విద్యతో వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని గుర్తుపెట్టుకోవాలి. తరగతి గది నాలుగు గోడలు భారత దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలు. పిల్లలకు విద్యనే కాకుండా పరస్పర జీవనాన్ని నేర్పించాలి. కులం, మతం గబ్బు అంటకుండా ఒకరినొకరు గౌరవించుకునేలా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. ఒక్క తరం చదువుకుని బాగుపడితే ఆటోమెటిక్‌గా వారు వెనక్కి తిరిగి చూడకుండా డెవలప్ అవుతారు. నేను పెట్టుబడుల కోసం అమెరికా, లండన్ వెళ్లినప్పుడు ఇక్కడి యువతీయువకులు కలుస్తుంటారు. వారు అలా ఎదిగే అవకాశం ఇచ్చిన సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను అభినందించాల్సిందే.
ఎల్లారెడ్డిపేట, జూన్ 20 : నాలుగు గోడల తరగతి ఒక గది కాదు.. అది విజ్ఞానపు గని అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆధునిక పాఠశాలల సముదాయ ప్రాంగణాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట పాఠశాల భవనాన్ని చూస్తే మళ్లీ చదువుకోవాలనిపించేంత అందంగా ఉన్నదని, ఏజ్‌బార్ కావడం వల్ల చదువుకునే అదృష్టం లేకుండా పోయిందని తెలిపారు. ఇంత అందంగా నిర్మించినందుకు కలెక్టర్ అనురాగ్‌జయంతి, గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి సాకేంత్రావును సహకరించిన మెగా ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు. నవమాసాలు మోసిన తల్లి బాధ ఎంత అనుభవిస్తుందో ఆ తల్లికే తెలుసని, ఏడాదిపైగా అలాంటి బాధను అనుభవించిన కూలీలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా వెళ్లినప్పుడు నియోజకవర్గంలో పలు శుభకార్యాలు జరిగాయని, వచ్చిన తర్వాత సదరు కుటుంబాల్లో పెళ్లయిన జంటలను కలిసేందుకు వెళ్తే వారు ఒక్కొక్కరు ఒక్కో కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషమనిపించందని గుర్తు చేశారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి, అక్కడే చదువుకుని ఎలాంటి పైరవీలు లేకుండా పోటీపడే సంస్థల్లో పనిచేస్తున్నట్లు చెబుతుంటే కడుపునిండినట్లయిందని చెప్పారు. వ్యవస్థలో ఎప్పటికీ లోపాలుంటాయని, అమెరికాలో సైతం పేదరికం ఉంటుందని, చంద్రుని మీద మచ్చలు వెతకాలంటే ఎప్పటికీ ఉంటాయని, కానీ ఉన్నంతలో ఏమేం బాగయినయో చూడాలన్నారు.
గతానికి, ఇప్పటికి తేడా చూడండి
గతంలో ఎల్లారెడ్డిపేట బడి ఎట్లా ఉండేదో.. ఇప్పుడెట్లయిందో తెలుసుకునేందుకు ఫొటోలు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్కపేట ట్రయల్ రన్ పూర్తయిందని, మరో పదిహేను రోజుల్లో సింగసముద్రం నిండుతదని అంటే సంతోషంగా ఉందని చెప్పారు. మొత్తం భూతల స్వర్గమైందని తాను చెప్పడం లేదని, తొమ్మిదేండ్ల కింద ‘మా తండాలో మా రాజ్యం’ కావాలని గిరిజనులు పోరాడితే అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక 3416 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు చెప్పారు. నాడు ఎస్సీ సోదరుల సంక్షేమం కోసం దళితబంధు వంటి పథకాలు, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్ల కింద ఎరువులు దొరికే పరిస్థితి ఉండేదా?, కాంటవెట్టి ఊరూరికి వడ్లు కొన్న పరిస్థితి ఉందా? ఆలోచన చేయాలని, ఆగం కావద్దని సూచించారు. డిగ్రీ కాలేజీ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు బరాబర్ వస్తదని, అది ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతోటి ఇస్తం గానీ, ఎవరో డిమాండ్ చేశారని, వారి కోసం చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎక్కడ ఏ సంస్థ కావాలో అధికారులతో ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఏర్పాటు చేస్తామన్నారు. తాను వచ్చినప్పుడు చదువు రాని, జ్ఞానం లేని ఇద్దరు, ముగ్గురు యువకులను రెచ్చగొట్టి కారుకు అడ్డం పంపిస్తున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే కాలేజీలు, పరిశ్రమలు పట్టుకురా?
కేంద్రంలో ఉన్నోళ్లు, ఎంపీ బండి సంజయ్ విద్య కోసం అరపైసా సాయం చేసిండా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క నవోదయ, కస్తూర్బా కాలేజీ తెప్పించగలిగాడా? అని నిలదీశారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు తేరని, ఇంజినీరింగ్ కాలేజీలియ్యరని మండిపడ్డారు. పైకి ఇంకా సిగ్గులేకుండా పెద్ద మాటలు మాట్లాడుతున్నరని తూర్పారబట్టారు. తమ హయాంలో ఇన్ని పనులు చేశామని, తమకంటే ముందు 50 ఏండ్లు పాలించినోళ్లు ఏంచేసిన్రో చూడాలన్నారు. వాళ్లు బడి, గుడి బాగుజెయ్యలేదని, అప్పర్‌మానేర్, సింగసము ద్రం నింపలేదని, కానీ ఇప్పుడు వచ్చి ఉపన్యాసం చెప్పడమేంటని దుయ్యబట్టారు. ధర్నా కట్టుడు, డ్రామా కొట్టుడు కాదని, ఎంపీ సంజయ్‌కు ద మ్ముంటే ఢిల్లీల పతార, పలుకుబడి ఉంటే రెండు కాలేజీలు, పరిశ్రమలు పట్టుకురావాలని, సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్లూమ్ క్లస్టర్, ట్రిపుల్ ఐటీ తీసుకు వచ్చి విద్య లో పోటీ పడాలని సవాల్ విసిరారు. తమకంటే పెద్ద ప్రభుత్వం అనుకుంటే తాము ఎల్లారెడ్డిపేటలో కట్టిన బడికంటే మంచి బడి కట్టి చూపించాలని హితవుపలికారు.
ప్రజలు కోరుకున్నన్నాళ్లు ఇక్కడే ఉంటా?
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం తనకు రాదని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను నమ్ముకుని వచ్చినోడినని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల దయ ఉంటే మందు, మద్యం లేకుండా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి సేవలందిస్తానని ధీమాగా చెప్పారు. తనకు ప్రజల మీద అచంచల విశ్వాసం ఉన్నదని, ఇంతకు ముందు పనిచేశానని, మళ్లీ పనిచేస్తాననే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్నన్నాళ్లు సిరిసిల్లలోనే ఉంటానన్నారు. జిల్లాలోని 500 పాఠశాలల్లో 12 రకాల వసతులతో సుందరమైన పాఠశాలలను నిర్మించబోతున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.7300 కోట్లతో మొదటి దశలో పనులు పూర్తవుతున్నాయని, ఆగస్టులో మొత్తం పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం రాష్ట్రంలో తొమ్మిది వేల పాఠశాల పనులు చేపడతామని చెప్పారు. మూడు దశల్లో రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను ఆధునికీకరిస్తామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అంశాలు లేక పనికిమాలిన రెండుమూడు ముచ్చట్లతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యతో పాటు జీవనాన్ని నేర్పించాలి
విద్యార్థులకు విద్యతో పాటు జీవనాన్ని నేర్పించాలని మంత్రి సూచించారు. టీచర్లకు ఏదైనా కావాలనుకుంటే సూచన చేయాలని, ఇందుకోసం టీచర్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుందామన్నారు. విద్యా ప్రగతి ఎలా జరిగింది, భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలి అనేది సూచించాలని కోరారు. జిల్లాలో 2014లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 53శాతం మాత్రమే చదివితే ప్రస్తుతం 72 శాతానికి పెరగడం సంతోషంగా ఉందని, అందరం కలిసి సర్కారు బడిలో నాణ్యత పెరిగేలా చూద్దామన్నారు. ఒక వేల పాఠశాలల్లో టీచర్లు లేకపోతే నియమించేందకు అవసరమైన డబ్బులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట పాఠశాల భవనాన్ని ఇంత అందంగా నిర్మించామని, అంతే పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులదేనని, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాఠశాలల్లో జరిగితే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
కంప్యూటర్ చాంప్‌పై ప్రశంస
కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో కంప్యూటర్ చాంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మంత్రి ప్రశంసించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ శిక్షణ అందించేలా కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 60 పాఠశాలల్లో కంప్యూటర్ చాంప్స్ను ప్రారంభించామన్నారు. జిల్లాలో 12 వేల మంది పిల్లల కోసం ఏడాది పొడవునా శిక్షణ అందించేలా కార్యక్రమాన్ని తీసుకున్నామని, ఇందులో భాగంగా జేఎన్టీయూ అధికారులతో ఉపాధ్యాయులకు సైతం శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్పాయింట్పై శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో విజయవంతమైతే దాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. ప్రతి పాఠశాలను టీ ఫైబర్‌తో అనుసంధానం చేయబోతున్నామని, రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలకు ఫైబర్ గ్రిడ్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు ఇవ్వబోతున్నామని తెలిపారు. తద్వారా ఎక్కడ అత్యుత్తమ పా ఠాలు ఉంటే వాటిని చూసుకోవచ్చునని సూచించారు. జిల్లాలో గతేడాది తన బర్త్‌డే సందర్భంగా రూ.85 వేల విలువైన బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్ ను నీట్, ఐఐటీలో ర్యాంకులు రావాలనే ఉద్దేశంతో ఇచ్చామన్నారు. రేపటి రోజున విద్య విషయంలోనూ జిల్లా ఆదర్శంగా ఉండేలా చూడాలనే తాపత్రయంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
సెల్ఫ్ డిఫెన్స్‌పై ఎస్పీకి సూచన
అక్కడక్కడ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని వార్తలు వస్తున్నాయని, ఇందుకోసం సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇవ్వడం ఒక మంచి కార్యక్రమమని మంత్రి తెలిపారు. వారికి ఏదైనా ఆపద వస్తే ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడకుండా తమను తాము రక్షించుకునేలా శిక్షణ అందించేలా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందించే ట్రెయినర్లను పెట్టుకుందామని, ఇందులోనూ సిరిసిల్ల నెంబర్ వన్‌గా ఉండేలా చూద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుమార్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, డీఈవో ఏ రమేశ్‌కుమార్, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టీఎన్జీవో స్ జిల్లా అధ్యక్షుడు ఎల్సాని ప్రవీణ్, సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎన్గందుల అనసూయ, పందిల్ల నాగరాణి, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ జయంత్‌కుమార్ ఉన్నారు.
హ్యాపీనెస్ కరికులం, కాంపాసినేట్పై శిక్షణ
విద్యార్థులు నెగెటివ్‌గా, నిరాశ, నిస్పృహలతో చెడుగా ఆలోచించకుండా సంతోషంగా చాకచక్యంగా, తెలివిగా ముందుకు ఎలా వెళ్లాలో తెలిపేలా పాఠ్యపుస్తకాల్లో హ్యాపినెస్ కరికులం పాఠ్యాంశాలుండేటట్లు ప్రయత్నిస్తున్నాం. కాంపాసెనేట్ సిటిజన్‌షిప్ ప్రోగ్రాం అనేది కూడా కరికులంలో ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తోటి మనిషితో ఎలా ఉండాలి, ఏ విధంగా గౌరవమివ్వాలి? అనేది అంశంగా ఉంటుంది. ఇంట్లో వృద్ధులతో పిల్లలు ఎలా ఉండాలో కూడా కాంపాసెనేట్ సిటిజన్ షిప్ ప్రోగ్రాంలో ఉంటుంది. బడి నుంచి వచ్చిన తర్వాత తాత, అమ్మతో ఐదు నిమిషాలు ఉంటే వృద్ధుల్లో సంతోషం ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమం ఇది. మానవ సంబంధాలు ఉండేలా, కుల, మత బేధాలు లేకుండా మనిషి, మనిషితో సంతోషంగా ఎలా బతకవచ్చు.. వంటి అంశాలు ఉంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతను అనుసరించి చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. పేదరికాన్ని నిర్మూలించేందుకు అన్ని సమస్యలు పరిష్కరించుంటున్నాం. ఇక నుంచి మన ప్రాధాన్యత విద్యపై ఉండాలని మంత్రి కేటీఆర్ నాకు చెప్పారు. జిల్లా కేంద్రానికి ఎన్ని విద్యా సంస్థలు వచ్చాయో అందరికీ తెలుసు. విద్యాభివృద్ధిపై చాలా విషయాలు చర్చించాం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు నింపుతున్నాం. ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు నింపాం. వారు రిటైర్ అయ్యే వరకు 20 ఏండ్లు పడుతుంది కాబట్టి విద్యార్థులను బిజినెస్ బ్లాస్టర్లుగా, భవిష్యత్తులో తమ కాళ్లపై తాము నిలబడేలా తయారు చేయాలనే తపనతో మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారు.
– బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
విద్యతో అన్ని వర్గాల్లో చైతన్యం
అన్ని వర్గాల్లో రాజకీయంగా, సామాజికంగా చైతన్యం రావాలంటే విద్యతోనే సాధ్యం. వెనుకబడిన కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చ దువుతున్నారు. ఇంత మంచి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించగలిగితే అనుకున్న గమ్యాన్ని చేరుతాం. ఎల్లారెడ్డిపేట బడిని చూసి నేను ఆశ్చర్యపోయా. ప్రభుత్వ పాఠశాలలకు రూ.8.50 కోట్లు కేటాయించడం సంతోషకరం. పేదల విద్యకు ప్రాధాన్యతనివ్వడం బాగుంది. జిల్లాకు 22 కళాశాలలు తీసుకురావడం ఎంతో కృషితో కూడుకున్నది. చదువుతోనే సమసమాజం సా ధ్యమవుతుందని అంబేద్కర్ అన్నట్లు మంత్రి కేటీఆర్ దేవుడిలా కృషి చేస్తున్నారు. దేశంలోనే అధిక మెజార్టీ వచ్చేలా చూసే బాధ్యత అందరిపై ఉన్నది. అందుకు నావంతు బాధ్యత కూడా తీసుకుంటా.
– కూర రఘోత్తంరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర ఉండడం గర్వకారణం
నేను 1995లో ప్రభుత్వ ఉపాధాయుడిగా పని చేసినప్పుడు పాఠశాలలో ఒకటే తరగతి గది ఉండేది. అందులోనే ఐదు తరగతుల విద్యార్థులు ఉండే పరిస్థితి. వారందరికీ నేనొక్కడినే టీచర్ని. ఆనాడు మూడో తరగతి పాఠ్యపుస్తాకాలపై ఆంధ్ర కేసరి టంగుటూరి అని, ఆయన ఫొటో, ఆయన ఆంగ్లేయులను ఎదురించిన వీరుడు అని పొగుడుతూ ఆయన గురించే ఉంది. ఆనాడు తెలంగాణలో ఉండే చదువులు మనవికావు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన ఎందరో అమరులున్నా వాళ్ల గురించి ఉండేది కాదు. అలాగే, ఆంధ్రా ఊర్ల గురించి ఉండేది. కానీ, నేడు మన పోరాట వీరుల గురించి, నాలుగో తరగతిలో తెలంగాణ పోరాటం గురించి, మనవాళ్ల ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
పోరాట ఆకాంక్షలు నెరవేరుతున్నయ్
ఏ ఉద్దేశం కోసం తెలంగాణ రావాలని పోరాటం చేశామో ఆ ఆకాంక్షలు నెరవేరుతున్నయ్. పాలకుడు మనవాడైతే పాలన ఎలా ఉంటుందనేదని కళ్లముందు సాక్షాత్కరిస్తున్నది. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన సమాజం కోసం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తున్నది. సమాజంలో అన్ని వర్గాల గురించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. విద్య గురించి సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచించి ప్రాధాన్యతనిస్తున్నారు.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
రామన్న కృషికి మనం తోడవుదాం
నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి రామన్న కృషికి మనమూ తోడవుదాం. చిన్నచిన్న పనుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు చెప్పులరిగేలా తిరిగిన రోజులను మరిచిపోలేం. ఒక శాసన సభ్యుడు ఎలా పనిచేయవచ్చునో చేసి చూపించిన నాయకుడు మంత్రి కేటీఆర్. రామన్న ఆధ్వర్యంలో జిల్లాలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక్క ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రూ.200 కోట్ల పనులు చేసుకోగలిగాం.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు