ధర్మపురి, మార్చ్ 25: హరిహర క్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాలకు గ్రహణం పట్టినట్లు అయింది. ఆలయంలో పండితులు, అర్చకులు దేవస్థాన సిబ్బంది ఉన్నప్పటికీ వారం రోజులుగా నవ గ్రహాల మండపంలో పరిశుభ్రత పనులు చేపట్టడం లేదు. ఈ మండపంలో నిత్యం భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి, శనీశ్వరునికి నువ్వుల నూనె సమర్పించి శని గ్రహ దోషాలు తొలగాలని కోరుకుంటారు.
ప్రదక్షణలు చేసి భక్తిని చాటుకుంటారు. మండపంలో శుభ్రత లేకపోవడం వల్ల భక్తులు సమర్పించిన నువ్వుల నూనె మండపంలో అలాగే ఉండడంతో ప్రదక్షిణలు చేసే భక్తులు జారిపడే ప్రమాదం ఉంది. వారం రోజులుగా నవగ్రహాల మండపంలో పరిశుభ్రత పనులు చేపట్టడం లేదని, దీనివల్ల దుర్గంధం వెదజల్లుతోందని భక్తులు వాపోయారు. ఆలయంలోని నవగ్రహాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. కానీ ఆలయ సిబ్బంది తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేటట్లుగా మారింది.