శంకరపట్నం, అక్టోబర్ 16: కారు జోరును ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలంలోని లింగాపూర్ ఎంపీటీసీ అంతం లత బీజేపీకి చెందిన ఆమె భర్త రాజిరెడ్డితో కలిసి సోమవారం రాత్రి మానకొండూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్‌తో పాటు జీవీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 100 మందితో పాటు మెట్పల్లి గ్రామానికి చెందిన మరో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు సభ్యులు పొలవేని భాగ్య, ముద్రకోళ్ల నిరంజన్, అంతడ్పుల శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జీవీఆర్ మాట్లాడుతూ, కారు స్పీడ్ చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బెంబేలెత్తుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గెలుపు లాంఛనమేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచులు కోండ్ర రాజయ్య, కలకుంట్ల రంజిత్‌రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు అంతం తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంగల కిషన్‌రెడ్డి, వేముల మనోహర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.