కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 24 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. గురువారం రాత్రి 8.30 గంటల తర్వాత నగరంలోని గంగుల నివాసానికి చేరుకున్న ఆయన, మొదట లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే కమలాకర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆ తర్వాత ఇంటి ఆవరణలో బీఆర్ఎస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. కేటీఆర్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్, రవీందర్‌రెడ్డి నివాళులర్పించారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 24: కరీంనగర్లో ఎమ్మెల్యే గంగులను పరామర్శించిన అనంతరం కేటీఆర్, రాత్రి సిరిసిల్లకు చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో బస చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి 10:15 గంటల వరకు అక్కడే అందుబాటులో ఉండనున్నారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించే బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తెలిపారు.