడర్లను బానిసలుగా చేసుకొని తాను ఒక్కడినే లీడర్‌గా ఉన్నాడని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నడు. అందుకే ఆ పార్టీలో కొత్త వాళ్లకు అవకాశం రావడం లేదు.
నమస్తే: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఎలా ఉన్నది?
మధూకర్: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉన్నది. సీఎం కేసీఆర్ ఇప్పటికే పింఛన్ పెంచి ఆత్మగౌరవం కల్పించిండు. మళ్లీ గవర్నమెంట్ వస్తే ఆసరా పింఛన్లు మళ్లీ పెంచుతనన్నడు. వృద్ధులకు 5,016, దివ్యాంగులకు 6వేలు చేస్తమన్నడు. ఇంకా 400లకే సిలిండర్ ఇస్తమన్నడు. రైతుబంధు ఎకరానికి 16వేలు, రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తామని చెప్పిండు. ఆరోగ్య బీమా 5లక్షలు, ఆరోగ్య శ్రీ కింద గరిష్ఠ పరిమితిని 15లక్షలు చేస్తనన్నడు. కానీ, కాంగ్రెస్ చేసింది? వాళ్ల పాలనలో కేవలం పింఛన్ 200లే ఇచ్చేది. అది కూడా ఊళ్లో ఎవరైనా చనిపోతేనే ఆ స్థానం లో మరొకరికి ఇచ్చేది. పదేండ్లు పాలించినా నయాపైసా పెంచలె. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలు అని మాయమాటలతో వస్తున్న రు. ప్రజల వద్దకు వెళ్లి సంతకాలు పెట్టిస్తున్నారు. నమ్మకంలేకే ఇట్లా చేస్తున్నరు? కానీ ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారు.
నమస్తే: మీరు గెలిస్తే ఏం చేస్తరు?
మధూకర్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మా పార్టీ మానిఫెస్టోను విడుదల చేసిండు. అలాగే నేను నా సొంత మ్యానిఫెస్టోను మంథని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన. నేను గెలిస్తే అనేక కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న. ఈ నియోజవకర్గంలో ఎక్కువగా పేదలే ఉన్నరు. ప్రతీ ఏడాది ఆడ పిల్లలకు సామూహిక వివాహాలు చేయిస్త. హైదరాబాద్‌లో చదువుకొనే మంథని బిడ్డలకు సొంత ఖర్చులతో హాస్టల్ వసతి కల్పిస్త. గూడులేని పేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి కింద ఇండ్లు ఇవ్వనున్నది. అర్హులందరికీ మంజూరు చేయిస్త. ఏమైనా డబ్బులు తక్కువ పడితే నా సొంత డబ్బులతో పూర్తి చేయిస్త. వాళ్ల గృహ ప్రవేశాలకు వెళ్లి నేను, నాభార్య బట్టలు పెట్టి వస్తం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి తోడు సొంతంగా ఈ మూడు కార్యక్రమాలను చేస్త.
నమస్తే: మీకే ఎందుకు ఓటేయాలి? మిమ్నల్నే ఎందుకు గెలిపించాలి?
మధూకర్: నేను ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా చేసిన అభివృద్ధిని చూడండి. ఇవ్వాళ ఉన్న మంథ ని ఎమ్మెల్యే కుటుంబం నలభై ఏండ్లల్లో ఎవ్వరికీ చెంచాడు నీళ్లు పోయలేదు. ఒక్క ఆడపిల్ల పెండ్లికి ఒక పుస్తె కొనివ్వలేదు. ఏ చదువుకునే విద్యార్థికి ఓ పెన్ను కొనివ్వలేదు. పేదలకు ఆర్థిక సాయం చేయలేదు. నేను ఒకసారి వ్యక్తిగా ఎదిగిన తర్వాత ప్రతీ కుటుంబంలో నా సేవ ఉన్నది. ఊళ్లల్లో చేసి న అభివృద్ధి కండ్లకు కనిపిస్తున్నది. నియోజకవర్గ నలుమూలలకు అభివృద్ధిని విస్తరించిన. నా తల్లి పుట్ట లింగమ్మ పేరిట చారిటబుల్ ట్రస్టు పెట్టిన అనేక మంది ఆకలి తీర్చిన. వైద్యం చేయించిన. పెండ్లిళ్లు చేయించిన. చదువు చెప్పించిన. అందుకే నన్నే ఆశీర్వదించుమని ప్రజలను కోరుతున్న.
నమస్తే: చివరగా మీరు ప్రజలను ఏం కోరుతున్నరు?
మధూకర్: తెలంగాణ వచ్చిన తర్వాత నేను మంథని మొదటి ఎమ్మెల్యేగా పనిచేసిన. నలభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని, నేను నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో చేసి చూపిన. అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నది. ప్రజలు దీనిని గమనించాలి. నాటికి నేటికి జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటే పనిచేసిందెవరో అర్థమవుతుంది. ఓటు వజ్రాయుధం లాం టింది. కేసీఆర్ సార్ కూడా ఇదే చెప్పిండు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను మొన్నటి మీటింగ్‌ల అర్థమయ్యేటట్టు వివరించిండు. ఓటును ఆగమై అక్కరకు రానివాళ్లకు వేయద్దు. మన కోసం.. మ న ప్రాంత అభివృద్ధి కోసం పని చేసే వారు ఎవరో విజ్ఞతతో ఆలోచించాలి. తమ విలువైన ఓటును బీఆర్ఎస్ అభ్యర్థినైన నాకు వేసి గెలిపించాలి.