అర్వాల్, ఆగస్టు 19: బడి పిల్లలకు అందజేసే మధ్యాహ్న భోజన పథక అమలులో బీజేపీ పాలిత బీహార్‌లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. అర్వాల్ జిల్లాలోని సదర్ బ్లాక్‌లోని 75 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన సోయాబీన్ కూరలో పురుగులు, క్రిములు ఉండటాన్ని గమనించారు. దీనికి సంబంధించి పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా మధ్యాహ్న భోజన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆహారాన్ని ఒక ఎన్జీవో సరఫరా చేస్తున్నది. అధికారులు ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు.
కాగా నలంద జిల్లా నుర్సరాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరాసిలోని ఒక మాధ్యమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన సోయాబీన్ కూర తినడం వల్లే తమ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటూ పాఠశాల ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. కూరలో ఉప్పుకు బదులు పొరపాటున డిటర్జెంట్ పౌడర్ కలపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.