KTR photo | సిరిసిల్ల రూరల్, జూలై 21: సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు. కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫొటో కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్కసుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ను అవమానించేలా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ఫొటో లేకుండానే నిర్వహించడం కొంతకాలంగా పరిపాటిగా మారింది.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కేటీఆర్ ఫోటో లేకుండానే, కనీసం సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు అధికారుల తీరు, కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు పోటాపోటీగా ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతల ను బీఆర్ఎస్ నేతలు తిప్పి కొట్టారు. ఈ క్రమంలో లాటి చార్జి జరగగా బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. ఇది సిరిసిల్ల నియోజకవర్గంలో ఉధృక్తిత నెలకొనగా, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజులుగా స్పద్దతగా ఉండగా ఇటీవల తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో లేకుండానే, జిల్లెళ్ళ లో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పేరిట పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై కూడా ప్రొటోకాల్ ఉల్లంఘించారని, ప్రొటో కాల్ లేని వ్యక్తితో ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇలా వరుస ఆందోళన లు, అధికారుల తీరుపై ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు కలెక్టర్ తో పాటు ప్రభుత్వాన్ని. ప్రశ్నించారు. దీంతో అధికార యంత్రాంగం పెట్టకేలకు దిగివచ్చినట్లు కనిపించింది. సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో ని జిల్లా రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార ఫొటోలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నానిర్వహణ మాత్రం ప్రొటో కాల్ లేని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేషన్ కార్డులనీ సైతం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం పై మరోసారి చర్చనీయాంశంగా మారింది.