ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 7: కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్‌ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు మరణించినా, ఆ విషయంపై శాసన సభలో నిలదీసినా, నష్టపరిహారమివ్వాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వం దున్నపోతుమీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లు ధైర్యం కోల్పోవద్దని, ఇంకో రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని భరోసానిచ్చారు.
మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ముందుగా సిరిసిల్లలో జరిగిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవ వేడుకలకు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఉపాధి కరువై.. అప్పుల పాలై ఆత్మహత్యకు యత్నించి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటోడ్రైవర్ నాంపల్లి సతీశ్‌ను పరామర్శించారు. సతీశ్ వైద్య ఖర్చులన్నీ పార్టీ భరిస్తుందని చెప్పారు. తక్షణ సాయంగా రూ.25 వేలు అందించి భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ సత్యనారాయణస్వామిని కోరారు. అనంతరం విలేకరులతో కేటీఆర్ మాట్లాడారు. సతీశ్ విద్యావంతుడైన భార్యాపిల్లలతో ఇక్కడే ఉందామనుకుని ఆరేళ్లుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడని గుర్తు చేశారు.
ఆరు నెలలుగా ఆటో నడవక, ఉపాధి లేక కుంగిపోయి.. అప్పుల భారం పెరిగి ఫైనాన్స్‌లో తెచ్చుకున్న ఆటోకు కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సతీశ్లాగే రాష్ట్రంలోని లక్షలాది ఆటో డ్రైవర్ల పరిస్థితి కుడిఎడమలుగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిందని, అక్కడ ఏడాదికి 15 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పి దసరాకు ఆరేడు లక్షల మంది డ్రైవర్లకు డబ్బులిచ్చే పథకాన్ని ప్రారంభించినట్టు తెలిసిందన్నారు.
కాంగ్రెస్ పాలకులు మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, రెండేళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్‌కు బాకీ ఉన్న 24 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు అసంఘటిత రంగంలో ఉండే 10 లక్షల మంది కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ అక్టోబర్‌లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో దాదాపు 8 లక్షల మంది డ్రైవర్లకు ప్రమాద బీమా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెచ్చిన బీమా పథకాన్ని కొనసాగించాలని, చేతనైతే పెంచే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
తాము ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదని, అవసరమొస్తే ఏసీ బస్సులోనూ ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించాలని, బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నామన్నారు. పేదవాళ్లకు ఇచ్చే పైసలను మరిచి కాంట్రాక్టర్లకు పైసలు కట్టబెట్టే పద్ధతి మంచిది కాదన్నారు. నెలకు 10 వేల కోట్ల చొప్పున రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 23 నెలల్లో 2.30 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయాయని నిలదీశారు.
ఒక కొత్త ప్రాజెక్టు కట్టలేదని, కొత్త రోడ్డు పోసింది లేదని, అప్పుగా తెచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించారు. ఒక సంక్షేమ పథకం సరిగా అమలు చేసింది లేదని, ఆరు గ్యారెంటీల అమలు లేదని, 420 హామీల ఊసేలేదని, అయినా డబ్బులెక్కడికి పోతున్నాయన్నారు. ఆయాచోట్ల కేటీఆర్ వెంట బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు ఉన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పింది. ఆటో మీద ఉన్న 50 శాతం చలాన్లు మాఫీ చేస్తామన్నది. ప్రతి ఒక్కరికీ కొత్తగా బీమా సౌకర్యం పెంచుతామన్నది. నెలకు వెయ్యి చొప్పున ఏడాదికి 12 వేలు ఇస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసింది. ఇచ్చిన హామీల అమలుపై సర్కారు మెడలు వంచేందుకు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ పార్టీలకతీతంగా కలిసిరావాలి. అవసరమైతే తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా జాయింట్ యాక్షన్ కమిటీలాగా వేసుకుని ఉద్యమిద్దాం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు అరచేతిలో వైకుంఠం చూపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మరిచిపోయింది. ఇరవై రెండు నెలల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసింది. రాష్ట్రంలో 93 మంది మరణించినా.. కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లు మీరు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. మీకు బీఆర్ఎస్ అండగా ఉన్నది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిద్దాం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కార్మికక్షేత్రం పులకరించిపోయింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన రథోత్సవం సుమారు గంట వరకు సాగింది. ఈ ఉత్సవంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథాన్ని తాడుతో లాగారు.
నేత్రపర్వం.. వేంకటేశ్వరుడి రథోత్సవం : సిరిసిల్ల జిల్లాకేంద్రంలో వేంకటేశ్వరస్వామి రథోత్సవంలో కిక్కిరిసిన భక్తజనం, తాడుతో రథాన్ని లాగుతున్న మాజీ మంత్రి కేటీఆర్