కోరుట్ల : పట్టభద్రుల భవిత కోసం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే (Korutla MLA) డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల (Kalwakuntla Sanjay) చెప్పారు. గురువారం మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల నాయకులు పట్టభద్రుల అభ్యున్నతి కోసం ఏం చేస్తారో చెప్పకుండా కులాలు, మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారని ఆరోపించారు. వాళ్లు పిచ్చిమాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ పోటీలో పార్టీ అభ్యర్థి లేరని, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీల గుర్తులుండవని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కౌన్సిలర్లు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.