రాజన్న కోడెల కోతపై నోరు విప్పలేదు..
సీఎం టూర్లో ప్లేట్ మీల్స్ 32 వేలపై సమాధానం లేదు..
ముంపు గ్రామాల్లో నేతలే దరఖాస్తులు తీసుకున్నా వివరణ లేదు..
నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇచ్చే డబ్బులపై స్పష్టత లేదు మిగిలిన 5,987 మందిపై పట్టింపు లేదు..
వేములవాడ అభివృద్ధి నిధుల క్లారిటీ లేదు.. రుణమాఫీ ముచ్చట లేదు..
రైతు భరోసా 15 వేలని చెప్పి 12 వేలకు ఎందుకు తగ్గించారో చెప్పలేదు..
..కానీ, ‘పచ్చి అబద్ధాలు.. అసత్యపు ఆరోపణలు’ చేయడంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు! ఆదివారం సిరిసిల్ల జిల్లాకేంద్రంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్వహించిన విలేకరుల సమావేశమే అందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న సిరిసిల్ల వేదికగా కాంగ్రెస్ చేసిన మోసాలను కేటీఆర్ తూర్పార పడితే ఆగమేఘాల మీద స్పందించిన ఆది శ్రీనివాస్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. బీఆర్ఎస్ నాయకులు భూములు ఆక్రమించుకున్నారంటూ కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో చర్చనీయాంశమైన అనేక విషయాలపై క్లారిటీ ఇవ్వకుండా, ఎంతసేపూ ఆరోపణలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేసి, వారికి వారే సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే అసైన్డ్‌భూముల వ్యవహారంలో కొంత మంది నాయకులు అప్పుడే వసూళ్ల పర్వానికి తెరలేపినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో అనేక ప్రశ్నలు సంధించారు. రైతు భరోసా ఎందుకివ్వడం లేదు? ఎన్నికల్లో 15 వేలు ఇస్తామని చెప్పి కేబినెట్లో 12 వేలు ఇవ్వడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నరు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసినా ధోఖా కాదా..? వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి? ఒక్క గ్రామంలోనైనా రైతు రుణమాఫీ వందశాతం జరిగిందా..? రైతు భరోసాకు రైతు డిక్లరేషన్ ఎందుకు? వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఫ్రీ బస్సు తప్ప ఏం చేసిన్రు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకపోగా.. ఆరోపణలు, అసత్యపు మాటలతో ఎలా పక్కదారి పట్టించారో స్పష్టమవుతున్నది. మచ్చుకు కొన్నింటిని చూస్తే.. అధికారయంత్రాగం వారికి అనుకూలంగా ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది.
ఎన్నెన్నో సందేహాలు
సిరిసిల్ల నియోజకవర్గంలో జంగ్ భూములు, సిపాయి భూములు, పోరంబోకు, పంచరాయి, శిఖం, లావుని పట్టా, దేవాలయ, ప్రభుత్వానికి చెందిన వేయి ఎకరాల భూములను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని కొత్త విమర్శను ఆది శ్రీనివాస్ తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా ఇప్పటికే ప్రభుత్వం అందులో పావలా వంతు అంటే 250 ఎకరాలు స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. అయితే, ఈ మాటలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వేయి ఎకరాలు కబ్జాకు గురైనట్టు సమాచారం వస్తే ఆ జాబితాను ఎందుకు బయటపెట్టడం లేదు? సదరు వ్యక్తులందరికీ నోటీసులు ఎందుకివ్వలేదు? అంటే దీని వెనుక నడుస్తున్న వ్యవహారం ఏమిటి?. అసలు వేయి ఎకరాల జాబితాను ముందుగానే విప్‌కు ఎవరిచ్చారు? అందులో కాంగ్రెస్ నాయకులను మినహాయించడం కోసం వివరాలు బయటకు వెల్లడించడం లేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అలాగే, 250 ఎకరాలు స్వాధీనం చేసుకుంటే.. ఎవరెవరి నుంచి ఎంత భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారో నేటి వరకు ఎందుకు వెల్లడించలేదు. ఇప్పటివరకు కేవలం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తనకు కేటాయించిన రెండెకరాల అసైన్డ్ భూమిని అప్పగించినట్టు మాత్రమే అధికారులు వెల్లడించినా.. మరి స్వాధీనం చేసుకున్న మిగిలిన వారి జాబితా ఎందుకు బయట పెట్టడం లేదు? అంతేకాదు, అధికారులు జాబితా బయట పెట్టకుండానే కాంగ్రెస్ నాయకుల చేతికి ఎలా వచ్చింది? కేవలం కొంత మంది బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినా.. 250 ఎకరాలు స్వాధీనం చేసుకొని ఉంటే వారందరిపై తహసీల్దార్లు ఫిర్యాదు చేశారా..? ఇలా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారయంత్రాగంపై ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు భరోసాపై దాటవేతే!
అర్హులకు రైతు భరోసా ఇస్తున్నామంటూ ఆది శ్రీనివాస్ దాటవేసేందుకు తంటాలు పడ్డారు. నిజంగా వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టు రైతు భరోసా కింద ఎకరాకు 15 వేలు ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. ప్రస్తుతం 12 వేలకు ఎందుకు తగ్గించారో వివరించలేదు. రైతులకు జరిగిన మోసంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రధానంగా ఒక్క గ్రామంలోనైనా వందశాతం రైతు రుణమాఫీ జరిగిందా..? నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరినా నోరు మెదపలేదు. నిజంగా ఆది శ్రీనివాస్‌కు ప్రభుత్వం మీద అంత నమ్మకముంటే.. కనీసం తాను ప్రాతినిధ్యం వహించే వేములవాడ నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ జరిగిందని చెప్పవచ్చు! కానీ, అలా చెప్పలేదు. పైగా ఈ విషయం గురించి మాట్లాడకుండా మళ్లీ పాత పాటే అందుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల్లోకి నెట్టిందంటూ చెప్పుకొచ్చారే తప్ప ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. చాలా విషయాలను అలాగే దాటవేస్తూ కేవలం భూకబ్జాలను తెరపైకి తెచ్చి, అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
దళారుల రంగప్రవేశం?
భూముల కబ్జా జరిగిదంటూ ప్రచారం చేయడమే కాకుండా.. అసైన్డ్ భూములున్నాయంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆర్భాటపు ప్రచారాన్ని ‘క్యాష్’ చేసుకునేందుకు కొంత మంది నాయకులు, దళారులు రంగప్రవేశం చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతున్నది. అంతేకాదు, అధికారుల వద్ద ఉండాల్సిన ఒకటి రెండు జాబితాలు.. కొంతమంది నాయకుల చేతికి వెళ్లినట్టు తెలుస్తున్నది. వీటి ఆధారంగా దళారులు నేరుగా ఇండ్లకు వెళ్లి కొంత మందితో బేరసారాలకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. కబ్జా జరిగిన వివరాలుంటే అధికారుల వద్ద ఉండాలే తప్ప దళారుల చేతికి ఎలా వెళ్లాయన్న దానిపై ఇటు అధికారులు, అటు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరముందన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.
విప్ గారూ.. వీటిపై ఏదీ స్పష్టత?
రాజన్న కోడెలు కోతకు వెళ్లిన విషయాన్ని అధికారులే ధ్రువీకరించారు. దీనిపై నేటి వరకు ఆది శ్రీనివాస్ స్పందించలేదు. అంతేకాదు, గోశాల నుంచి పంపిణీ చేసిన 1,975 కోడెల వివరాలను తెప్పించేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన చెప్పిన గడువు ముగిసింది. అయితే, నేటి వరకు ఆ వివరాలు వచ్చాయా..? వస్తే ఎన్ని బతికున్నాయి? కోతకు పోయిన కోడెలెన్ని? అన్న వివరాలను ఎందుకు బయటకు చెప్పడం లేదన్న దానిపై నేటికీ స్పష్టత లేదు.
నిజానికి రాజన్న కోడెల విషయంలో పూర్తి వివరాలను ఆరా తీసేందుకు వేములవాడ పోలీసులకు ఫైల్ అప్పగిస్తామని ఆలయ ఈవో ముందుగా చెప్పారు. కానీ, ఆ తర్వాత మాట మార్చి వివరాల సేకరణ దేవాలయ అధికారులకు అప్పగించారు. నిజానికి పోలీసులకు వివరాలు అప్పగించి ఉంటే వాస్తవాలు బయటకు వచ్చేవి. పోలీసులు విచారణ చేయకుండా అడ్డుకున్నదెవరు? ఈవో పోలీసులకు వివరాలు ఇవ్వకుండా ఎందుకు వెనక్కితగ్గారు? అందులో ఎవరి పాత్ర ఉందన్న విషయంపై ఆది శ్రీనివాస్ స్పందించాలన్న డిమాండ్లు వచ్చినా నేటి వరకూ వాస్తవాలు వెల్లడించలేదు.
ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా ఒక్కో వీఐపీకి 32 వేల భోజనం పెట్టినట్టు విమర్శలు, కథనాలు వచ్చాయి. దీనిపై నేటివరకు ఎవరూ స్పందించలేదు. ప్లేట్ భోజనానికి 32వేలు అవుతుంది నిజమా.. కాదా? అన్న వివరణ కూడా ఇవ్వలేదు.
ముంపు గ్రామాల పరిహారం కోసం స్వయంగా కాంగ్రెస్ నాయకులే కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చొని దరఖాస్తులు స్వీకరించారు. ఆధారాలతో సహా కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఏకంగా ఆది శ్రీనివాస్ పేరిట సదరు దరఖాస్తులు ముద్రించారు. నిజంగా విప్ ఆదేశాల మేరకే పార్టీ నాయకులు దరఖాస్తు లు స్వీకరించారా..? లేక వారంతంట వారే తీసుకున్నారా..? వివరణ ఇవ్వలేదు. అలాగే, పార్టీ నా యకులు గ్రామ పంచాయతీలో కూర్చొని నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు స్వీకరిస్తే కనీసం విచారణకు ఆదేశించక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నదానిపై విమర్శలు వస్తున్నాయి.
మధ్యమానేరు రిజర్వాయర్‌లో మొత్తం 10,683 నిర్వాసిత కుటుంబాలుండగా.. 4,696 మందికి 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన 5,987 మంది పరిస్థితి ఏమిటన్న దానిపై నేటికీ మౌనమే రాజ్యమేలుతున్నది. అలాగే, 4,696 మందికి ఇచ్చే డబ్బులు ఒకేసారి ఇస్తారా..? లేక దశల వారీగా ఇస్తారా..? అన్నదానిపై స్పష్టత లేదు.
వేములవాడ అభివృద్ధి కోసం వేయి కోట్లు ఇచ్చారంటూ ముఖ్యమంత్రి సభా వేదికపైనే ఆది శ్రీనివాస్ చెప్పారు. ఆ వేయి కోట్ల లెక్కలు చెప్పాలని ప్రజల నుంచి చాలా సార్లు డిమాండ్ వచ్చింది. కానీ, నేటి వరకు వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు. ఆ పనులన్నీ ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న దానిపైనా నేటికీ స్పష్టత లేదు.