శంకరపట్నం, డిసెంబర్ 27: మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర మంగళవారం కనులపండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు పోలోజు సుమన్శాస్త్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయ కోనేటి నీటితో పంబా ఆరట్టు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన వాహనంలో ఆలయ వ్యవస్థాకుడు తణుకు పట్టాభిరాములు గృహం నుంచి వంకాయగూడెం అయ్యప్ప కాలనీలోని అయ్యప్ప దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.
మహిళలు మంగళహారతులతో ఎదురేగి స్వాగతం పలికారు. గురుస్వాములు, కన్నెస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు, కత్తులు, బళ్లాలు, విల్లంబులు ధరించి పేటతుల్లి ఆడారు. మహిళలు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. అనంతరం ఆలయంలో అర్చన, అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు సత్యనారాయణ, చంద్రగుప్తా, గాజుల శ్రీనివాస్, భద్రయ్య, గూల్ల రాజు, అయ్యప్ప దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములకు అన్నదానం
కమాన్చౌరస్తా, డిసెంబర్ 27 : నగరంలోని జడ్పీ క్వార్టర్స్ ఆవరణలోని అయ్యప్ప దేవాలయంలో మంగళవారం మండల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాన్ని ప్రారంభించారు. ఈవో కొస్న కాంతారెడ్డి, అర్చకులు, అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు.