వరుణుడు ముఖం చాటేయడంతో వరి నార్లు ముదిరిపోతున్నాయి. దీనికితోడు లోవోల్టేజీ సమస్యతో తరుచూ మోటర్లు కాలిపోయి సాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. దీంతో పొలాలకు నీరందించేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుకు‘సాగే’దెలా.. అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్మాస్పూర్ రైతులు గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం రాజన్నపేటలోని సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేయగా అధికారుల హామీతో విరమించారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 8 : ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో గతంలో 270 ఎకరాల సాగు భూమి ఉండేది. మల్కపేట కెనాల్ నిర్మించిన తర్వాత భూగర్భజలాలు పెరగడంతో కాల్వ పరీవాహకంగా మరో 250ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. అయితే రెండేళ్ల నుంచి కరెంట్ సమస్యతో అన్నదాతలు సతమతమవుతున్నారు. గతేడాది కూడా ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య ఏర్పడగా.. నిరసన వ్యక్తం చేయడంతో పరిష్కారం చూపారు. ప్రస్తుతం అదే ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య ఏర్పడడంతో లోడ్ ఎక్కువై ఊరంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాలు దున్ని పదిహేను రోజులైనా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోతుండగా.. నాట్లేసే పరిస్థితి లేకుండా పోతున్నదని వాపోతున్నారు. ప్రభుత్వం సన్నవరి సాగు తప్పనిసరి నిబంధన పెట్టగా.. సకాలంలో నాట్లు వేయకపోతే మళ్లీ నారు పోయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దున్నకమైన పొలం ఎండిపోతే మళ్లీ నీళ్లు పారించి దున్నితే ఎకరానికి మరో రూ.7వేల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అల్మాస్పూర్ గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు.
అనంతరం రాజన్నపేటలోని సబ్‌స్టేషన్‌కు చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఓ అధికారి దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించారు. సమస్య పరిషారం అయ్యే వరకూ కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. దీంతో సమాచారం అందుకున్న ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, ఎస్ఐ రాహుల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని, సమస్య పరిషారం కోసం ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. రెండు గంటల ఆందోళన అనంతరం శాంతించిన రైతులు, అకడి నుంచి వెళ్లిపోయారు.
కాల్వల నీళ్లు ఇడువాలె
నారుపోసి నెలపదిహేను రోజులైతాంది. నాలుగెకరాల పొలం దున్నిన. అది మొత్తం ఎండిపోయింది. కరెంటు ఒక గంట, రెండు గంటలిస్తున్నరు. కరెంటు వచ్చుకుంటు పోవడంతో రెండుమోటర్లు కాలిపోయినయ్. రిపేరు చేయించడానికి రూ.10వేల దాకా ఖర్చుయినయి. బోరు నుంచి మోటరు గుంజడానికి మళ్లో రూ.6వేలు ఖర్చయినయి. మా పొలం పక్కపొంటే కాల్వ ఉన్నది. ఆ కాలువ ఇడిసిన ఇంతాంత ఎయిర్ పైప్ పెట్టుకుని పొలం పారించుకునేటోళ్లం. ఆ కాల్వలగూడ నీల్లిడ్వలే. ఇప్పుడు ఏంజెయ్యాల్నో అర్థమైతలె.
– గడ్డి కొమురయ్య, రైతు (అల్మాస్పూర్)
నిన్ననే మోటర్ కాలిపోయింది
నాకు మూడెకరాల పొలముంది. అండ్ల రెండెకరాలనర పొలమే తడిసింది. కరెంటు లేక అది ఎండిపోయింది. నారు పోసి ఇప్పుడు నెలయితుంది. నాటేద్దామనుకుంటే పొలం పారుడులేదు. సన్న వరి 25రోజుల్లో పంట ఏస్తేనే దిగుబడి అత్తదని గవుర్మెంటోళ్లు సెప్పుతున్నరు. కానీ పొలంపారక నారుగూడ కరాబయ్యేటట్లు ఉన్నది. మల్ల నారుమడి ఎయ్యాలంటే నెల రోజులు పడ్తది. లోఓల్టేజీతోటి నెలల రెండు స్టార్టర్లు కాలిపోయిన్నయి. ఎకరానికి రూ.10వేలు ఖర్సులు పెరిగిపోతున్నయి. నిన్ననే మోటర్ కాలిపోయింది. ఏం చేయాలో తెలుస్తలేదు. కరెంటు మంచిగ వచ్చెటట్టు సూడాలె.
– లింగంపల్లి సత్తయ్య, రైతు (అల్మాస్పూర్)