కోరుట్ల, ఆగస్టు 3 : “పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకులా..?’ అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా రం కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ప్రెస్మీట్ నిర్వహించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే స్పందించారు.
“ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే బాలొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహణకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులే అన్ని ఏర్పాట్లు చేశారు. అదే కోరుట్ల మండలంలోని అయిలాపూర్ రైతు వేదిక వద్ద రైతు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెడితే పోలీసులే దగ్గరుండి ప్రెస్ మీట్ అడ్డుకుంటారు.. ఇదేమి పాలన” అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
“వీళ్లు పోలీసులా? లేక అనధికార కాంగ్రెస్ నాయకులా?. తెలంగాణ డీజీపీ ఇప్పటికైనా వ్యవస్థను కాపాడండి” అంటూ ఎక్స్ ఖాతాలో ట్విట్టర్ వేదికగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్మీట్ ఫొటోలు, అయిలాపూర్లో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్న ఫొటోలను జత పరిచి ఎమ్మెల్యే ట్యాగ్ చేశారు.