కలెక్టరేట్, మార్చి 26 : రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న పాలకులు, తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లటంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తున్నా, నిర్దేశించిన గడువు లోపల లబ్ధిదారులకు అందటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, నిధులు మురిగిపోతుండగా సర్కారు పథకాలు సక్రమంగా అమలుకాక అందని ద్రాక్షలుగా మారుతున్నాయనే ఆరోపణల వెల్లువ కొనసాగుతుంది. దీనికితోడు పథకాల అమలుకు విధిస్తున్న నిబంధనలు కూడా మోకాలడ్డుతుండటంతో లబ్ధిదారులు లబ్దిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో, ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలవుతున్న పశువుల పాక (క్యాటిల్ షెడ్లు) నిర్మాణాలు జిల్లాలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి.
పథకం పాతదే అయినా, దీనిపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండగా, షెడ్ల నిర్మాణంపై రైతులకు సమాచారమిచ్చే వారే కరువయ్యారనే ఆవేదన వ్యక్తమవుతున్నది. అవగాహనరాహిత్యంతో దరఖాస్తులే చాలా తక్కువగా వస్తున్నాయనుకుంటే అందులో పనులు ప్రారంభిస్తున్నవి, పూర్తవుతున్నవి తక్కువేనని అధికారులు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంబంధిత శాఖకు కేటాయించిన లక్ష్య సాధనలో ముందుకెళ్లే దిశగా అధికార యంత్రాంగ ప్రయత్నాలు నామమాత్రమే అన్నట్లుగా సాగుతున్నదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు వస్తున్నా పశువుల కొట్టాల నిర్మాణాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనపడక పోవటం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని రైతులు మండిపడుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 742 పశువుల పాకలు మంజూరు కాగా, కేవలం 314 మాత్రమే పూర్తి అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా పూర్తి కాకపోవటం సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ పర్యవేక్షణ ఈమేరకు కొనసాగుతుందో స్పష్టమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై డీఆర్డీవో శ్రీధర్ మాట్లాడుతూ.. రైతులకు, పశుపోషకులకు ప్రోత్సాహకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రత్యేక కార్యాచరణతో చేపడుతున్నామన్నారు. తమ సిబ్బంది ద్వారా గ్రామాల్లో వీటిని నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఆలస్యమైన లక్ష్యం చేరుకుంటామని పేర్కొన్నారు.