మరో ఉపాధ్యాయుడు సైతం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచే 2019 మే 27న (లోన్ అకౌంట్‌నంబర్ 712600001469) 38 లక్షలు రుణం తీసుకున్నట్టు చూపాడు. అంతేకాదు, ఈ లోన్ కూడా ఇంటి నంబర్ 8-2-8-3-81/1/2 భగత్‌నగర్ కరీంనగర్ పేరుతోనే ఉండటం గమనార్హం. ఆయన కూడా ఇదే అకౌంట్‌కు నెలానెలా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నట్టు చూపి, ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్నాడు.
ఓ ఉపాధ్యాయుడు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 2019 మే 27న (లోన్ అకౌంట్ నంబర్ 712600001469) 38 లక్షలు రుణం తీసుకున్నట్టు పత్రాలు సమర్పించాడు. ఇంటి నంబర్ 8-2-8-3-81/1/2 భగత్‌నగర్ కరీంనగర్ పేరిట ఈ లోన్ మంజూరైనట్టు ఉన్నది. ఈ ఉపాధ్యాయుడు నెలానెలా ఇంట్రెస్టు కట్టినట్టు చూపి, ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నాడు.
ఇంకో ఉపాధ్యాయుడు కూడా ఇదే లోన్ అకౌంట్ నంబర్ (712600001469) పై 2018 ఫిబ్రవరి 27న 18 లక్షలను తీసుకున్నట్టు చూపడమే కాకుండా, ఇదే అకౌంట్‌కు నెలానెలా ఇంట్రెస్ట్ కడుతున్నట్టు చూపాడు. ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్నాడు. (పై అకౌంట్ నంబర్ పై రుణం తీసుకున్న ఉపాధ్యాయుల పేర్లు, ఇతర వివరాలు ‘నమస్తే తెలంగాణ’ వద్ద ఆధారాలతో ఉన్నా.. కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేరుగా పేర్లు పెట్టడం లేదు)
నిజానికి ఈ అకౌంట్ నంబర్ ఈ ముగ్గురికి మాత్రమే పరిమితం కాలేదని బయటపడుతున్నది. మరో నలుగురు ఉపాధ్యాయులు కూడా ఇదే అకౌంట్‌పై లోన్ తీసుకున్నట్టు చూపి, ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఏకంగా సంతకాలు, స్టేట్మెంట్లు, కావాల్సిన పత్రాలను ఫోర్జరీ చేసి పెట్టినట్టు తెలుస్తుండడం చర్చనీయాంశమవుతున్నది.
సాధారణంగా ఒక అకౌంట్‌పై.. బ్యాంకు లేక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అయినా.. మరే ఇతర ఫైనాన్స్ సంస్థ అయినా ఒకరికి మాత్రమే లోన్ ఇస్తాయి. భార్యాభర్తలు ఉంటే జాయింట్ అకౌంట్‌పై మంజూరు చేస్తాయి. కానీ, వేర్వేరు ఉపాధ్యాయులకు ఒకే అకౌంట్‌పై రుణం మంజూరు అవుతుందా? ఒకరికి 38లక్షలు, మరొకరికి 18 లక్షలు, ఇంకొకరికి 38 లక్షల చొప్పున రుణం ఇస్తుందా..? అదే అకౌంట్‌కు నెలానెలా ఇంట్రెస్టు కడుతున్నట్టు లెక్కలు చూపి ఇన్‌కంటాక్సు మినహాయింపులు పొందొచ్చా..? అంటే ఎవరైనా చెప్పే మాట ఎలా సాధ్యమని!
కానీ, మన జిల్లాలోని కొంత మంది ఉపాధ్యాయులకు మాత్రం సాధ్యమేనని తెలుస్తున్నది! ఐటీ మినహాయింపు కోసం ఆ టీచర్లు తొక్కిన అడ్డదారులను చూస్తే.. అధికారులకే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇటీవల ఒక స్కూల్ కాంప్లెక్సులో జరిగిన ఒక సంఘటన ఆధారంగా విచారణకు వెళ్తే ఎన్నో అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక్కో విషయాన్ని ఆరా తీస్తున్నప్పుడు ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఏకంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట ఫేక్ పత్రాలను తయారు చేసి, స్టేట్మెంట్లు సృష్టించి, వాటిని సమర్పించి మినహాయింపు పొందడం ఆధారాలతో సహా వెలుగు చూసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ తరహా ఒక తిమ్మాపూర్ మండలంలోనే ఏటా అరకోటికిపైగా ఇన్‌కంటాక్స్ ఏగవేస్తున్నట్టు బయటకు వస్తున్నది. అయితే ఇది ఉపాధ్యాయులే చేశారా..? లేక పంతుళ్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఇతరులెవరైనా దందా నడుపుతున్నారా..? అన్నది ప్రస్తుతం విద్యాశాఖలో హాట్ టాపిక్లా మారింది.
కరీంనగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఆస్కారముంటుంది. సేవింగ్స్ కింద గరిష్ఠంగా 1.50 లక్షల మినహాయింపు ఉండగా.. ఇంటి అద్దె, మెడికల్ బిల్లులు, అలాగే గృహారుణాల వంటి కింద కూడా పలు రకాల మినహాయింపులు వర్తిస్తాయి. అలాగే నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ కింద గరిష్ఠంగా 50వేలు ఉంటుంది. వీటితో పాటు ఇంటి అద్దె (హెచ్ఆర్ఏ)కు సంబంధించి మూడు రకాలుగా లెక్కించి, అందులో తక్కువ ఉన్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని మినహాయింపునిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకే చాలా మంది ఉపాధ్యాయులు తమ రిటర్న్ దాఖలు చేస్తున్నారు. అయితే ఆదాయపన్ను మినహాయింపు ఎక్కువగా జరిగేందుకు కొంతమంది ఆశ చూపినా అడ్డదారులు తొక్కడం లేదు. తప్పు ఏదో రోజు బయట పడుతుందని భావించి కూడా కొంత మంది ఉపాధ్యాయులు.. తప్పుడు దారుల్లో వెళ్లడం లేదు. కానీ, కొంత మంది టీచర్లు చేస్తున్న తప్పుడు పద్ధతులతో మొత్తం ఉపాధ్యాయ లోకమే బద్నాం అవుతుందన్న ఆందోళన విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
అధికారికంగా చాలా వరకు మినహాయింపులున్నా కొంత మంది పంతుళ్లు మాత్రం అదనంగా పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. బ్యాంకు స్టేట్మెంట్లు, అలాగే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన పత్రాల నుంచి లోన్ అకౌంట్ నంబర్ క్రియేషన్ వరకు బోగస్ పత్రాలు సృష్టిస్తున్నారు. సదరు తప్పుడు పత్రాలను పెట్టి ఆ లోన్ అకౌంట్‌కు.. అంటే తీసుకున్న రుణానికి ప్రతి నెలా ఇంట్రెస్ట్ కడుతున్నట్టు పత్రాలు కూడా తయారు చేస్తున్నారు. ఆ పత్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమర్పిస్తున్నారు.
సదరు ఉపాధ్యాయుడి సెల్ఫ్ డిక్లరేషన్ ఉటుండడంతో హెచ్ఎంలు సైతం ఆ పత్రాలను యథావిధిగా జిల్లా ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తున్నారు. అక్కడ కూడా పెద్దగా పరిశీలన లేకపోవడంతో ఆవే పత్రాలను యథావిధిగా అప్లోడ్ చేస్తున్నారు. ఆ ప్రకారమే ఫాం-16 పొందుతూ.. వ్యక్తిగతంగా తిరిగి రిటర్న్ సమర్పిస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నది. నిజానికి ఎక్కడైనా హెచ్ఎంలు వాటిని గుర్తించి సదరు టీచర్లను హెచ్చరించే ప్రయత్నం చేసినా.. వెంటనే యూనియన్ నాయకులు రంగంలో దిగుతున్నారు. లేదా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా! ఏమైనా ఉంటే మాకే ఇబ్బంది అవుతుంది? మీకేంటి సమస్య’ అంటూ ఎదురు తిరుగుతున్నారు. దీంతో ఆ హెచ్ఎంలు సైతం ‘తమకెందుకెలే’ పని కానిచ్చేస్తున్నారు.
ఇటీవల తిమ్మాపూర్ మండలంలోని ఒక స్కూల్ కాంప్లెక్స్‌లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తుండగా అనేక అక్రమాలు బయట పడుతున్నాయి. నిజానికి సదరు నిధుల గోల్‌మాల్‌కు పన్ను ఎగవేతకు సంబంధం లేదు. కానీ, కొంత మంది ఉపాధ్యాయులకు సంబంధించిన టాక్స్ వివరాలు ఆరా తీసినప్పుడు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బహిర్గతమవుతున్నాయి. ఒక తిమ్మాపూర్ మండలంలోనే నిబంధనలకు విరుద్ధంగా లేని రుణాలు తీసుకున్నట్టు పత్రాలు సృష్టించడం.. ఇదే కోణంలో ఫోర్జరీలు చేసి ఫేక్ పత్రాలు తయారు చేయడం..
వాటి ఆధారంగా పన్ను మినహాయింపులు పొందడం షరా మామూలే అన్నట్టుగా మారింది. ఈ ఒక్క మండంలోనే ఏటా అరకోటికిపైగా టాక్స్ ఏగవేసినట్టు వెలుగులోకి వస్తున్నది. నిజానికి నిబంధనల ప్రకారం కూడా చాలా మినహాయింపులున్నాయి. అయితే పెరిగిన వేతనాల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆదాయ పన్ను పడుతున్నది. దీనిని తప్పించుకోవడానికి కొందరు అడ్డదారులను వెతుక్కుంటున్నారు. అయితే ఈ తప్పులో చివరికి వారే ఇరుక్కోక తప్పదన్న విషయాన్ని గుర్తిస్తున్నారా.. లేదా.. ? అన్నది మున్ముందు తేలుతుంది. ఈ అక్రమాలు అధికారుల దృష్టికి వచ్చినా వాటిని బహిర్గతం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. తీగలాగితే డొంకంతా కదులుతుందని, తద్వారా విద్యావ్యవస్థ మొత్తానికి చెడ్డపేరు వస్తుందని ఆలోచిస్తున్నట్టు ఒక అధికారి ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
నిజానికి పన్ను మినహాయింపు కోసం ఉపాధ్యాయులే తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారా..? లేక ఎవరైనా బయటి వ్యక్తులు ఈ దందాను నడుపుతున్నారా..? అన్నది తేలాల్సిన అవసరమున్నది. బయట పడుతున్న పత్రాలను చూస్తే ఒకే ఇంటి నంబర్‌పై ఒకే రోజు రుణాలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిశితంగా పరిశీలిస్తే.. ఒకే అకౌంట్‌పై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఒకరే కీలకంగా వ్యవరిస్తున్నారా..? లేదా సదరు సూత్రదారుడు ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ దందాను నడుపుతున్నాడా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పన్ను మిహాయింపు కోసం కొంత మంది టీచర్లు ఎంతకైనా తెగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ‘పై ఒక అకౌంట్’పై విచారణ జరిపితే వాస్తవాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. దీని వెనకున్న సూత్రదారులు.. పాత్రదారులెవరో బయట పడుతుంది. తద్వారా సర్కారు ఆదాయానికి గండిపడకుండా ఉండడమేకాదు, ప్రధానంగా అడ్డదారులకు బ్రేక్ పడుతుంది. అలాగే ఉపాధ్యాయులు ఇటువంటి తప్పిదాల్లో ఇరుక్కోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు అవుతుంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉండగా.. పై మూడు అకౌంట్లలో ఎవరు ఒరిజనలో.. ఎవరు నకిలీనో తేల్చితే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశమున్నది.