చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అంకురార్పణ కాబోతున్నది. గురువారం కరీంనగర్‌తోపాటు చొప్పదండిలో పర్యటించనున్న అమాత్యుడు.. నగరంలో 615 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, 410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత మార్క్‌ఫెడ్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం చొప్పదండిలో 38 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తోపాటు వివిధ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల అన్ని ఏర్పాట్ల్లు చేయగా, పర్యటన వివరాలను రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గుడి పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రెండు చోట్ల స్థల పరిశీలన చేశామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్‌కు ప్రస్తుతం ప్రైవేట్ స్థలం అవసరం లేదని, ఒక వేళ సేకరించాల్సి వస్తే.. సంబంధిత భూ యజమానుల అంగీకారం మేరకే తీసుకుంటామని స్పష్టం చేశారు.
కరీంనగర్, మార్చి 16 : కరీంనగర్ జిలాకేంద్రంలో వెయ్యి 25కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అందులో కార్పొరేషన్ పరిధిలో 615 కోట్ల పనులు ఉన్నాయని, 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులున్నాయని చెప్పారు. తర్వాత కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం నిర్మించే గుడి పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రెండు చోట్ల స్థల పరిశీలన చేశామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్‌కు ప్రస్తుతం ప్రైవేట్ స్థలం అవసరం లేదని, ఒక వేళ సేకరించాల్సి వస్తే సంబంధిత భూ యజమానుల అంగీకారం మేరకే తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనేక అంశాలను వెల్లడించారు.
18నెలల్లో గుడి నిర్మాణం పూర్తి
కరీంనగర్లో తిరుమల వేంకటేశ్వర స్వామి గుడిని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ను గతంలోనే కలిశామని, ఆమేరకు అంగీకారం తెలిపారని మంత్రి గంగుల పేర్కొన్నారు. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కరీంనగర్లో గుడి నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని, నిర్మాణానికి పదెకరాల స్థలం కావాలని అడిగారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. నగరానికి ఎటువైపు గుడి నిర్మిస్తే బాగుటుందన్న అంశంపై పండితులతో చర్చించారని, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలని భావించినట్లు తెలిపారు. పండితుల సూచనలను పరిగణలోకి తీసుకొని.. కరీంనగర్ డెయిరీకి సంబంధించిన 10.2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈభూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి తమకు అందించారని, ఈ విషయంలో సీఎం చొరవ మరువలేనిదని, అందుకు జిల్లా ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, రాబోయే 18 నెలల్లో పూర్తిచేసి ఉత్తర తెలంగాణ జిల్లాల భక్తులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు..
కరీంనగర్‌కు ఒక మణిహారంలా నిలిచే మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని, తర్వాత కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని మంత్రి గంగుల తెలిపారు. 410 కోట్లతో చేపట్టే రివర్ ఫ్రంట్ పనులను వచ్చే 18 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. అందులో 310 కోట్ల విలువైన సివిల్ వర్క్లుండగా, 100 కోట్లతో లైటింగ్, ఫౌంటేయిన్స్, గ్రీనరీ వంటివి ఉన్నాయన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల విషయంలో ప్రైవేట్ భూములు ఎన్ని తీసుకుంటారన్న ప్రశ్నకు.. ప్రస్తుతానికి మానేరు పరిధిలోని డౌన్ స్ట్రీం అంటే గేట్ల వద్ద 410 మీటర్ల వెడల్పు ఉందని, అదే వెడల్పుతో నిర్మాణమైన చెక్‌డ్యాం వరకు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రైవేట్ భూములు పెద్దగా అవసరం లేదన్నారు. అయితే మానేరు బఫర్‌జోన్‌ను వినియోగించుకొని.. పనులుంటాయని, భవిష్యత్‌లో అవసరమైతే భూ యజమానుల అంగీకారం మేరకే తీసుకుంటామని స్పష్టం చేశారు.
615 కోట్ల పనులకు భూమి పూజ
నగరంలో 615 కోట్ల కార్పొరేషన్ నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ గురువారం పూజ చేస్తారని మంత్రి తెలిపారు. నిజానికి హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి కోసం జారీ అయిన జీవో నంబర్ 4 కరీంనగర్ రోడ్లకు సంబంధించినదేనని పేర్కొన్నారు. నగరంలో 14.5 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారులను చూడ ముచ్చటగా తీర్చిదిద్దామన్నారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 615 కోట్ల విలువ గల పనులకు గురువారం శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అందులో 18 కోట్లతో 24/7వాటర్ సరఫరాకు పైలెట్ ప్రాజెక్టు, 48 కోట్లతో సీవరేజీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో పాటు ఐలాండ్స్ ఆధునీకరణ, డంప్‌యార్డు తొలగింపు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, నగరంతా సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అనేక పనులున్నాయని చెప్పారు.
మెడికల్ కళాశాల ఏర్పాటుకు రెండు చోట్ల స్థల పరిశీలన
నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు రెండు చోట్ల స్థల పరిశీలన చేశామని మంత్రి గంగుల తెలిపారు. దిగువమానేరు జలాశయం పరిధిలోని పాత శాతవాహన కళాశాలకు సంబంధించిన 31 ఎకరాల స్థలం, అలాగే కొత్తపల్లి గ్రామ పరిధిలోని విత్తన సంస్థ పరిధిలో 46 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కమిటీ వచ్చి స్థల నిర్ణయం చేస్తారని తెలిపారు. పోటీ పరీక్షల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి ఒక కోచింగ్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఇప్పటికే 5 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను మంత్రి గురువారం ప్రారంభిస్తారని, ఈ స్టడీ సర్కిలో ఇచ్చే శిక్షణకు అందరూ హాజరుకావచ్చని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన వద్దు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటుతో తమ భూములు పోతాయని అల్గునూరు రైతులు భయపడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భూసేకరణ అవసరం లేదని, ఒక వేళ అవసరమైతే సంబంధిత రైతుల అంగీకారంతోనే తీసుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని నియోజకవర్గ చరిత్రలో అత్యధిక ప్రాజెక్టులు కొలువై ఉన్నది మా నకొండూరులో మాత్రమే అన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించిన కాలువల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఈ విషయంలో సీఎంతోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు.
38 కోట్లతో చొప్పదండిలో సెంట్రల్‌లైటింగ్ : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండిలో 38 కోట్లతో చేపట్టే సెంట్రల్‌లైటింగ్ పనులకు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి పది నిముషాల్లో ఇచ్చారని, వారికి చొప్పదండి ప్రజల తరపున పాదాభివందనం చేస్తున్నామన్నారు. చొప్పదండి మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగు పరిచేందుకు 20 కోట్ల నిధులు కేటాయించారన్నారు. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఉందన్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే చొప్పదండి మున్సిపల్ పరిధిలో 25 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పానని, అయితే గెలిచిన రెండేళ్లలో 58 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్ సహకరించారని తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీ అయిన తర్వాత మొదటిసారి చొప్పదండికి వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రగతి పనుల జాతర
మంత్రి కేటీఆర్ గురువారం కరీంనగరంలో పర్యటించనున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 615 కోట్లతో నగరంలో వివిధ అభివృద్ధి పనులు, 410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఆ వివరాలెంటో చూద్దాం..