రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ: కాంగ్రెస్‌కు ఓటేస్తే హామీల వైఫల్యానికి మద్దతిచ్చినట్టే అవుతుందని, బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్టే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోనిది తప్పయితదని, రెండో సారి కూడా మోసపోతే ఓట్లేసిన మనదే తప్పవుతుందని, ఈ ఎన్నికల్లో రెండో సారి మోసపోవద్దని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నేతన్నలను అవమానపరిచి, బతుకు మీద కొట్టిన కాంగ్రెస్‌కు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలని సూచించారు. మీకు నేనున్నానని, ఆ పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని భరోసానిచ్చారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి మీ కళ్లముందు ఉన్నదని, ఢిల్లీ పార్టీలకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీరు వేసే ఓటుతో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన వేములవాడ, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయాచోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్లలో రూపాయి పని కూడా చేయలేదని, ఆ పాలన ఉన్నన్నాళ్లూ ప్రజలకు కన్నీళ్లు తప్పవని మండిపడ్డారు. ఆ పార్టీని ఇప్పుడే అడ్డుకోకపోతే మరింత రెచ్చిపోయి ప్రజలను మరింత పీడిస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ తన మొండి వైఖరిని వీడాలంటే ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి, కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని, ఆ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు కులమతాల పేరిట ఓట్లు వేయించుకొని, ఒట్టు పెట్టించుకుని పదవులు పొంది మాయమవుతుందన్నారు. ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఆది నుంచీ అండగా ఉన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తు చేశారు. మెట్ట ప్రాంతమైన వేములవాడ తలాపున మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంత రైతులకు సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించిన భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచించి నీరందిస్తే.. ఈ రోజు సరిగ్గా అందించలేని అసమర్థ పాలన ఉందని విమర్శించారు. అనేక నిధులు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు జీవం పోశారని, నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఉద్యమ సమయంలో ఆడబిడ్డలు బీడీలు చేసి అనారోగ్యం బారిన పడడాన్ని చూసి కేసీఆర్ చలించిపోయారని, స్వరాష్ట్రంలో బీడీ కార్మికులు అడగకుండానే రెండు వేల రూపాయల పెన్షన్ అందించాడని చెప్పారు. రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసిన ఏకైక నాయకుడు కేసీఆరేనని ప్రశంసించారు.
వేములవాడ పురపాలక సంఘాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వందల కోట్లతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ, గడిచిన ఇరువై ఆరు నెలలో ఆది శ్రీనివాస్ ఒక రూపాయన్నా తెచ్చాడా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన రాజన్న సాక్షిగా వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై రాసిచ్చి, ప్రమాణం చేసిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. గెలిచిన తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని ప్రమాణం చేసి మరిచిపోయాడని విమర్శించారు. నాలుగుసార్లు ఓడిపోయానని ఏడ్చి, తుడ్చి చచ్చిపోతానంటే.. ప్రజలు ఒకసారి అవకాశమిచ్చినందుకు ఇప్పుడు అందరినీ ఏడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెబుతున్నారని, ఓట్ల కోసం వచ్చే నాయకులను హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసోళ్లు ఢిల్లీకి సంచులు మోస్తారని, బీజేపోడు ఢిల్లీకి చెప్పులు మోస్తాడని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయాచోట్ల ప్రచారాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పన్నెండేళ్లుగా కేంద్రం అధికారంలో ఉన్నా రాజన్న ఆలయానికి గానీ, వేములవాడ పట్టణానికి ఒక రూపాయి అయినా ఇవ్వలేదు? కరీంనగర్ పార్లమెంట్ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిందేమీ లేదు. ఈ ప్రాంత ఎంపీగా ఆయన వేములవాడకు ఒక్క రూపాయి తెచ్చింది లేదు. సిరిసిల్ల నేతన్నలు ఎంతో కాలంగా కోరుతున్న మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకువచ్చే శక్తి లేదు. బీజేపీ మాటలు చెప్పడమే కానీ, చేసేది ఉండదు. మరోసారి ఆ దొంగ మాటలకు మోసపోవద్దు. పేదోళ్ల కడుపులు నింపి తండ్రి లెక చూసుకొని తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని బీఆర్ఎస్కి ఓటు వేయాలి.
– కేటీఆర్