మంథని, పెద్దపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మంగళవారం రెండు చోట్లా అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి. అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం, ఓటు హక్కు విలువపై దిశానిర్దేశం చేయడం, కాంగ్రెస్ యాభై ఎనిమిదేండ్ల పాలనను ఎండగట్టడం, స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కండ్ల ముందుంచడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. కాంగ్రెసోళ్లు 24గంటల కరెంట్, రైతుబంధు, ధరణి వద్దంటున్నారని, అవి కొనసాగించాలా..? వద్దా..? అని అడిగిన ప్రశ్నలకు కావాలని సమాధానం ఇస్తూనే.. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజానీకం స్పష్టం చేసింది.
మంథనిలో బీసీ బిడ్డను గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని, పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డిని దీవిస్తే ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే అడిగినవన్నీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై చేతులు పైకెత్తి సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. మొత్తంగా సభలు విజయవంతం కావడం, అధినేత భరోసానివ్వడం, ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడంతో గులాబీ శ్రేణులు ఆనందంలోమునిగిపోయాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కరీంనగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) పెద్దపల్లి (నమస్తే తెలంగాణ) : ఎన్నికల వేళ బీఆర్ఎస్ బలం.. బలగం పెరుగుతున్నది. పార్టీ అభ్యర్థులకు ఊరూరా సంపూర్ణ మద్దతు లభిస్తుస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామగుండం, పెద్దపల్లి దశాబ్ది ప్రగతి సభలు ఉత్సాహం నింపగా, తాజాగా అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో జోష్ నింపారు. మంగళవారం మంథని, పెద్దపల్లిలో సభలకు హాజరైన ఆయన, రెండు చోట్లా అశేష జనాన్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఒక్కో చోట దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడిన ఆయన, తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. మంథని, పెద్దపల్లి అభ్యర్థులు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డిపై ప్రశంసజల్లు కురిపిస్తూనే అభివృద్ధిపై హామీ ఇచ్చారు. మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే అడిగినవన్నీ చేస్తానని ప్రకటించారు. సీఎం ప్రసంగాన్ని ఆద్యంతం సభికులంతా ఆసక్తిగా విన్నారు. మధ్యమధ్యలో ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కరతాళ ధ్వనులతో మద్దతు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే.. ఆద్యంతం తన ప్రసంగంతో ఆలోచింపజేశారు. ఓవైపు ఓటు హక్కు విలువను తెలియజేస్తూనే.. మరోవైపు ఆగమై ఓటు వస్తే జరిగే పరిణామాలను కండ్లకు కట్టినట్టు వివరించగా, సభికులంతా ఆసక్తిగా విన్నారు. ఓటు మన భవిష్యత్‌ను నిర్ణయిస్తదని, తలరాతను మారుస్తదని, ఓటు వేసే ముందు అభ్యర్థి గుణగణాలనే కాదు, పార్టీ చరిత్రను చూడాలని, విచక్షణతో ఆలోచించి వేయాలని సూచించడంతో ప్రతి ఒక్కరూ స్వాగతించారు. యాభై ఎనిమిదేళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయం, కరెంట్, సాగు, తాగునీటి కోసం పడ్డ కష్టాలు.. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమ ఫలాల గురించి అర్థమయ్యేలా వివరించగా, ప్రజలంతా ఆలోచనలో పడ్డారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నరు? 24 కరెంట్ వద్దంటున్నరు? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు? వాటిని కొనసాగిద్దామా.. వద్దా..? అని ప్రశ్నించగా.. సభికులంతా చేతులెత్తి కొనసాగించాలంటూ పెద్దపెట్టున నినదించారు. మరోవైపు బీఆర్ఎస్ రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూనే.. మంథని, పెద్దపల్లి అభ్యర్థులు పుట్ట మధూకర్, దాసరి మనోహర్ రెడ్డిపై ప్రశంసలవర్షం కురిపించారు. మంథనిలో బీసీ బిడ్డ పుట్టమధుకు అవకాశం వచ్చిందని, బీసీలంతా ఏకమై గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేయగా, ప్రజలంతా చప్పట్లతో మద్దతు తెలిపారు. అలాగే పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరగా, అందరూ కరతాళ ధ్వనులతో జైకొట్టారు.
మంథని, పెద్దపల్లిలో ప్రజా ఆశీర్వాదసభలకు బ్రహ్మరథం పట్టారు. రెండు నియోజకవర్గాల నుంచి వేలాది మంది తరలివచ్చి జైకొట్టారు. నిజానికి అధినేత కేసీఆర్ ప్రసంగంతో ఆకట్టుకోవడం, అభివృద్ధి హామీ ఇవ్వడంతో సకల జనుల నుంచి ఊహించని స్పందన వస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, కేసీఆర్ మంథనికి వెయ్యి కోట్లు ఇస్తామని, పెద్దపల్లి ఎమ్మెల్యే అడిగనవన్నీ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే చేస్తామని చెప్పడం ప్రజలంతా స్వాగతిస్తున్నారు. నియోజవర్గంలో ఎవరినీ కదిలించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఇచ్చిన మాట తప్పరని, ఇప్పటికే అన్ని వర్గాలకు అడుగకుండానే ఎంతో చేశారని చెబుతున్నారు. ఆయన వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని, కేసీఆర్‌ను మరోసారి హ్యాట్రిక్ చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. సభలు జరిగిన తీరు, ప్రజల స్పందనను చూసి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సీనియర్ రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా అంచనా వేస్తుండగా, గులాబీ శ్రేణులు ఆనంద పడుతున్నాయి. మంగళవారం రెండు చోట్లా విజయోవత్సవ సభలను తలపించడం, ప్రజల నుంచి విశేష స్పందన రావడం, ఇప్పటికే అన్ని పార్టీల నుంచి చేరికలు పెరగడం చూసి నయా జోష్‌లో మునిగితేలుతున్నాయి. గులాబీ జెండా తప్పకుండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.