తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతుడిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు మాఫీపై సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని చూస్తే.. ఉమ్మడి జిల్లాలో నలభై శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందా..? లేదా..? అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది. నిజానికి 2014లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 3.84లక్షల పై చిలుకు రైతులకు రుణమాఫీ వర్తింప జేసింది. కేసీఆర్ సర్కారు వ్యవసాయరంగంపై చూపిన శ్రద్ధతో గడిచిన పదేళ్లలో సాగు విస్తీర్ణంతోపాటు సాగు చేసే రైతుల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ లెక్కన కొంత అటు ఇటుగా ఆరు నుంచి ఏడు లక్షలకుపైగా కర్షకులకు ప్రస్తుతం రుణమాఫీ వర్తించాల్సి ఉండగా.. ప్రస్తుతం సర్కారు నిబంధనలతో రెండు నుంచి మూడు లక్షల మందికి మాత్రమే లబ్ధిచేకూరే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు మూడు విడుతల్లో రుణమాఫీ చేస్తామని చెబుతుండగా.. మొదటి విడుత గురువారం లక్ష వరకు ఉన్న 1,29,178 మంది ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్టు యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. నిజానికి లక్ష లోపు బ్యాంకు రుణం తీసుకున్న చాలా మంది పేర్లు మొదటి విడుత జాబితాలో లేవని తెలుస్తుండగా.. పాస్‌బుక్ కాకుండా ఆహారభద్రత కార్డు ఆధారంగా లిస్ట్ తయారు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ సర్కారు 2014లోనే రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆనాడు ఉమ్మడి జిల్లాలో 4,48,634 మంది రైతులకు 2,221 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్టుగా ముందుగా బ్యాంకర్లు ప్రకటించారు. వీటితోపాటు బంగారం కుదువ పెట్టుకొని (గోల్డ్ రుణాల పేరిట) 28,083 మంది రైతులకు 284 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు తేల్చారు.
మొత్తంగా 2014 మార్చి 31 నాటికి 4,76,717 మంది రైతులకు 2,505 కోట్ల వ్యవసాయరుణాలు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన నివేదికలో పలు తప్పులు జరిగాయని, అనర్హులకు సైతం రుణమాఫీ చేస్తున్నారనే ఫిర్యాదులు క్షేత్రస్థాయి నుంచి రావడంతో అధికారులు రంగంలోకి నిగ్గు తేల్చారు. ఆ ప్రకారం ఆనాడు ఉమ్మడి జిల్లాలో 3,84,106 మంది రైతులు రుణమాఫీకి అర్హులని, వీరు తీసుకున్న మొత్తం 1683 కోట్లుగా నిర్ధారించింది. బ్యాంకర్లు, అధికారులు నిగ్గు తేల్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేసింది.
పెరిగిన రైతులు, సాగు విస్తీర్ణం
2014లో కేసీఆర్ సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014లో ఉమ్మడి జిల్లాలో అన్ని పంటలు కలిపి 11,79,013 ఎకరాల్లో సాగుచేస్తే.. 2019 నాటికి అది 22,41,066 ఎకరాలకు చేరింది. అంటే 10,62,053 ఎకరాల్లో సాగు పెరిగింది. 2014లో వరి సాగు 3,63,776 ఎకరాల్లో ఉంటే 2019 నాటికి అది 12,35,223 ఎకరాలకు చేరింది.
అంటే 8,71,447 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగింది. ఇదంతా కాళేశ్వరం జలాలు రావడంతోనే సాధ్యమైంది. 2014లో ఆనాడు వ్యవసాయం చేసిన రైతుల సంఖ్య ఐదు లక్షల వరకు ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 9,25,343కు చేరింది. అంటే దాదాపు నాలుగు లక్షల వరకు రైతుల సంఖ్య పెరిగింది.
ప్రాజెక్టులు పూర్తి చేయడం. చెక్‌డ్యాంలు నిర్మించడం, ఇదే సమయంలో మిషన్‌కాకతీయ కింద చెరువులు పునరుద్ధరించడం, వరద కాలువ నిండుగా మారడం, మధ్యమానేరు, లోయర్‌మానేరు డ్యాంలతోపాటు అనుసంధాన ప్రాజెక్టుల్లో 365 రోజులు నిండుకుండలా నీళ్లుండడం, భూగర్భజలాల ఉబికిరావడం, ఫలితంగా ఈ సాగు విస్తీర్ణం పెరగడం సాధ్యమైంది. అంతేకాదు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల సిరిసిల్ల వంటి మెట్ట ప్రాంతాల్లో అనుహ్యంగా పెరిగిన భూగర్భజలాలు.. ఐఏఎస్‌లకే ఒక పాఠ్యాంశంగా మారాయంటే సాగునీటి రంగంలో ఏమేరకు మార్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనలతో కొర్రీలు
తాము అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ.. వరంగల్ డిక్లరేషన్‌లో స్పష్టం చేసింది. ఇంకా అభయహస్తం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రైతు భరోసా కింద 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు, వరి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. అందులో ఏ ఒక్క హామీ ఇప్పటివరకు అమలుకు నోచలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అయినా అందరికీ వర్తింపజేస్తారా..? లేదా..? అన్నదానిపై అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
పంట రుణమాఫీ పథకం -2024 అమలుకు ఇచ్చిన నిబంధనల్లో.. పీఎం కిసాన్ మినహాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు కోసం పరిగణలోకి తీసుకుంటామని అందులో పేర్కొన్నది. ఈ నిబంధన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రామాణికంగా తీసుకుంటారన్న అంశంపై మెజార్టీ రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నది. నిజానికి పీఎం కిసాన్ అమలుకు రాష్ట్రంలో రైతు భరోసా (రైతు బంధు) అమలుకు చాలా వ్యత్యాసం ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, కేంద్ర పథకాలకు లింకు పెట్టడం ఏమాత్రం సముచితం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలు అమలు చేస్తే లక్షలాది మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయే ప్రమాదమున్నది. ప్రధానంగా రైతు కుటుంబాల్లో ఉన్నత చదువులు చదివే పిల్లలు బ్యాంకు రుణం పొందాలంటే.. తన తండ్రి పేరిట ఐటీ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలన్నా ఐటీ రిటర్న్స్ ఉండి తీరాలి. నిజానికి వీరంతా ఐటీ చెల్లింపులు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న వారు కారు. పిల్లల అవసరాల దృష్ట్యా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారే. పీఎం కిసాన్ కింద ఐటీ చెల్లింపులు ఉన్న వారికి సమ్మాన్ నిధి వర్తింపులేదు. ఇదే నిబంధనను రైతులకు పెడితే రుణమాఫీ వర్తించకుండా పోయే ముప్పు ఉన్నది.
నేడు 1,29,178 మందికి వర్తింపు
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతున్నది. ముందుగా ఆహార భధ్రతకార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తామంటూ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నది. దీనిపై బీఆర్ఎస్ ఎండగట్టడం, ఇదే సమయంలో రైతుల నుంచి విమర్శలు రావడంతో రేషన్‌కార్డుతోపాటు పాస్‌బుక్‌ను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. దీంతోపాటు మొత్తం రుణమాఫీని ఆగస్టు నెలాఖరులోగా వర్తింప జేస్తామంటూ బుధవారం సాయత్రం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
అందులో భాగంగా లక్ష వరకు రుణం తీసుకున్న వారికి గురువారం చెల్లింపులు జరుగుతాయని, 1.50 లక్షల రుణం అన్నదాతలకు ఈ నెలాఖరులోగా, 2 లక్షల వరకు అప్పు తీసుకున్న వారికి ఆగస్టు నెలాఖరులోగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మొదటి విడుత అంటే.. లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు గురువారం సాయత్రంలోగా రుణమాఫీ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ ప్రకారం చూస్తే.. సిరిసిల్లలో 23,779 మందికి, కరీంనగర్లో 36,872, జగిత్యాలలో 39,253, పెద్దపల్లిలో 29,274 మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,29,178 మందికి వర్తిస్తున్నట్టు ఆయా జిల్లాల యంత్రాగం ప్రకటించింది. నిజానికి ఇటీవల ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఉమ్మడి జిల్లాలో 7,11,575 మందికి వర్తింప జేసింది. ఈ లెక్కన చూస్తే.. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు రెండున్నర లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నా.. ప్రస్తుతం 1.29 లక్షల పైచిలుకు మందికి మాత్రమే మాఫీ వర్తింపజేస్తున్నది.
అంటే కేవలం ఆహారభద్రత కార్డు ఆధారంగానే ఈ జాబితా తయారు చేశారని, పాస్‌బుక్‌ను పరిగణలోకి తీసుకోలేదని, ఫలితంగా వేలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తం మూడు విడుతల్లో కలిపి కూడా రెండు నుంచి రెండున్నర లక్షల మంది రైతులకు మించి రుణమాఫీ జరిగే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. నిజానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తింపు జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి అధికార యంత్రాగం పంపింది. వాటిని మాత్రం అధికారులు బయట పెట్టడం లేదు. పెడితే రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తే అవశాశముందని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇది ఇలా ఉండగా మొదటి విడుత కింద సైతం చాలా మంది రైతుల పేర్లు జాబితాలో రాలేదని తెలుస్తుండగా, సదరు రైతులు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతున్నది. మరోవైపు రుణమాఫీ ప్రక్రియను విస్తృత ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రైతు వేదికలను వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగానే గురువారం సాయత్రం సీఎం రైతు వేదికల్లో రైతులతో ప్రసంగిస్తారని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57. జగిత్యాలలో 71, పెద్దపల్లిలో 54, కరీంనగర్లో 75 రైతు వేదికల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎంపిక చేసిన రైతులను మాత్రమే రైతు వేదికలకు ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.
మొదటి విడుత కింద లక్షలోపు రుణమాఫీకి సంబంధించిన రైతు వివరాలు
జిల్లా; రుణమాఫీ వర్తించే రైతుల సంఖ్యరాజన్నసిరిసిల్ల; 23,779
కరీంనగర్ ; 36,872
జగిత్యాల ; 39,253
పెద్దపల్లి ; 29,274