Nandi Pump House | ధర్మారం,మార్చి 27: కాళేశ్వరం లింక్-2 కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా రెండవ రోజు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కు అనుబంధంగా ఉన్న వరద కాలువకు నీటి ఎత్తిపోతలు కొనసాగాయి. నీటిపారుదల శాఖ అధికారులు గురువారం నుంచి జలాల ఎత్తిపోతల ప్రక్రియ చేపట్టిన విషయం విధితమే. ప్రారంభం రోజున 2,4 మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతల ను చేపట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరదాక నడిపించారు.
అనంతరం మరుసటి రోజు శుక్రవారం ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు మోటార్ల నెంబర్లను మార్చారు.5,7 నెంబర్ల మోటార్లను ఆన్ చేసి నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్నల ద్వారా పంపింగ్ అవుతోంది. ఈ రిజర్వాయర్ మెయిన్ గేట్లను ఓపెన్ చేయడంతో అదే పరిమాణంలో జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిపోతోంది. అక్కడ రెండు బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో జలాలు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కు అనుబంధంగా ఉన్న వరద కాలువ కు ఎదురెక్కుతున్నాయి. వరద కాలువ లోకి గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో కాల్వకు ఎగువనగా వరి సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.