Excise raids | ముత్తారం, జూన్ 8: ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, సందరెల్లి, జిల్లెల్లపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో నాటు సారాయి తయారీ చేస్తూ అమ్మకం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అడవి శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో నాటు సారాయి తయారీ కోసం సిద్ధంగా ఉంచిన ఇప్పపువ్వు, బెల్లం పానకం సుమారు 200 లీటర్లను ధ్వంసం చేశారు.
అనంతరం గతంలో ఓడేడు, అమరాబాద్ ప్రాంతాలలో నాటు సారాయి అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను తహసీల్దార్ ఎదుట సంవత్సర కాలం పాటు రూ.లక్షకు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రాకేష్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా నాటు సారాయి అమ్మిన, రవాణా వేసిన, తయారు చేసిన ఆ వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి బైండోవర్ చేసి అట్టి వ్యక్తులను ఒక సంవత్సర కాలం పాటు జైలుకు పంపడం లేదా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించబడునని హెచ్చరించారు. ఇక్కడ ఎస్సై సాయి కుమార్, సిబ్బంది రాజేందర్, శ్రీను, రఘురాం, రవి పాల్గొన్నారు.