కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని/ పాలకుర్తి : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు గురువారం కాళేశ్వరం సందర్శనకు బయలుదేరారు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చూసుకున్న అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఎల్ఎండీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వీరితోపాటు వచ్చిన కేటీఆర్ ముందుగా ఎల్ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కట్టదిగి నీటిని పరిశీలించారు.
గతేడాది ఇదే సమయానికి తాము నిలుచున్న చోట పుష్కలంగా నీళ్లు ఉండేవని చెప్పారు. అక్కడే అధికారులను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రెగ్యులేటర్ వద్దకు వెళ్తూ మార్గం మధ్యలో మరోసారి ఆగి ఖాళీగా ఉన్న రిజర్వాయర్‌ను పరిశీలించారు. రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని, దిగువ కాకతీయ కాలువను పరిశీలించారు. ఆ తర్వాత గేట్ల వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేల బృందం అక్కడ కొద్దిసేపు కూర్చుని రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేర్)తోపాటు ఎల్ఎండీ రిజర్వాయర్ పరిస్థితిని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేల బృందం బొమ్మకల్‌లోని వీ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లి అక్కడి రాత్రి భోజనాలు ముగించుకుని గోదావరిఖనికి బయలుదేరి వెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల బృందం గురువారం రాత్రి 11 గంటలకు గోదావరిఖని పట్టణానికి చేరుకున్నది. అంతకు ముందు బసంత్‌నగర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశికహరి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ సుమారు 200 మంది కేశోరాం కార్మికులు, మహిళలు కేటీఆర్ కోసం ఆర్ధరాత్రి వరకు ఎదిరిచూస్తూ రాజీవ్హ్రదారిపై ఓపికగా వేచి ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ బృందం రామగుండంలోని ఎన్టీపీసీకి రా గా, ఇక్కడి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని జ్యోతిక వీఐపీ గెస్ట్‌హౌస్ వద్ద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడే బస చేశారు.

శుక్రవారం ఉదయం మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌తోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, తదితర ప్రదేశాలను పరిశీలించనున్నారు. ఈ బృందంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, విజయుడు తదితరులు, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, తాతా మధు, శంభీపూర్ రాజు, సుభాష్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, తదితరులు ఉన్నారు. వీరివెంట మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, పొన్నం అనిల్‌గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్, తిమ్మాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు రావుల రమేశ్, కరీంనగర్ కార్పొరేటర్లు, పలువురు నాయకులు ఉన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, రాష్ట్ర సాగు నీటి రంగంలో విప్లవాన్ని సృష్టించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు మల్టీస్టేజ్ ప్రాజెక్టుగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులకు నష్టం చేయద్దని సూచించారు. తక్షణమే ప్రభుత్వం కాళేశ్వరం నుంచి పంపింగ్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లను నింపాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన కేటీఆర్, గురువారం సాయంత్రం ఎల్ఎండీ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులను రిజర్వాయర్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘ఎల్ఎండీ రిజర్వాయర్‌లో గతేడాది ఎన్ని నీళ్లు ఉన్నయి.
ఇప్పుడు ఎన్ని నీళ్లున్నయి’ అని ప్రశ్నించారు. దీంతో అధికారులు చెప్పిన మాటలు విన్న ఆయన అవాక్కయ్యారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు గతేడాది ఇదే సమయంలో ఎల్ఎండీలో 12 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఇప్పుడు కేవలం 5 టీఎంసీలే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. గోదావరిలో 10 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉన్నదని, కొన్ని వందల టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, మిడ్ మానేరు, దిగువ మానేరులో మాత్రం నీటికి కొరత ఉన్నదని అన్నారు. గతేడాది ఇదే సమయంలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదను పంపింగ్ ద్వారా మళ్లించి మిడ్‌మానేరు, దిగువమానేరు జలాశయాలను పూర్తి స్థాయిలో నింపి రైతులకు భరోసా కల్పించామని చెప్పారు.
కానీ, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా కక్షసాధింపు చర్యలకు దిగుతూ కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నదన్నారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలోనే ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాము కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నామని చెప్పారు. పది లక్షల క్యూసెక్కుల వరదను సైతం తట్టుకుని కన్నెపల్లి ప్రాజెక్టు ఠీవీగా నిలబడిందని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తే రాష్ట్రంలో 240 టీఎంసీలు నిలువ చేసుకోవచ్చని, ఈ నీటితో 24 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చని అన్నారు.