Siricilla | కలెక్టరేట్, జూలై 9 : భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ తొలి దశలో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే చేపట్టి ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయిస్తామని తెలిపారు.
డీజీపీఎస్, జీఐఎస్ వంటి సాంకేతికతను వినియోగించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ జిల్లాలో కొత్త రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం స్థలాలు గుర్తించి, రీ సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, సర్వే ఏడీ శ్రీనివాస్, సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.