Godavarikhani | కోల్ సిటీ, మే 26: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి కే. కనకరాజ్ పేర్కొన్నారు. గోదావరిఖని ఎల్బీ నగర్ 32వ డివిజన్ మహాసభ ఆ డివిజన్ కార్యదర్శి మార్కపురి సూర్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాలను ప్రజలు నమ్మి ఓటు వేసి అధికారం కట్టబెడితే ఆ ప్రజలను మోసం చేసి ఇప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో సీపీఐ రాజీలేని పోరాటాలకు సిద్ధంగా ఉందన్నారు. అందుకు డివిజన్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను చంపగలదేమో గానీ, వామపక్ష భావజాలంను అంతం చేయలేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు.
2026 లోపు మావోయిజంను ఏరిపారేస్తామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అతి క్రూరంగా భారత పౌరులను చంపిన ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టడంలో వెనక్కి వచ్చిన కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఆపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు అలరించాయి.
ఈ మహాసభలో సీపీఐ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ, రేణిగుంట్ల ప్రీతం, శనిగరపు చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, నక్క రాయమల్లు, పోతరాజు నాగరాజు, సుద్దాల అనురాజ్, మార్కపురి సౌజన్య, సరోజన, పుష్ప, మంగ, లక్ష్మీపతి, రవి, కళాకారులు ఎజ్జ రాజయ్య, లెనిన్, జూల మోహన్, మొండి తదితరులు పాల్గొన్నారు.