విద్యానగర్, ఆగస్టు 7: సర్కారు దవాఖానల్లో ఓపీ సేవలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గంటల తరబడి క్యూలో నిలబడి వేసిచూసే బాధలకు పెట్టేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) యాప్‌ను తీసుకొచ్చింది. ఆయా దవాఖానల్లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి టోకెన్ నంబర్లు పొందే వెసులుబాటు కల్పించగా, కరీంనగర్ జీజీహెచ్ల్లోనూ అమల్లోకి వచ్చింది. అలాగే రోగి హెల్త్ ప్రొఫైల్‌ను పొందుపరిచేందుకు డిజిటల్ హెల్త్ ఐడీకి శ్రీకారం చుట్టింది. రోగి వివరాలు, చికిత్స, తదితర వివరాలన్నీ తెలిసేలా అభా ద్వారా ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తూ 14 అంకెల యూనిక్ నంబర్ కేటాయి స్తున్నది. దీని ద్వారా వైద్య చీటీలన్నీ డిజిటైజేషన్ అవుతుంది. రోగి దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఒక క్లిక్‌తో వైద్యులు వాటి వివరాలు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతుంది. అలాగే డిజిటల్ రికార్డుల ద్వారా కచ్చితమైన బిల్లింగ్, బిల్లుల రీయింబర్స్మెంట్, ఆరోగ్య పాలసీ క్లెయిమ్‌లు సులభతరమవుతాయని కరీంనగర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి తెలిపారు.
అభా యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, తదితర వివరాలన్నీ నమోదు చేయాలి. ఆ తర్వాత సొంత ఐడీ,-పాస్‌వర్డ్‌ను తయారు చేసుకొని యాప్‌లోకి లాగిన్ కావాలి. https://abdm.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి కూడా అభా నంబర్ పొందవచ్చు. ఆయా ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను సాన్ చేస్తే టోకెన్ నంబర్ వస్తుంది. ఆపై కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబర్ చూపిస్తే అనారోగ్య కారణాలు తెలుసుకొని సంబంధిత విభాగానికి రెఫర్ చేస్తూ ఓపీ చిటీ అందిస్తారు.