నాటి ఉద్యమనేత కేసీఆర్ ప్రాణత్యాగానికి తెగించిన రోజు.. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29.. చరిత్రలో అజరామరంగా నిలిచిన ఈ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. మళ్లీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈనెల 29న దీక్షా దివస్‌ను అన్ని జిల్లాకేంద్రాల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. విజయవంతం కోసం నేడు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు 2009 నవంబర్ 29. ఈ శుక్రవారానికి సరిగ్గా పదిహేనేండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఆ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని కేసీఆర్ భవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరగా, కరీంనగర్ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత నిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. ఆరోగ్యం క్షీణించినా.. ప్రాణంపోయినా సరే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించితీరుతానని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణను ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించారు. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే ఆయన దీక్షను విరమించారు. తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిన ఆ రోజు చరిత్రలో అజరామరంగా నిలిచిపోగా, బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నది. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్చార్జులుగా నియమించింది.
విజయవంతం కోసం ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, 27, 28 తేదీల్లో ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఆనాటి ఉద్యమన్ని గుర్తు చేసుకుంటూ, నాడు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ, ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా దీక్షా దివస్‌ను చేపడుతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే, ఈ కార్యక్రమ విజయవంతానికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునివ్వగా, నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సిరిసిల్ల బైపాస్‌రోడ్డులోని తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి కేటీఆర్ హాజరై, దీక్షా దివస్‌పై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఒక ప్రకటనలో కోరారు.
దీక్షాదివస్ జిల్లాల ఇన్చార్జులు
కరీంనగర్ బండా ప్రకాశ్‌ముదిరాజ్, ఎమ్మెల్సీ
సిరిసిల్ల్ల బీ వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
జగిత్యాల ఎండీ సలీం, మాజీ ఎమ్మెల్సీ