EGS TA | ఓదెల: మే 30 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎస్సారెస్పీ డి 86 కాలువలో పూడికతీత పనులు జరుగుతుండగా ఆ వర్కు ఐడీని తమకు కేటాయించి అదే వర్క్ ఐడీని జీలకుంట గ్రామానికి కూడా కేటాయించారు.
దీంతో రెండు గ్రామాల కూలీలైన తమకు గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై టీఏ జనార్ధన్ ను తాము ప్రశ్నించగా తమపై దురుసుగా ప్రవర్తించినట్లు కూలీలు ఆరోపించారు. టీఏ తీరును నిరసిస్తూ ఓదెల మండల పరిషత్ కార్యాలయం వరకు కాలినడకన వచ్చి ధర్నాకు దిగారు. అనంతరం ఎంపీడీవో తిరుపతికి ఫిర్యాదు చేశారు. కూలీలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న టీఏ జనార్దన్ పై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.