వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్‌ట్రాక్‌లు, బోటింగ్, గ్రీనరీ, 40 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏర్పాటుతో భక్తులకు మరింత ఆహ్లాదం పంచుతూ వేములవాడ రాజన్న గుడి చెరువు కట్టపై బండ్‌పార్క్ అందుబాటులోకి రానున్నది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.12కోట్లతో నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త జాప్యం జరిగింది. కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రత్యేక చొరవతో పనులు వేగవంతమై పూర్తయ్యాయి. నేడు మంత్రులు బండ్‌పార్క్ ప్రారంభించనుండగా, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వేములవాడ, జూలై 29 : వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదం పంచేందుకు నాడు బీఆర్ఎస్ సర్కారు రూ.12కోట్ల నిధులు విడుదల చేస్తూ వీటీడీఏ ద్వారా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు పూర్తి చేసింది. ఆలయానికి అనుకొని ఉన్న గుడిచెరువు బండ్ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. 2023లో అప్పటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో జాప్యం జరిగింది.
తర్వాత కలెక్టర్ గరిమా అగ్రవాల్ చొరవతో పనులు వేగవంతం కాగా, గుడిచెరువు బండ్‌పై 150 అడుగుల వెడల్పుతో కట్ట నిర్మాణం చేపట్టారు. అందులో 700మీటర్ల పొడవులో బండ్ పార్ను సుందరీకరించారు. అందులో గ్రీనరీ, చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వాటర్ఫౌంటెన్లు, పాదచారులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు. గుడి చెరువులో భారీ ఐలాండ్ ఏర్పాటు చేసి 40 అడుగుల భారీ శివుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురువారం బండ్ పార్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించనున్నారు. దీంతో రాజన్న భక్తులు, వేములవాడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.