Donald Trump : కెనడా (Canada) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అమెరికా నుంచి పొందిన అన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా తిరిగి తమకు మూల్యం చెల్లించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ నుంచి పొందిన వాటికి పూర్తి పరిహారం చెల్లించేవరకు కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ (Ontario Province) ను అమెరికాలోని మిచిగాన్ (Michigan) తో కలిపే గోర్డీ హోవే (Gordie Howe) అంతర్జాతీయ వంతెన (International Bridge) ను బ్లాక్ చేస్తామని బెదిరించారు.
2014 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలివి తక్కువగా ఆలోచించి ఈ వంతెన నిర్మాణానికి కావల్సిన మినహాయింపులు ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులో సగమైనా అమెరికాకు చెల్లించాలని, లేదా వంతెనపై ఇరుదేశాలకు సమాన యాజమాన్య హక్కులు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కెనడాకు సూచించారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇరుదేశాల మధ్య ఇటీవల తలెత్తిన విభేదాల గురించి ట్రంప్ మాట్లాడారు.
ఎన్నో ఏళ్లుగా తమ దేశం నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి కెనడా వసూలు చేస్తున్న సుంకాలు ఆమోదయోగ్యమైన రీతిలో లేవని ట్రంప్ మండిపడ్డారు. అమెరికాను కాదని చైనాతో వ్యాపారం చేసేందుకు ఆ దేశం మొగ్గు చూపడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనికి వారు మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. వంతెన ప్రాజెక్టుకు సంబంధించిన వెబ్సైట్ ప్రకారం.. డెట్రాయిట్ నదిపై ఏర్పాటుచేసిన గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెనను కెనడియన్ ప్రభుత్వానికి చెందిన విండ్సర్-డెట్రాయిట్ బ్రిడ్జ్ అథారిటీ అనే సంస్థ నిర్మించింది.
దీనికి అక్కడి ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఈ ఏడాదిలో దీనిని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు చేయడం గమనార్హం. అయితే ట్రంప్ ప్రకటనపై కెనడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.