జమ్మికుంట, సెప్టెంబర్ 5 : రైతు రుణ మాఫీ 40 శాతం మాత్రమే చేశారని, అర్హులందరికీ ఎందుకు మాఫీ చేయడం లేదో చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. 49 వేల కోట్లు చేయాల్సిన మాఫీని దశల వారీగా 17 వేల కోట్లు మాత్రమే చేశామని మంత్రులే చెబుతున్నారని, సీఎంకు, మంత్రులకు సమన్వయం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా.. పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయని, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మానకొండూర్ సీఐతో కరీంనగర్ సీపీ టెలీ కాన్ఫరెన్స్ మాట్లాడడం లేదని, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సాక్షాత్తూ మంత్రి ఇంట్లోనే విలేకరుల సమావేశంలో వెల్లడించడం ఏంటని ప్రశ్నించారు.
ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుందన్నారు. పోలీసుల ఇంటర్నల్ విషయాలు ఎమ్మెల్యేకు ఎలా తెలిశాయో? చెప్పాలని నిలదీశారు. అంటే సర్కారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసులు అధికారులు ఏం చేస్తున్నారో? ఏం మాట్లాడుతున్నారో? ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటున్నదని ఆరోపించారు. అధికారుల పోస్టింగులు పారదర్శకంగా ఉంటాయని, బాధ్యత అంతా ఉన్నతాధికారులదేనని సీఎం చెప్పిన విషయాలను గుర్తు చేశారు.
ఇప్పుడు మానకొండూర్ ఎమ్మెల్యే ఆయనే సీఐకి పోస్టింగ్ ఇప్పించినట్లు, సీపీ అతడిని పట్టించుకోవడం లేదనడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భద్రత కోసం పాటుపడే పోలీసులపై బురదజల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మనోభావాలు దెబ్బతీయడం సరికాదని హితవుపలికారు. మానకొండూర్ ఎమ్మెల్యే పోస్టింగులు ఇప్పించుకుంటే.. తాను కూడా ఇప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నాయకులతో పంపిణీ చేయడం సిగ్గుచేటని, వాళ్ల ఎమ్మెల్యేలు లేని చోట నిధులు కూడా మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పైసా ప్రజల సొమ్మని, ప్రజల సొమ్మును వాళ్ల కోసం ఖర్చు చేసేందుకు నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదో చెప్పాలన్నారు. నిధుల మంజూరు కోసం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతానని, ఎమ్మెల్యేగా తన హక్కులను సాధించుకుంటానని స్పష్టం చేశారు.
జమ్మికుంటలోని పెసరు బండను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని, కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వ భూములు మన ఆస్తులని, కలెక్టర్, అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు, నివేదికలు ఇస్తే అధికారుల నౌకర్లు పోతాయన్నారు. సమావేశంలో మున్సిపల్, పీఏసీఎస్ చైర్మన్లు రాజేశ్వర్‌రావు, సంపత్, కౌన్సిలర్లు భాస్కర్, సదానందం, రమేశ్, శ్రీనివాస్, నాయకులు రాజ్‌కుమార్, రామస్వామి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్, రాజేశ్, మొగిలి, జేకే, మాణిక్యం, జమీర్, జానీ, మనోహర్‌రావు, రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.