కరీంనగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రొహిబిటెడ్ ఏరియాలోని స్థలాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాల మేరకు యంత్రాంగం రంగంలోకి దిగి, నిలిపివేసింది. గ్రామంలో 300కుపైగా సర్వే నంబర్లు ఉండగా, దాదాపు 240 నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. నిషేధిత జాబితా తయారీలో నిమగ్నం కాగా, కొనుగోలుదారులు, స్థానిక ప్రజల్లో కలవరం మొదలైంది. లిస్టులో ఏయే సర్వే నంబర్లు ఉన్నాయి? వాటిలో తాము కొన్న భూములు ఉన్నాయా..? ఉంటే ఏం చేయాలి? అని ఆందోళన వ్యక్తమవుతుండగా, సదరు నంబర్లపై స్పష్టత వచ్చే వరకు రిజిస్ట్రేషన్లను జరుగవని, అన్నీ సవ్యంగా ఉన్న నంబర్లలో మాత్రం చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతున్నది.
గంగాధర, జూన్ 27: కొత్తపల్లి మండలంలోని రేకుర్తి రెవెన్యూ గ్రామం కరీంనగర్ సిటీని అనుకొనే ఉంటుంది. కాలక్రమేణా నగరంలో విలీనం కావడం, సిటీ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొన్నేండ్లుగా ఈ ప్రాంతంలో వెంచర్లు, లే అవుట్లు ఎన్నో రాగా, జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేశారు. ఈ రెవెన్యూ గ్రామంలో 300కు పైగా సర్వే నంబర్లు ఉండగా, అందులో పలు సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరుపడం, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉండగా, వీటిపై కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే తాజాగా రేకుర్తి భూముల వ్యవహారంపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నిషేధిత సర్వేనంబర్ల జాబితా తయారు చేయాలని, అప్పటిదాకా రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో నిషేధిత భూముల సర్వే నంబన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు సుమారు 240 సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు సబ్ రిజిస్ట్రార్ అబ్జల్నూర్ ఖాన్ తెలిపారు.
నెల రోజుల కింద కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 175, 197,198లలోని సీలింగ్ భూముల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారంటూ ఏకంగా 476 ప్లాట్లు, స్థలాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేయడం రాష్ట్రంలోనే సంచలనం రేపింది. రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసింది. బాధితులు హైకోర్టు మెట్లెక్కారు. ఇటు కొత్తపల్లి భూముల రిజిస్ట్రేషన్ల రద్దు వేడి తగ్గకముందే, రేకుర్తి భూముల్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం కాక రేపుతున్నది. సుమారు 240 సర్వే నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం, నిషేధిత జాబితా తయారు చేస్తుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొన్న వినియోగదారులు కలవరపడుతున్నారు. నిషేధిత జాబితా సర్వే నంబర్లు ఎన్ని? వాటిలో తాము కొన్న భూములు ఉన్నాయా..? ఉంటే ఏం చేయాలి? అని ఆందోళన చెందుతున్నారు. మరో వారంలో నిషేధిత సర్వే నంబర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉండగా, టెన్షన్ పడుతున్నారు.
రేకుర్తి భూముల వ్యవహారంపై ఇటీవల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశాం. రెవెన్యూ అధికారులు ప్రొహిబిటెడ్ భూముల జాబితాను తయారు చేస్తున్నారు. వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిషేధిత జాబితాలో లేని ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లు చేస్తాం. గ్రామాల్లో ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయాలంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి నివేదిక తప్పనిసరి. ఆయన సర్టిఫై చేసిన వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాం. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లో డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తాం. కుటుంబ సభ్యులు అంగీకారంతో భూముల మ్యుటేషన్ చేస్తాం.
– అబ్జల్ నూర్ఖాన్, గంగాధర సబ్ రిజిస్ట్రార్
నిషేధిత జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేయిస్తాం. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలి. కలెక్టర్ కార్యాలయం నుంచి పంపించిన ప్రతి నిషేధిత జాబితా సర్వే నంబర్లను క్రోడీకరించి సమగ్ర జాబితా సిద్ధం చేసుకోవాలి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ వేగవంతం పూర్తి చేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో విచారించిన తర్వాతే గ్రామాల్లో ఇండ్లు, భూములను మ్యుటేషన్ చేయాలి. ఉన్న స్థలం కంటే ఎకువగా రిజిస్ట్రేషన్ చేయడం, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తప్పవు. గిఫ్ట్ మ్యుటేషన్ చేసినప్పుడు కుటుంబ సభ్యుల అందరి సమ్మతి తీసుకోవాలి. ముఖ్యంగా కరీంనగర్ చుట్టుపకల ఉన్న గ్రామాల పరిధిలో రిజిస్ట్రేషన్లపై జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. పంచాయతీ సెక్రటరీలు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు కేటాయిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు.
– పమేలా సత్పతి, కరీంనగర్ కలెక్టర్