ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మండల. జిల్లా ప్రజా పరిషత్తుల పాలకవర్గాల గడువు ముగిసిన 14 నెలల తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా, శనివారం జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఈ సారి జనరల్ స్థానాలు తగ్గి, బీసీలకు అత్యధిక స్థానాలు వచ్చాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జడ్పీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారుకాగా, ఆర్టీవోలు ఎంపీటీసీ, సర్పంచు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఎంపీడీవోల ఆధ్వర్యంలో మండలాల వారీగా వార్డుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.
కరీంనగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ, మరో 15 ఎంపీపీ స్థానాలు ఉండగా అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో శనివారం స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
కలెక్టర్ సమక్షంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు, ఆర్డీవోల సమక్షంలో ఎంపీటీసీ, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న విషయం తెలుసుకుని గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎంపీడీవోల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే పల్లెల్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు కూడా వెల్లడించడంతో గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయి. 2024 ఫిబ్రవరి 2న గ్రామ పంచాయతీలు, అదే ఏడాది జూలై 4న మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల పాలకవర్గాలకు గడువు తీరింది.
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికల నిర్వహించకపోవడంతో నెలల తరబడి రాజకీయ స్తబ్ధత ఏర్పడింది. ఎట్టకేలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఇటు సర్పంచు, వార్డు సభ్యులు, అటు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల స్థానాలకు ఒకే సారి రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ముందు ఏ ఎన్నికలు నిర్వహిస్తారనే సందిగ్ధం ప్రజల్లో నెలకొన్నది. రిజర్వేషన్లు అనుకూలించిన నాయకుల హడావిడి అప్పుడే మొదలు కావడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.