Sircilla Collectorate | కలెక్టరేట్, మే 26 : రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు చెందిన అధికారి నర్సింగ్ కలెక్టరేట్ లిఫ్ట్‌లో చిక్కుకుని గంటన్నరపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా విధులకు హాజరయ్యేందుకు లిఫ్ట్ ఎక్కిన నర్సింగ్, మధ్య అంతస్తులో లిఫ్ట్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో ఆయన లోపలే బంధించబడ్డారు. కొద్దిసేపటి వరకు గాలి ఆడకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన తనకు ‘శ్వాస ఆడడం లేదు ఎవరూ స్పందించడం లేదు’ అంటూ ఫోన్ ద్వారా ఇతర ఉద్యోగుల సహాయం కోరారు.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సమయంలో నర్సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, చెమటలు పట్టి భయాందోళనకు లోనయ్యారని సహచర ఉద్యోగులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది, సాంకేతిక నిపుణులు హుటాహుటిన చేరుకుని గంటన్నర తర్వాత లిఫ్ట్ తలుపులు తెరిచి ఆయనను బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనతో కలెక్టరేట్ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘రోజూ లిఫ్ట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం సరైన మెయింటెనెన్స్ లేక ఉద్యోగుల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి’ అంటూ పలువురు ఉద్యోగులు వాపోయారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు ఈ లిఫ్ట్‌పైనే ఆధారపడాల్సి వస్తోందని, ఇలాంటి ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయని పలువురు వాపోయారు. కలెక్టరేట్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయంలోనే ప్రాథమిక భద్రతా ప్రమాణాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి వెంటనే లిఫ్ట్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.