Korukanti Chander | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో జాఫర్ జామానాకు మించి ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ గుండాయుజం చేస్తున్నాడని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక తమ పార్టీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతూ విత్‌డ్రాలు చేయిస్తున్నాడని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే ఏంటో చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పోలీస్ స్టేషన్ ల పిలిపించి కొందరు పోలీసు అధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని భయపెడుతున్నారని మండిపడ్డారు. రామగుండం నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్‌పార్టీకి సేవకులుగా మారిపోయారని ఆరోపించారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన అంతా నియంత, దుర్మార్గ పాలనగా మారిందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చరమగీతం పాడుతారన్నారని పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం లేని మాక్కాన్ సింగ్ తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టి బెదిరింపులు ఎన్నికలనుండి విత్ర్ డ్రాలు చేయించి సంబరపడిపోతున్నారని, ఈ ఎన్నికల్లో కోరుకంటి చందర్ అంటే ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పోలీస్ స్టేషన్ లకు పిలిపించి కేసులు పెడతామని భయపెట్టే సంస్కృతి ఎక్కడైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ చెప్పిన మాటలకు తోకాడిస్తూ పోలీసులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు గోపు అయులయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్ రావు, నారాయణదాసు మారుతి, చల్లా రవీందర్ రెడ్డి, దుర్గా రావు, చెలకలపల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.