ఉచిత విద్యుత్ పేరిట ఉన్న విద్యుత్ పోగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్ చార్జీల మోతలతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపబోతున్నది. మేం పదేళ్ల పాటు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి అండగా నిలిచినం. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ పైసా పెంచలేదు. ఆత్మహత్యలు, ఆకలిచావులు లేకుండా పరిశ్రమలను నడిపించినం. కానీ, పది నెలల కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, చార్జీల మోతలు దారుణం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆ భారాన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై మోపేందుకు చార్జీలు పెంచాలన్న నిర్ణయం దుర్మార్గం. సిరిసిల్ల మరమగ్గాలపై భారం మోపద్దు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చార్జీలు పెంచే ఆలోచనను విరమించుకోవాలి. ప్రభుత్వం అసంబద్ధంగా ముందుకు పోతే ప్రజల్ని ఐక్యం చేసి ప్రజా పోరాటం ద్వారా అడ్డుకుంటం. పైసా పెంచినా ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకిస్తూ కొట్లాడుతం.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్: కరెంటు చార్జీలు పెంచి వస్త్ర, ఇతర పరిశ్రమలపై భారం మోపాలన్న కుట్రలను తిప్పికొడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. ఉచిత్ విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలపై మోపాలన్న ఆలోచన ఏ మాత్రం సరైంది కాదని హితవు పలికారు. పదేండ్లలో ఆత్మహత్యలు లేకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను నడిపించామని, కానీ, ఇప్పుడు మరమగ్గాలపై భారం మోపితే సహించేదిలేదని స్పష్టం చేశారు. చిన్న, భారీ పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యుత్ చార్జీలు వేయడం చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఉరివేసినట్లేనన్నారు.
డిస్కంల నిర్ణయం కారణంగా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిలో పరిశ్రమలను కాపాడుకునేలా వీలైనంత వరకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ), సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు అధ్యక్షతన బహిరంగ విచారణ జరిపారు. కేటీఆర్ పాల్గొని, విద్యుత్ చార్జీలు, వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. చేనేత జౌళీశాఖ మంత్రిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా, నేతన్నల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సమస్యలను ముందుంచానని, వాటిని పరిష్కరించాలని కోరారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాదాపు గంటపాటు ప్రసంగించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి నేతన్నల ఆత్మహత్యలను నివారించామని తెలిపారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, రంజాన్, క్రిస్మస్ ఆర్డర్లు ఇచ్చి పరిశ్రమను బతికించే స్థితికి తెచ్చామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 400 కోట్లతో వర్కర్ టూ ఓనర్ అనే అద్భుతమైన పథకం ప్రవేశపెట్టామని, అప్పారెల్, టెక్స్టైల్ పార్కులను బలోపేతం చేశామని తెలిపారు. మరమగ్గాల ఆధునీకరణ చేపట్టిన విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. కానీ, పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు, చార్జీల మోతలతో ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ ఆధారిత వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క సిరిసిల్లలోనే పది మంది, ఇతర జిల్లాలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన చెందారు.
నేతన్నల సంక్షేమం కోసం వ్యవసాయానికి ఇస్తున్న మాదిరిగా సాంచాలకు 5హెచ్‌పీల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు చేస్తున్న మరమగ్గాలకు ప్రస్తుతం ఇస్తున్న 10హెచ్‌పీల సబ్సిడీ విద్యుత్‌ను 30హెచ్పీలకు పెంచాలని, ఈ ప్రతిపాదనను లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఈఆర్సీని కోరారు. నాయీబ్రాహ్మణులు, రజకులు, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తమ ప్రభుత్వం ఏనాడు చార్జీలు పెంచాలని ఆలోచించలేదని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం, ఆ భారాన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై మోపేందుకు చార్జీలు పెంచాలన్న నిర్ణయం దుర్మార్గమన్నారు. డిస్కంలంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలేనని, ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదని పేర్కొన్నారు. సిరిసిల్లలో 1.26లక్షల గృహ కనెక్షన్లు ఉన్నాయని, ఎండకాలంలో 300 యూనిట్లు దాటుతున్నాయని చెప్పారు. అది దాటితే కిలోవాట్‌కు వసూలు చేస్తున్న ఫిక్స్ చార్జీని 10 నుంచి 50కి పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు.
సెస్‌ను కాపాడుకోవాలి
1975లో దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌రావు స్థానిక పెద్దలతో కలిసి తీసుకొచ్చిన సంస్థ సెస్ అని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే సహకార రంగంలో ఉన్న ఏకైక సంస్థ ఇది మాత్రమే ఉందన్నారు. డిస్కంలతో అద్భుతంగా పోటీ పడుతూ వినియోగదారులకు సేవలందిస్తున్నదని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. అలాంటి సెస్‌ను బోర్డులో కలుపాలని నాటి సమైక్య ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలను ఈప్రాంత రైతులు, ప్రజలు పోరాటం చేసి కాపాడుకున్నారని గుర్తు చేశారు. అటువంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ ప్రతినిధి బియ్యంకార్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కరెంటు చార్జీలు పెంచాలన్న డిస్కంలు చేస్తున్న ప్రతిపాదనలను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఉచిత కరెంటు ఇచ్చిన భారాన్ని పేద, మధ్య ప్రజలపై మోపుతుందంటూ నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో వినియోగదారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొని తమ అభ్యంతరాలను ఈఆర్సీకి వ్యక్తం చేశారు. చార్జీలు పెంచితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమతో పాటు చిన్న కుటీర పరిశ్రమలు, రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి ఉంటుందని సూచించారు. విద్యుత్ బిల్లులు భారమై ఇప్పటికే టెక్స్టైల్స్ పార్కు మూసి వేసిన విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. చార్జీలు పెంచితే పరిశ్రమలకు ఉరివేసినట్లేనని, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
నాటి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టలేదు. ప్రస్తుతం వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రతిపాదనలు తేవడం విచారకరం. దీని ద్వారా వినియోగదారులపై భారం పడుతుంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగింది వస్త్ర పరిశ్రమ. సిరిసిల్లలో దాదాపు 25వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేయడం, కొత్త ఆర్డర్లు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. చేనేత రంగంపై జీఎస్టీ భారం పడుతున్నది. విద్యుత్ సంస్కరణల ద్వారా సత్ఫలితాలు రావాలి. కానీ, చార్జీలు పెంచడం ద్వారా వస్త్ర పరిశ్రమపై మోయలేని భారం పడుతుంది. ప్రభుత్వం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం సరైంది కాదు. చొప్పదండి నియోజకవర్గంలో వస్త్ర పరిశ్రమకు అనుబంధం ఉన్నది. చార్జీల పెంపు ద్వారా వస్త్ర పరిశ్రమపై భారం పడుతున్నది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన సందర్భంలో వాటి స్థానంలో కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. దీని ద్వారా రైతులపై భారం పడుతున్నది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించేలా చూడాలి. వినియోగదారులపై భారం మోపేలా ప్రభుత్వం తీసుకున్న చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– రవిశంకర్ సుంకె, మాజీ ఎమ్మెల్యే
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలోని కుటీర పరిశ్రమలకు 10హెచ్‌పీ వరకు 50శాతం సబ్సిడీ అమలుచేశారు. 30హెచ్‌పీ వరకు 50 శాతం సబ్సిడీ అమలుచేసేలా ఆలోచన చేయాలి. సిరిసిల్ల పరిశ్రమకు పూర్తిస్థాయిలో సబ్సిడీ అందించాలి. దీని ద్వారా ప్రభుత్వంపై 12కోట్ల వరకు భారం పడుతుంది, కానీ ఇక్కడ పరిశ్రమ పన్నుల రూపంలో ప్రభుత్వానికి 70కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
– తాటిపాముల దామోదర్, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు (సిరిసిల్ల)
వ్యవసాయ రంగానికి ఇస్తున్న 5హెచ్‌పీల విద్యుత్‌ను 7.5 హెచ్పీలకు పెంచాలి. సెస్ కొనుగోలు చేసే విద్యుత్‌పై సర్‌చార్జీలను మినహాయించాలి. సిరిసిల్లలో 25,494 మరమగ్గాలున్నాయి. వీటికి 10హెచ్‌పీల లోడ్ పరిమితి నుంచి 30హెచ్పీలకు పెంచాలి. సెస్ కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్‌కు 4.84పైసలుగా నిర్ణయించారు. పెంచిన ధరను పునఃసమీక్షించి పాత ధరకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– చిక్కాల రామారావు సెస్‌చైర్మన్