Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 12: కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, గౌరవ అధ్యక్షులు వై.యాకయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం జేఏసీ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పాల్గొని విజయవంతం చేశారు.
అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయడం శుభ పరిణామమనీ, ఐక్యతతో పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని కార్మికులకు సూచించారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరిగిన సమ్మెతో మోడీ ప్రభుత్వం దిగి రాకపోతే కార్మిక వర్గమంతా ఏకమై కేంద్రంలో మోడీ ప్రభుత్వంను గద్దె దించడం ఖాయమన్నారు.
కార్మికులకు కనీస వేతనాలు రూ.26వేలు అమలు చేయాలనీ, 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. కాగా సమ్మెకు ఐలు రాష్ట్ర మహిళా కన్వీనర్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కిషన్ నాయక్, రమణ, సమ్మక్క, శేఖర్, రామలక్ష్మి, సంతోష్, వేల్పుల రాజమల్లు, రొడ్డ రాజేందర్, రూప, ముంతాజ్, పద్మతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.