కరీంనగర్ కలెక్టరేట్, జూలై 10: కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు, పారిశుధ్య, ఇతర రంగాల కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాలుగు లేబర్ కోడ్లు, బొగ్గు బ్లాకుల వేలంతోపాటు ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు 26వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో చర్చించాలని కోరుతుంటే.. ఏడు నెలలుగా సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం కూడా కేంద్రంలోని బీజేపీని అనుసరిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాయమల్లు, నాయకులు కవ్వంపల్లి రవి, పున్నం రవి, ఆశ వర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సరిత, సరోజ, సదాలక్ష్మి, ప్రభాకర్, అంజయ్య పాల్గొన్నారు.