ఆది నుంచీ అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీపై తీపికబురు అందించింది. లక్షలోపు రుణాలు మాఫీ చేసే ప్రక్రియను నేటి నుంచే పునఃప్రారంభించాలని, సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో కర్షకలోకం దిల్ఖుష్ అవుతున్నది. నిజానికి గతంలోనే యాభై వేల వరకు పంట రుణాలు మాఫీ చేసినా.. తర్వాత కరోనా వంటి విపత్కర పరిస్థితులతో మరోసారి ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అప్పుడు ఆదాయ వనరులకు గండిపడడం, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వంటి కారణాలతో జాప్యం జరిగింది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ రుణమాఫీపై కీలక నిర్ణయం వెలువరించడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. బుధవారం రాత్రే పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల చెంపచెల్లుమనిపించేలా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
కరీంనగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పంట రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. అయితే 2014లో రుణమాఫీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా 2018లో చర్యలు తీసుకున్నది. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు రుణమాఫీ చేసేందుకు అప్పట్లో మార్గదర్శకాలు ఇచ్చింది. అప్పుడే జీవో నంబర్ 148ని జారీ చేసింది. అయితే మొదటిసారి 2014లో రుణమాఫీ చేసిన సమయంలో చాలా మంది బోగస్ పత్రాలు చూపి లబ్ధి పొందే ప్రయత్నం చేయగా, అలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి నుంచి చర్యలు చేపట్టింది. అందుకోసం పకడ్బందీ ఫార్మాట్ తయారు చేయించింది. 27 అంశాలను పొందు పరిచి వివరాలు సేకరించింది. 2018 డిసెంబర్ 11 నాటికి సంబంధిత రైతు ఉన్న అవుట్ స్టాండింగ్ వివరాల వంటి అనేక అంశాలతో ఈ ఫార్మాట్ పూర్తి చేసి రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ముందుగా 25వేల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది. ఆ తర్వాత 50వేలలోపు వారికి మాఫీ చేసింది. తిరిగి లక్షలోపు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కరోనా మహమ్మారి రాకతో విపత్కర పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినట్టుగానే.. రాష్ట్రం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నది. కొంత మంది రైతులకు రుణమాఫీ జరిగినా మరికొంత మందికి పెండింగ్‌లో పడిపోయింది.
నేటి నుంచే రుణమాఫీ పునఃప్రారంభం
ఇచ్చిన మాటను అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని పేరున్న కేసీఆర్, ఇప్పుడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, రైతుబంధు తరహాలో విడుతల వారీగా కొనసాగిస్తూ.. సెప్టెంబర్ రెండో వారంలోగా రైతులందరికీ రుణమాఫీ వర్తింప జేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుత్నుది. క్లిష్ట పరిస్థితులున్నా క్రమం తప్పకుండా రైతుబంధు ఇస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్న తరుణంలో రుణమాఫీ చేయడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందంటున్నారు రైతులు. ఈ సాహసోపేత నిర్ణయం, మరోసారి కేసీఆర్‌ను రైతుపక్షపాతి అని నిరూపించిందని చెబుతున్నారు నిపుణులు.
ప్రతిపక్షాల చెంపచెల్లుమనేలా
రైతు రుణమాఫీ చేయరంటూ ప్రతిపక్షాలు ప్రతినిత్యం పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. రైతుల వద్దకు వెళ్లి కావాలనే విషం గక్కుతున్నాయి. కరోనా వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చేయలేకపోయామని, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడగానే చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తున్నా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు, గతంలో 50వేలు మాఫీ చేసిన విషయాన్ని సైతం కనుమరుగయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం తీసుకోవడంతోపాటు వచ్చే సెప్టెంబర్ రెండో వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో ప్రతిపక్షాలకు నోరు మెదిపే అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లూ చేస్తున్న విషప్రచారాలకు ఇక ముందు బ్రేక్ పడనుండగా, సీఎం కేసీఆర్‌పై రైతుల్లో చెక్కు చెదరని విశ్వాసం వ్యక్తమవుతున్నది.
2014లో 1683 కోట్ల మాఫీ
మొదటిసారి 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అప్పు డు లక్షలోపు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఆనా డు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని చాలా మంది వ్యక్తులు బోగస్ రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ముందుగా చేసిన ఆనాటి లెక్కల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలో 4,48,634 మంది రైతులకు 2,221 కోట్లను పంట రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు ముందుగా లెక్క తేల్చారు. అలాగే గోల్డ్ రుణాల పేరిట 28,083మంది రైతులకు 284 కోట్లు ఇచ్చినట్లు తేల్చారు. 2014 మార్చి 31నాటికి మొత్తం 4,76,717 మంది రైతులకు 2,505 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ముందుగా ప్రభుత్వానికి లెక్కలు పంపారు. అయితే ఈ లెక్కలపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు రంగంలోకి దిగి నిగ్గు తేల్చారు. రెండోసారి ఇచ్చిన గణాంకాల ప్రకారం.. 3,84,106 మంది రై తులు రుణమాఫీకి అర్హులని తేల్చారు. వీరు తీసుకున్న మొత్తం 1683 కోట్లుగా నిర్ధారించారు. ఆమేరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ముందుగా ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే 4,76,717 మందికి 2,505 కోట్లను మాఫీచేయాల్సి వచ్చేది. అధికారుల విచారణ అనంతరం చూస్తే 92,611 మంది రుణమాఫీకి అనర్హులని తేలిపోయింది. సదరుఅనర్హులు తీసుకున్న మొత్తం 822 కోట్లుగా నిర్ధారించారు. అందుకే 2014లో జరిగిన పొరపాట్లు 2018లో జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది.
రుణమాఫీపై ఆనందహేల
సారంగాపూర్, ఆగస్టు 2: రైతు రుణమాఫీని పునఃప్రారంభిస్తుండడంపై రైతులు ఆనందపడుతున్నారు. బుధవారం రాత్రి బీర్పూర్ మండలంలోని కొల్వాయిలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినదిస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లమైపాల్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రం గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రామకిష్టు గంగాధర్, గ్రామశాఖ అధ్యక్షుడు రామకిష్టు సతీశ్, నాయకులు జక్కుల చంద్రయ్య, రమేశ్, అశోక్, వెంకటేశ్, , మల్లయ్య, ఆగస్త్యిన్, శ్రీనవాస్, తిరుపతి, రైతులు ఉన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా, మరే ముఖ్యమంత్రి చేయనివిధంగా కర్షకుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషిచేస్తున్నరు. రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి తిరుగులేదు. కరోనా వంటి విపతర పరిస్థితులు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు, నోట్లరద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా రైతులకు వెనుదన్నుగా, రైతు బాంధవుడిగా నిలిచారు. ఈ క్రమంలో రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. పంట పెట్టుబడి కింద ఎకరానికి రూ.10వేల సాయం ఇవ్వడమేకాదు నిరంతర ఉచిత కరెంటు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇస్తున్నరు. ముఖ్యంగా సాగుకు అవసరమైన జలాలను కాళేశ్వరం ద్వారా అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని వ్యవసాయ వనరుగా, ధాన్యాగారంగా తీర్చిదిద్దారు. ఎంత నష్టమైనా పండించిన పంట మొత్తాన్ని ఊరూరా సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఇలా రైతులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగం పక్షాన, రైతుబిడ్డగా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
– గంగుల కమలాకర్, మంత్రి
3,64,599 మందికి వర్తింపు
తాజా రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,64,599 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడుతల్లో అంటే మొదటి విడుతలో 25వేల లోపు రుణం తీసుకున్న రైతులకు, అలాగే రెండో విడుత 50వేలు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింపజేసింది. ప్రస్తుతం లక్షలోపు రుణమాఫీ కానున్నది.
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని కొనసాగించినం. కరోనా ఉపద్రవం, నిధుల కేటాయింపులో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల కొంత జాప్యం జరిగింది. అయినా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించింది. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంట.
– ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్
రైతులకు మేలు చేసింది కేసీఆర్ ఒక్కరే
నాకు బూరుగుపల్లి శివారుల ఐదెకరాల ఎవుసం భూమి ఉన్నది. నేను ఎన్నో ఏండ్ల సంది ఎవుసం చేసుకుంట బతుకుతున్న. రాష్ట్రం రాక ముందు రైతుల పరిస్థితి ఎట్లుండె? ఇప్పుడు ఎట్లున్నదో? మేం కండ్ల ముందు చూస్తున్నం. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడ్డమో మాకు తెలుసు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు పాలకులు మారినా మా రైతుల గురించి ఎవరూ ఆలోచించలె. మా జీవితాల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ ఒక్కరే. ఆయన మా కోసం ఎంతో చేస్తున్నడు. సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్నడు. కాళేశ్వరంతోని గోదావరి నీళ్లు తెచ్చిండు. పంట పెట్టుబడికి రైతు బంధు ఇస్తున్నడు. ఇప్పుడు రుణమాఫీ చేస్తనని ప్రకటించిండు. నేను బూరుగుపల్లి గ్రామీణ బ్యాంకుల తీసుకున్న లక్ష రూపాయల లోన్ మాఫీ అయితదని సంతోషంగా ఉన్నది. కానీ, కొందరు రుణమాఫీ చేయరని చెప్పిన్రు. నేను మాత్రం కేసీఆర్ సార్‌పై నమ్మకంతో ఉన్న. గతంలో నేను తీసుకున్న రుణాన్ని కేసీఆర్ సారు మాఫీ చేసిండు. ఇప్పుడు మళ్లీ రుణం మాఫీ అయితదని చెప్పిండు. అందరిల నా మాటే నిజమైంది. ఎవ్వలెన్ని చెప్పినా రైతులందరం కేసీఆర్ వెంటే ఉంటం.
– భైరినేని సత్యనారాయణరావు, బూరుగుపల్లి (గంగాధర)
రూ.50 వేలు లోన్ తీసుకున్న..
సీఎం కేసీఆర్ మేం అడుగకున్నా మాకు అన్ని తెచ్చిపెడుతుండు. మాకు ఏ బాధా లేకుండా చూసుకుంటండు. పంట వేసుడు దగ్గరి నుంచి అమ్ముకునే దాకా అడుగడుగునా అండగా నిలుస్తండు. స్వరాష్ట్రంలో మా బతుకులు మార్చిండు. అనేక పథకాలు తెచ్చి ఎవుసాన్ని పండుగలా మార్చిండు. నాకు ధరూర్ల రెండెకరాల భూమి ఉంది. పంట సాగు కోసం రూ.50 వేలు లోను తీసుకున్న. ఇప్పుడు ఆ లోన్ మాఫీ చేస్తమని సీఎం సారు అంటే చాలా సంతోషమనిపించింది. మా ఇంట్లో అయితే పండగలా ఉంది ఈ రోజు. లోన్ కడితే నా పిల్లల చదువుకు అప్పు చేసుడైతదని అనుకున్న. కానీ ఇప్పుడు సార్ అప్పులు లేకుంట చేసిండు.
– చెప్యాల నర్సవ్వ, ధరూర్, జగిత్యాల మండలం
బతికినంత కాలం మర్చిపోం..
సీఎం కేసీఆర్ సారు గొప్ప మనసున్న నాయకుడు. రైతులకు మర్చిపోలేని సాయం చేత్తండు. దండుగ అనుకున్న ఎవుసాన్ని పండుగ లెక్క చేసిండు. 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చుడే గొప్ప అనుకుంటే రైతులు తీసుకున్న పంటరుణం కూడా మాఫీ చేస్తానని చెప్పిండు. నా ఎరుకల గిప్పటి వరకు ఏ సర్కారోళ్లు అచ్చి ఓట్లు అడిగిన్రే తప్ప మా రైతుల బాధలు పట్టించుకోలె. తెలంగాణ రాకముందు క్రాప్ లోన్ తీసుకుంటే పంటలు పండక అది కట్టేతందుకు మళ్ల అప్పులు చేసేది. బ్యాంకుల తీసుకున్న అప్పు అట్లనే ఉండేది. అవి కట్టేతందుకు భార్య మీద ఉన్న బంగారం తాకట్టు వెట్టాల్సి అచ్చేది. గిన్ని కష్టాల నడుమ నాకు ఎనిమిది ఎకరాల్ల ఎవుసం చేసినా పాయిదా లేకుండె. తెలంగాణ సర్కారు సీఎం కేసీఆర్ సారు మా మీద దయచూపిండు. దేశంల ఎక్కడ లేనివిధంగా మా కోసం పథకాలు అమలు చేస్తున్నడు. ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడి పంట రుణమాఫీ చేస్త అన్నడు. నేను బ్యాంకుల నా పంట మీద తీసుకున్న లక్ష రూపాయల రుణం మాఫీ అయితది. సంబురంగ ఉన్నది. ఎంత కష్టపడితే లక్ష సంపాదిస్త. గింత మేలు జేసిన సీఎం కేసీఆర్ సార్‌ను బతికుండగా మర్సిపోయేది లేదు.
-హనుమాండ్ల రవీందర్‌రెడ్డి, యువరైతు దేశాయిపల్లి (వీణవంక మండలం)
రైతు సంక్షేమాన్ని కోరుకునేది కేసీఆర్ ఒక్కరే
తెలంగాణ రాకముందు ఎవుసం అంటే దండుగ అన్నట్టే ఉండేది. పెట్టుబడి, కరెంటు, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ఇలా అన్నింటికీ గోసపడేది. రాష్ట్రం వచ్చినంక మా రైతుల కష్టాలు తీరినయ్. 24 గంటల కరెంటు అచ్చింది. 365 రోజులు నీళ్లు ఉంటున్నయి. పెట్టుబడికి రైతు బంధు ఇత్తున్నడు. ఇక రైతు రుణమాఫీ చేస్తమని కేసీఆర్ సారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటండు. నాకు తాడిజెర్రి గ్రామ పరిధిలో ఆరెకురాల వ్యవసాయ భూమి ఉన్నది. నేను బ్యాంకుల 60 వేల రుణం తీసుకున్న. నాకు రుణమాఫీ అయితది. రైతు సంక్షేమాన్ని కోరుకునేది ఒక్క కేసీఆర్ సారేనని మేమంతా బలంగా నమ్ముతం. గతంలం కాంగ్రెసోళ్ల పాలన చూసినం. కేంద్రంలో బీజేపోళ్లు పాలన చూస్తున్నం. తెలంగాణల కేసీఆర్ సార్ పాలన చూస్తున్నం. 50 ఏండ్లళ్ల ఎవ్వలు చేయని పనులు కేసీఆర్ సారు చేసి చూపిండు. ఆ సారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. సీఎం కేసీఆర్‌ను తప్ప ఇంకెవ్వలను నమ్మే స్థితిలో మేం లేం. మా రైతులమంతా కేసీఆర్ సారు వెంటే ఉన్నం. ఉంటం.
– రామిడి సురేందర్, తాడిజెర్రి (గంగాధర)
లోన్ బాధలు తీరుతున్నయ్
నాకు లింగంపల్లిల మూడెకరాల భూమి ఉంది. ఒకప్పుడు ఎవుసం చేయాలంటే పెట్టుబడులకు అందరి వద్ద చేయి చాపి అప్పు చేయాల్సి వస్తుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం ఇస్తంది. దానికి తోడు బ్యాంకులు క్రాప్లోన్లు కూడా ఇస్తున్నయి. కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తడని నమ్మకంతో నేను రూ.లక్ష తీసుకున్న. విత్తనాలు, ఎరువులు కొన్న. అనుకున్నట్టే కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తమని తియ్యటి వార్త చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంల రైతుబంధు, రుణమాఫీతో మాకెంతో ధైర్యం వచ్చింది. ఆధైర్యంతో పంటలు వేసుకుంటున్నం.
– బూర్ల లక్ష్మీనర్సయ్య, రైతు, లింగంపల్లి (చందుర్తి మండలం)
వడ్డీ కట్టే బాధ తప్పింది..
నాకు పెద్దపల్లిల రెండెకరాల భూమి ఉంది. పంట సాగు కోసం రుణం తీసుకున్న. ఆనాడే అనుకున్న కేసీఆర్ సార్ ఎన్నటికైనా రుణం మాఫీ చేస్తడని. అనుకున్నట్టే ఇయ్యాల చెప్పిండు. మా కోసం ఇంతలా ఆలోచించే ప్రభుత్వం ఎక్కడా లేదు. గతంలో ఎప్పుడూ రాలె. నాడు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేయలే. ఇప్పుడు కేంద్రం ఉన్న బీజేపీ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాతే మా జీవితాలు మారినయి. ఇక నాకు వడ్డీలు కట్టుకొని రెన్యూవల్ చేసుకునే బాధలు తప్పినై. రేపో ఎల్లుండో నా రుణం మొత్తం మాఫీ అయితది. సీఎం సార్‌కు కృతజ్ఞతలు.
-పోగుల మల్లయ్య, రైతు పెద్దపల్లి.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఎవుసం చేస్కొనే బతుకుతున్న. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకున్నట్టు ఇంతకుముందు ఎవరూ ఆదుకోలె. నారు పోసిన కాన్నుంచి మొదలు వడ్లు కొనే దాకా మా రైతుల వెంట ఉంటున్నడు. మా కష్టాలు తీరుస్తున్నడు. పంట వేసేముందు రైతుబంధు కింద పంట సాయం, 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తున్నడు. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నడు. మా కోసం ఇంత చేసిన కేసీఆర్ రుణమాఫీ కూడా చేస్తడని నమ్మకంగా ఉన్నం. ఇప్పుడు రుణమాఫీ చేస్తమని అంటున్నరు. చాలా సంతోషంగా ఉన్నది. నేను బ్యాంకుల లక్ష రుణం తీసుకున్న. ఇప్పుడు మాఫీ చేస్తే నా అప్పు తీరుతుంది. నాలాంటి ఎంతో మంది రైతులకు ఎంతో మేలు జరుగుతది.
– మారంపెల్లి నర్సయ్య, లక్ష్మీపూర్ (జగిత్యాల మండలం)
అప్పు లేకుంట చేస్తండు..
మా రైతుల కోసం ఇంతగానం ఆలోచించిన సర్కారును నా బుద్దెరిగినకాన్నుంచి చూల్లే. కేసీఆర్ సారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మా కోసమే పనిచేస్తున్నట్లు అనిపిస్తంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిన గానీ ఇట్ల ఎవరూ పనిచేయలే. మా మేలు కోసం అనేక పథకాలు తెచ్చిండు. రైతు బంధు కింద సాయం చేస్తండు. ఇప్పుడు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తండు. వ్యవసాయం దండుగ అన్న నోర్లు మూతపడేలా పండుగలా మార్చిండు. బ్యాంకుల్లో పంట సాగు కోసం తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మా రైతులమంతా రుణపడి ఉంటాం.
-బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, రైతు నాగారం, మంథని మండలం.
కండ్ల ముందు కనిపించే దేవుడు కేసీఆర్..
మాది నర్మాల. ఊళ్లే నాకు ఎకురం భూమి ఉంది. నాడు వ్యవసాయ మంటే పెద్ద నరకమనిపించేది. సాగునీరు లేదు, కరెంటు రాదు. పొద్దంతా నాగలిపట్టి దుక్కులు దున్నినా దిగుబడి రాకపోయేది. తీసుకున్న బ్యాంకులోన్ కట్టకపోతే ఇండ్ల తలుపులు తీసుకొని పోయిండ్రు. కాళ్లా వేళ్లా పడ్డ వినలేదు. తీసుకున్న అప్పుకు మిత్తిమీద మిత్తివేసి రక్తం తాగిండ్రు. నాటి రోజులు యాజ్జేసుకుంటే కండ్లనిండా నీళ్లు తిరుగుతున్నయి. తెలంగాణ వచ్చినంక మా బతుకులు బాగుపడ్డయి. దేవుడెక్కడో లేడు. కండ్ల ముందే కనిపిస్తున్న కేసీఆర్ మాకు దేవుడే. బ్యాంకుల్లో వచ్చి మీదపడకముందే లోన్లు మాఫీజేసి ఆదుకుంటున్నందుకు సంబురపడుతున్నం.
– గోగు బాలయ్య, రైతు, నర్మాల, (గంభీరావుపేట మండలం)