Korutla | కోరుట్ల, ఫిబ్రవరి 7 : కోరుట్ల లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. స్థానిక కల్వగుడ్డ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రచార రథం నుంచి మంత్రి ప్రసంగిస్తున్నారు.
అదే సమయంలో స్థానిక రజక వాడకు చెందిన కుమ్మనపల్లి శశికళ అనే మహిళా మృతి చెందగా, శవ యాత్ర అదే దారి గుండా వెళుతుంది. గమనించిన పోలీసులు శవయాత్రను అడ్డుకున్నారు. మంత్రి ప్రసంగం ముగిసినాకే అనుమతిస్తామని శవ యాత్రను నిలిపి వేశారు. విషయాన్ని స్థానిక నాయకులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. మండుటెండలో మంత్రి ప్రసంగం ముగిసే వరకు అరగంట పాటు శవంతో రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులు నిరీక్షించారు.
అయినా పోలీసులు శవ యాత్రకు నిరాకరించడంతో గొడవకు దిగారు. విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు గాబరా పడి ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో శవ యాత్ర కు పోలీసులు అనుమతించారు.