Dharmaram | ధర్మారం,జూన్ 9 : లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎల్లంకి అనిల్ (32) అని యువకుడు ద్విచక్ర వాహనంపై ఓ పని మీద ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి వచ్చాడు. పని ముగిసిన అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీ రోడ్డు నుంచి గ్రామపంచాయతీ వద్ద ఉన్న సమ్మక్క రోడ్డు మీదుగా వస్తున్న క్రమంలో పెద్దపల్లి – ధర్మారం ఆర్ అండ్ బి రోడ్ ధర్మారం నుంచి పెద్దపల్లి వెళుతున్న లారీ అకస్మాత్తుగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
దీంతో సదరు యువకుడు ద్విచక్ర వాహనంపై నుంచి పట్టడంతో అతని తలకు దెబ్బ తగలడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స కోసం పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ అతని పరిస్థితి నిలకడగా లేకపోవడంతో పెద్దపల్లి నుంచి అనిల్ ను కరీంనగర్ కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నట్లు ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.