రాజన్న సిరిసిల్ల, మే 4 (నమస్తే తెలంగాణ): “రాష్ట్రంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేస్తలేరు. అందరూ ఒకటే ‘దోచుకో.. దాచుకో’ అనే పని మాత్రమే పెట్టుకున్నరు. హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి దోచుకుంటున్నడు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడోళ్లు అక్కడ దండుపాళ్యం ముఠా లెక్క దోచుకునే పనుల మీద పడ్డరు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ‘వాళ్లకు మనం భయపడేది లేదు. సిరిసిల్ల వరకు నేనున్నా. మన ప్రాంతం వరకు మనం ఏ విధంగా ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కాంగ్రెస్ అరాచకపు పాలనకు ముగింపు పలుకుదాం’ అని పిలుపునిచ్చారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి కాంగ్రెసోళ్లు మోసం చేశారని మండిపడ్డారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రమంతా ఆగమైందని, అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని ఆవేదన చెందారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల మున్సిపల్లోని 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం వైష్ణణి – నాగరాజు దంపతులు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. వారితోపాటు సుమారు 500 మంది కార్యకర్తలకు కండువా కప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిందని, యువతతో పాటు అన్నీ వర్గాలను మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెసోళ్ల మాటలకు, నోర్లకు మొక్కాలని, ఏది పడితే, ఎటుపడితే అటు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తే.. దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని, రైతు బంధు రూ.10 వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని, ముసలోళ్లకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌ను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
అలాగే అత్తకు రూ.4 వేలు, కోడలుకు రూ.2500 ఇస్తామని చెప్పి, ఇచ్చింది లేదు.. పోయింది లేదు గానీ అత్తకోడళ్లకు రేవంత్‌రెడ్డి పంచాయతీ పెడ్తున్నడని మండిపడ్డారు. రైతులకు ఈ రోజు వరకు రైతు బంధు పడలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా ఎకరానికి ముందుగాల రూ.15 వేలు ఇస్తానని, తర్వాత రూ.12 వేలు సైతం ఇస్తానని చెప్పారని, ఇప్పటి వరకు ఎకరానికి పూర్తిగా ఎయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని, బ్యాంక్‌లకు పోయి లోన్లు తీసుకోండని, మేం కడుతామని చెప్పి రైతులను ఆగం చేసి కుర్చీలో కూసున్నాడని భగ్గుమన్నారు. ఇప్పుడు ముఖం మంచిగ లేక అద్దం పగులగొట్టుకున్న చందంగా ఆయన పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇస్తున్నదానికంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెసోళ్లు అనడంతో మనోళ్లు కొంత మంది ఆశపడడంతో మోసపోయారని చెప్పారు.
ఈ రోజు ఆ విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ఈరోజు సంగారెడ్డికి వెళితే అక్కడ రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని, వడ్లతో పాటు జొన్నలు, మక్కలు, శెనగలు ఏదీ కొనడం లేదని వివరించారు. ఏది కొన్నా రైతులకు మద్దతు ధర, బోనస్ ఇయ్యాలే అని, ఏది కొనకపోతే లొల్లి ఉండదని, వాళ్లే బ్రోకర్లకు, దళారులకు అమ్ముకుంటారులే అని కొంటలేదని ఆరోపించారు. రైతులు రోడ్లమీద పుట్లకు పుట్లు ధాన్యం పోసుకొని ఎదురు చూస్తున్నారని, వారిని పట్టించుకున్నోడు, అడిగినోడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఐకేపీ సెంటర్లోనే ఓ రైతు గౌరి ఎల్లవ్వ చూసి చూసి వడదెబ్బకు చనిపోయిందన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో డోర్నకల్‌లో మరొక రైతు సెంటర్లోనే వర్షం పడడంతో టార్ఫాలిన్ కోసం వెతుకుతుండగా పిడుగు పడి చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఇలా ఒకరిద్దరు కాదని కాంగ్రెస్ వచ్చినంక వెయ్యి మంది రైతులు చనిపోయారన్నారు.
రెండ్రోజుల కింద కరీంనగర్లో నగల షాపులో ఉదయం 11గంటలకే ఐదుగురు తుపాకులు పట్టుకోని వచ్చి నలుగురిని షూట్ చేసి బంగారం ఎత్తుకుపోయారంటే రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, దడిగెల శ్రావణ్‌రావు, మ్యాన రవి, బోల్గం వైష్ణవి, – నాగరాజు పాల్గొన్నారు.
కలలో కూడా ఇంత మోసం జరుగుతదని అనుకోలేదు. ఈ ప్రభుత్వం ఒక వర్గాన్నే కాదు, యువతతో పాటు అన్నీ వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో టైముకు రైతు బంధు లేదు. రైతు చనిపోతే రైతు బీమా లేదు. పండించిన పంట కొనే దిక్కులేదు. మద్దతు ధర లేదు. ఆఖరికి యూరియా కూడా లేదు. ఎండాకాలం వస్తే కరెంట్ సక్కగ ఇచ్చే మొఖం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక్కసారి తప్పుగా ఓటు వేస్తే ఐదేండ్లు గోస పడాలని కేసీఆర్ ముందే చెప్పిండు. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలన్నడు. మోసపోతే గోసపడుతమన్నడు. కొంత మంది మనోళ్లు ఇనలేదు. ఇపుడు గోసపడుతున్నరు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..? మాకంటే మీకే తెలుసు. సిరిసిల్ల పరిధిలోని గ్రామాల్లో కేసీఆర్ రాకముందు ఎకరానికి ఎంత ధర పలికిందో..? కేసీఆర్ వచ్చినంక భూముల ధరలు ఎకరం, గుంట భూములకు ఏట్లా పెరిగినాయో..? మీ అందరికీ తెలుసు!
– సిరిసిల్లలో కేటీఆర్
ఒకప్పుడు తాలూకాగ ఉన్న సిరిసిల్లను కేసీఆర్ సర్కారు హయాంలో జిల్లా చేసుకున్నం. సిరిసిల్లలోనే బ్రహ్మాండంగా కలెక్టరేట్ నిర్మించుకున్నం. కేసీఆర్ సిరిసిల్లకు సముద్రాన్ని తెచ్చిండు. ఎండకాలంలో చుక్కనీరు కనిపించని మానేరువాగుకు మండు టెండల్లో నీళ్లుండేలా కాళేశ్వరం జలాలను తెచ్చిండు. మానేరువాగు గుట్టపై నుంచి, మానేరు బ్రిడ్జిపై నుంచి చూస్తే సముద్రంను తలపించేలా జలాలను తీసుకొచ్చిండు. మానేరు, మల్కపేట రిజర్వాయర్‌తో భూగర్భ జలాలను పెంచి గోస లేకుండా చేసిండు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు. పుట్లకు పుట్లు వడ్లు పండేలా.. రైతులు సంతోషంగా ఉండేలా చేసిండు. ఇంకా రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు చేసిండు. ఆడబిడ్డ పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి ఇచ్చిండు. కడుపులో బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన కేసీఆర్‌ను తిరిగి తెచ్చుకుందాం. మళ్లీ సీఎంగా చేసుకునే పెద్ద బాధ్యత మనమీదే ఉన్నది. కేసీఆర్ సార్ మళ్లీ వస్తేనే, రాష్ర్టాన్ని పట్టాలెక్కిస్తేనే మన బతుకులు ఏమైనా బాగుపడుతయి. లేకపోతే మళ్లా గోసపడే పరిస్థితి ఉంటది.
– సిరిసిల్లలో కేటీఆర్