తెలంగాణ కోసం వందల మంది పిల్లలు బలిదానాలు, త్యాగాలు చేసిన్రు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఒకటిగా చేసి ఉద్యమంతో రాష్ట్రం సాధించుకున్నం. అప్పటి కాంగ్రెస్ ఉద్యమానికి తలొగ్గి, కేసీఆర్ దీక్షకు దిగివచ్చి, ప్రజాశక్తికి భయపడి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ మర్యాదగా రాలేదు. గల్లాపట్టి తంతేనే బుద్ధి తెచ్చుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇచ్చింది. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను కాపాడుకుందాం.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, ఆయన రెన్యూవల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన నెల నెలకు ఢిల్లీకి సంచులు మోసి, రెన్యూవల్ చేసుకొని వస్తారని విమర్శించారు. ఏమన్నా అంటే కేసీఆర్‌ను తిట్టుడే తప్పా ఏ ఒక్క పనిచేయలేదని, ఇయ్యాళ్ల కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కేసీఆర్‌ను తిట్టడే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆరా..? నువ్వా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ ముష్కరుల చేతిలో పడిందని, దీనిని కాపాడుకుందామా.. విడిచిపెడదామా..? అని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. మొదట జిల్లాకేంద్రంలోని గీతానగర్‌లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది ప్రభుత్వ విద్యార్థులకు ‘గిప్ట్ ఏ స్మైల్’ కింద ట్యాబ్‌లు అందజేశారు.
తర్వాత సిరిసిల్ల తెలంగాణ భవన్లో వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల నుంచి సుమారు 500 మందికిపైగా బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభదినమని, ఈ శుభదినం పార్టీలో చేరుతున్న వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, అరుణ్ దంపతులతోపాటు వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల నుంచి చేరుతున్న వారికి అభినందనలు తెలిపారు. సరిగ్గా ఈ రోజుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచిందని, ఈ పుష్కర కాలంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ తెలంగాణ ముష్కరుల చేతికి పోయిందని, దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనలోకి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మోసపోతే గోసపడతామని కేసీఆర్ ముందే చెప్పారని, కొంత మంది విన్నారని, కొంత మంది వినలేదని చెప్పారు. ఇక్కడ సిరిసిల్లలో మాటవిని తనను గెలిపించారని, వేములవాడ, మానకొండూర్, హుస్నాబాద్, కామారెడ్డి వాళ్లు వినలేదన్నారు. వినని పాపానికి దేశమంతా ఛీఛీ అని వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రాన్ని తెలంగాణలో నెత్తిన పెట్టుకున్నామన్నారు. ఒకనాడు బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు నిష్పల తెలంగాణగా మారిందని వాపోయారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలను చావగొడుతున్నారని, ప్రజలను చావగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని ప్రశ్నించారు. అందుకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఐదేళ్లు గోసపడతామని, ఎలక్షన్ల ముందు వచ్చి ఏవేవో హామీలు ఇస్తే తొందరపడకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పాలనలో గోసలు ఏట్లుండెనో.. ఇప్పుడు రెండున్నరేళ్లలో అవే పరిస్థితులు రేవంత్‌రెడ్డి తీసుకొచ్చాడని కేటీఆర్ విమర్శించారు. ఎన్కటి రోజులు తెస్తామని చెప్పి రైతుల ధాన్యం కొనకుండా అరిగోస పెడుతున్నారని, అరవై రోజులుగా వడ్ల కుప్పల వద్ద రైతులు కాళ్లమీద పడ్డా కొంటలేరని ఆగ్రహించారు. కేసీఆర్ ఉన్నప్పుడు కండ్లకు అద్దుకొని వడ్లను కొన్నారని, ఇప్పుడు కండ్లకు అద్దుకునుడు కాదుగానీ, కాళ్లు పట్టుకున్నా కొంటలేరని మండిపడ్డారు. రైతులు అధికారుల కాళ్లమీద పడొద్దని, ధాన్యం ఎందుకు కొనరని కాలర్ పట్టుకోని అడగాలని సూచించారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు వానకు భయపడి రూ.1600 క్వింటాళ్లు దళారులకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ హయాంలో 8500 సెంటర్లు పెట్టి రైతుల ధాన్యం కొన్నాడని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన 70 లక్షల రైతు కుటుంబాలు ఇప్పుడు బాధపడుతున్నాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతు డిస్కంల పేరిట కొత్త దుకాణాన్ని పెట్టాడని కేటీఆర్ ఆగ్రహించారు. ట్రాన్స్ఫార్మర్లకు, మోటర్లకు మీటర్లు పెట్టే డిస్కంలు తెస్తున్నాడని, దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కంలను తెలంగాణలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ఏ రైతు అడిగాడని డిస్కంలు పెడుతున్నావని, ఎవరికోసం పెట్టావని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ డిస్కం, డిస్కోలు లేకుండా 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి మనసుల ఏముందో ఆయన సీఎం కాకముందు రైతులకు 24 గంటల కరెంట్ దండుగ అని, 3 గంటలు సరిపోతుందని అమెరికాలో మీటింగ్‌లో అన్నప్పుడే బయటపడిందన్నారు. నిన్నగాక మొన్న రైతు డిస్కంలపై ప్రజాభిప్రాయ సేకరణ పెడితే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి మనసులో మాటను బయటపెట్టాడని అన్నారు. రైతులను ముంచేతందుకు, ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులకు డిస్కంపెట్టి రైతులకు ఉరిపెడతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులను గోస పెట్టవద్దని, డిస్కంల ఏర్పాటు మానుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం చక్రపాణి, మాజీ జడ్పీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, గుగులోతు రేణ, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న – అరుణ్, వీర్నపల్లి, గంబీరావుపేట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పిండు. రెండున్నరేళ్లలో నాలుగు వేల ఉద్యోగాలు ఇయ్యలేదు. వంద రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని బాండ్ పేపర్లు, గ్యారెంటీ కార్డులు రాసిచ్చి మోసం చేసిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. మూడు నెలల్లోనే కండలు తిరిగిన మగాడైనా పిల్లలు పుట్టిస్తాడా? అని ఎదురు ప్రశ్న వేసిండు. మూడు నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు. కానీ, 30 నెలల్లో పిల్లలు పుట్టించకపోతే ఏమంటారో మీరే చెప్పాలి. ఇంత గలీజు భాష మాట్లాడిన సీఎం చేతగాకుంటే తప్పుకోవాలి. పక్కకు జరిగితే చేసేవాళ్లు మస్తుగా ఉన్నరు. కేసీఆర్ సార్ మళ్లీ వస్తడు. 2028లో సీఎం అయితడు. ఎట్ల పనులు చేయాలో చేసి చూపిస్తడు. ఎవరూ అధైర్యపడవద్దు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పదేళ్ల కంటే నాలుగింతలు అభివృద్ధి చేసుకుందాం.
– కేటీఆర్