కరీంనగర్ ముకరంపుర, మే 21: కరీంనగర్ జిల్లాలో మక్క రైతులు ఆగమవుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన మక్కలు కొనే దిక్కులేక ఆందోళన చెందుతున్నారు. మార్క్‌ఫెడ్ తరపున డీసీఎంఎస్, పీఏసీఎస్‌లు ఆర్భాటంగా తెరిచిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక కొనుగోళ్ల తీరు అస్తవ్యస్తంగా మారడంతో గోస పడుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, సైదాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి డీసీఎంఎస్, చొప్పదండిలో పీఏసీఎస్, మల్లాపూర్‌లో సొసైటీ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో బుధవారం నాటికి 4,318 మంది రైతుల నుంచి 1,71,789 క్వింటాళ్ల మక్కలు కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇంకా వేలాది క్వింటాళ్లు కేంద్రాల్లో పేరుకుపోయాయి.
అందుకు గన్నీ సంచుల సమస్యే ప్రధానంగా కనిపిస్తున్నది. ఆర్భాటంగా కేంద్రాలను తెరిచిన యంత్రాంగం తగినన్ని సంచులు అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. క్షేత్ర స్థాయిలోని సాగైన పంటకు అధికారుల రికార్డుల్లో క్రాప్ నమోదుకు మధ్య వ్యత్యాసమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వానకాలంలో తెరిపిలేని వర్షంతో పత్తి పంట దెబ్బతిన్న రైతులంతా పంట మార్పిడిలో భాగంగా మక్క వేశారు. అయితే వాస్తవ పరిస్థితికి భిన్నంగా క్రాప్ బుకింగ్ నమోదు కావడంతో అంచనాలు తలకిందులై, రైతులు మార్కెట్లలో ఆగం కావడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే మార్కెట్లకు మక్కలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు గన్నీ సంచులు సమకూర్చాల్సిన యంత్రాంగం ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. చేసేదేమీలేక సంచుల కోసం రైతులే దుకాణాల వెంట పరుగులు తీస్తున్నారు.
ఒక్కో సంచికి రూ.23 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అయినా సకాలంలో కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఒక్కో రైతుపై సగటున రూ.2500 వరకు సంచుల భారం పడుతున్నది. అయితే ఈ మొత్తాన్ని మక్కల డబ్బులతో కలిసి చెల్లిస్తామంటూ డీసీఎంఎస్ నిర్వాహకులు చెబుతున్నా.. తిరిగి ఈ డబ్బులను ఇస్తారా.. లేదా..? అన్నదానిపై అనేక సందేహాలున్నాయి. మరోవైపు ఈ సారి మక్క దిగుబడి ఆయా ప్రాంతాల్లోని నేలను బట్టి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లవరకు వచ్చింది. కానీ, అధికారులు మాత్రం ఎకరాకు కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొంటుండగా, మిగిలిన దిగుబడిని రైతులు దళారులకు విక్రయించుకోవాల్సిన దుస్థితిని సర్కారు కల్పిస్తున్నది. మక్క క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2400 కాగా, తప్పని పరిస్థితుల్లో రైతులు క్వింటాల్‌కు రూ.1800కే విక్రయిస్తున్నారు. దీని వల్ల ఒక్కో క్వింటాల్‌కు రూ.600 వరకు నష్టపోతున్నారు.
సంచుల్లో నింపిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసే పరిస్థితి లేదు. ఒకవేళ కాంటా పెట్టినా బస్తాలను లారీల్లో లోడింగ్ చేసే దాకా తమ బాధ్యత కాదని నిర్వాహకులు చెబుతుండడం రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మక్కలు అమ్ముకోవడానికి ఒక్కో రైతు పదిహేను రోజులుగా నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో తూకం వేయకపోవడం, బస్తాలను ఎప్పటికప్పుడు లోడింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో మక్కల కుప్పలు, సంచులు పేరుకుపోతున్నాయి. అయితే మార్కెట్లో ఎక్కువ భాగం మామిడి వ్యాపారులకే కేటాయించడంతో కొత్తగా మక్కలు తెచ్చే రైతులకు స్థలం లేక ఆగమవుతున్నారు. ఎక్కడ చూసినా గడ్డి, మామిడి కాయల వ్యర్థాలు ఉండడంతో రైతులే శుభ్రం చేసుకుని మక్కలు కుప్ప పోసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది.
నేను రెండెకరాల్లో మక్క సాగు చేసిన. వారం కిందట కరీంనగర్ మార్కెట్‌కు రెండు ట్రాక్టర్ల మక్కలు తెచ్చిన. ఇన్ని రోజులు సీరియల్ నంబర్ రాలేదని చెప్పిన్రు. రోజు మార్కెట్‌కు వచ్చి పోయేందుకు ఎండల బాగా ఇబ్బంది పడుతున్న. సంచులు కావాలని అధికారులను అడిగితే లేవని మీరే కొనుక్కోవాలని చెబుతున్నరు. ఈ ఎండలకు మార్కెట్ల ఉండి ఇబ్బంది పడుడు కంటే సంచులు కొనుక్కునుడే మేలనుకున్న. దుకాణంల నుంచి 120 సంచులు కొన్న. ఒక్క సంచికి రూ. 23 తీసుకున్నరు. సంచులు తెచ్చి హమాలీలకు అప్పజెప్పితే ఈ రోజు సంచుల్లో మక్కలు ఎత్తుతున్నరు. ఇక ఎప్పుడు తూకం వేస్తరో తెలువది? తూకమై లారీల లోడ్ చేసేదాక మేమే మక్కల కావాలి ఉండాలంటున్నరు. ఈ సారి మక్కలు అమ్ముకొనుడు కష్టమే.
– తాటికొండ శంకరయ్య, నగునూర్
నేను వానకాలం మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి ఏసిన. కాత సమయంలో పడ్డ వానలకు కాయలు రాలిపోయి పత్తి దిగుబడి సరిగా రాలేదు. ఎకరానికి రూ.30 వేల దాకా ఖర్చయింది. పత్తితోటి ఎట్లాగూ నష్టమైందని, మక్క చేనన్నా కలిసి వస్తదనే ఆశతోటి యాసంగిల సాగు చేసిన. రెండు ట్రాక్టర్ల మక్కల దిగుబడి వచ్చింది. మార్కెట్ల అమ్ముకుంటే కొంత లాభం ఉంటదని గురువారం ఇక్కడికి తెచ్చిన. మార్కెట్ అంతా తిరిగి చూసినా ఎక్కడ ఖాళీ జాగా కనిపించలేదు. ఎక్కడ చూసినా మక్క కుప్పలే ఉన్నయి. ఇంత దూరం తీసుకువచ్చి తిరిగి ఇంటికి తీసుకపోయే వీలు లేదు. ఎక్కడో ఓకాడ జాగ చూసుకుని మక్కలు పోద్దామంటే వీలు లేకుంటా ఉన్నది. ఇక లాభం లేదని మామిడి మార్కెట్ షెడ్ల పక్కన ఉన్న చెత్తాచెదారం, గడ్డిని అంతా సాప్ చేసుకొని, మక్కలు పోసిన. మక్కలైతే పోసిన గానీ, ఎప్పుడు కొంటరో ఏమో. సంచులు రైతే కొనుక్కోవాలే అని చెప్తున్నరు. అంతా అధికారుల దయ.
– ఎగుర్ల మోహన్, కొత్తపల్లి
అధికారులు చెప్పినట్టు నేను పంట మార్పిడి చేసిన. ఐదెకరాల్లో మక్క సాగు చేసిన. 140 క్వింటాళ్ల మక్కలు వచ్చినయి. వారం కిందట మార్కెట్లకు తెచ్చిన. అప్పటి సంది రోజు వచ్చి కాపలా ఉంటున్న. ఇక్కడ మక్కలు అమ్మేందుకు ఏదీ సక్కగ లేదు. ఇప్పటి దాక సంచులు అందలేదు. రైతులే కొనుక్కోవాలే అని అంటున్నరు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి మార్కెట్ల రైతులు చాలా అవస్థ పడుతున్నరు. పోయిన ప్రభుత్వ హయాంలో ఏ ఇబ్బంది లేకుండా పంటలు కొన్నరు. ఇప్పుడేమో అంతా ఆగమాగం ఉన్నది. సంచులు నింపి తూకం వేసినా లారీల లోడ్ కదిలేదాక ఇక్కడే ఉండాలని చెబుతున్నరు. ఇట్లయితే మా పరిస్థితి ఎట్ల? కేసీఆర్ ఉన్నప్పుడు ఈ తిప్పలు లేకుండే. ఇట్ల వచ్చి అట్ల అమ్ముకొనిపోయినం. ఏవైనా ఇబ్బందులుంటే అధికారులు తక్షణం పరిష్కరించే వారు. కానీ ఇప్పుడు ఏదీ లేదు.
– ఆగయ్య, నాగులమల్యాల